చండీఘర్: ఈ ఏడాది (2024) సెప్టెంబర్‌లో జరిగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేసింది. ఈవీఎంలు హ్యాక్ అయ్యాయని.. పలు నియోజకవర్గాల్లో మొత్తం ఓట్లకు పోలైన ఓట్లకు మధ్య భారీ వ్యత్యాసం ఉందని ఆరోపించింది. ఈవీఎంల బ్యాటరీలపైన కాంగ్రెస్ అనుమానాలు వ్యక్తం చేసింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో కాంగ్రెస్ ఫిర్యాదులను పరిశీలించిన ఈసీ.. తాజాగా మంగళవారం (అక్టోబర్ 29) ఆ పార్టీ చేసిన ఆరోపణలకు వివరణ ఇచ్చింది. హర్యానా ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ కాంగ్రెస్ చేసిన ఆరోపణలు అన్నీ నిరాధార, తప్పుడు ఆరోపణలని ఈసీ కొట్టిపారేసింది. ఎన్నికల ప్రక్రియపై, ఈవీఎంలపై అసత్య ఆరోపణలు చేయడం ఇకనైనా మానుకోవాలని కాంగ్రెస్ పార్టీకి సూచించింది.
ముఖ్యంగా పోలింగ్, కౌంటింగ్ రోజుల వంటి సున్నితమైన సమయాల్లో ఇటువంటి బాధ్యతారాహిత్య ఆరోపణలు ప్రజా శాంతికి భంగం కలిగించడంతో పాటు గందరగోళాన్ని ప్రేరేపించగలవని నొక్కి చెప్పిన ఎలక్షన్ కమిషన్.. సరైన సాక్ష్యాలు లేకుండా ఎన్నికల కార్యకలాపాలపై విమర్శలు చేసే అలవాటుకు దూరంగా ఉండాలని కాంగ్రెస్‌కు సూచించింది. ఈవీఎంల బ్యాటరీలపై కాంగ్రెస్ లేవనెత్తిన అనుమానాలపైన ఈసీ క్లారిటీ ఇచ్చింది. ఈవీఎంల బ్యాటరీ వోల్టేజ్, సామర్థ్యం ఓట్ల లెక్కింపు ప్రక్రియపై లేదా యంత్రాల సమగ్రతపై ఎటువంటి ప్రభావం చూపదని ఈసీ స్పష్టం చేసింది.
ALSO READ | ఈవీఎంలు హ్యాక్: హర్యానా ఫలితాలపై కాంగ్రెస్ సంచలన ఆరోపణలు
కంట్రోల్ యూనిట్‌లో బ్యాటరీల పర్సంటేజ్ ప్రదర్శించడానికి కారణం.. సాంకేతిక బృందాల పవర్ లెవల్స్‌ను పర్యవేక్షించడంలో సహాయపడటంతో పాటు పోలింగ్ సజావుగా సాగడానికేనని ఈసీ వివరణ ఇచ్చింది. బ్యాటరీ పర్సంటేజ్ ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపిస్తోందంటూ వస్తోన్న ఆరోపణలన్నీ అపరాధమైనవిగా ఈసీ అభివర్ణించింది. భారతదేశ ఎన్నికల వ్యవస్థకు వెన్నెముకగా నిలిచే ఈవీఎంల గురించి అసత్య, నిరాధార, బాధ్యతారహితమైన వాదనలు చెయొద్దని ఈ సందర్భంగా కమిషన్ కాంగ్రెస్‌కు స్వీట్ వార్నింగ్ ఇచ్చింది.
కాగా, 2024, అక్టోబర్ 1వ తేదీన హర్యానా అసెంబ్లీ ఎన్నికలు జరగగా.. 2024, అక్టోబర్ 23వ తేదీన ఫలితాలు వెలువడిన విషయం తెలిసిందే. హర్యానాలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలుండగా.. 48 సీట్లు గెలిచి బీజేపీ హ్యాట్రిక్ విజయం నమోదు చేసింది. హర్యానాలో తప్పకుండా గెలుస్తామనుకున్న కాంగ్రెస్ కేవలం 37 సీట్లకే పరిమితమై.. విజయం ముంగిట బోల్తా కొట్టింది. అయితే, హర్యానాలో కాంగ్రెస్ పార్టీనే విజయం సాధిస్తోందని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులు చేస్తూ ముచ్చటగా మూడోసారి బీజేపీ విజయం సాధించింది. దీంతో హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ కాంగ్రెస్ పార్టీ ఈసీని ఆశ్రయించింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ఆరోపణలకు పై విధంగా ఈసీ వివరణ ఇచ్చింది.