ఈసీ పరదా : భద్రాద్రి రాములోరి కల్యాణం టీవీల్లో చూడలేం

= నవమి ఉత్సవాల లైవ్ టెలికాస్ట్ కు నో
= డీడీ ద్వారానైనా పర్మిషన్ ఇవ్వండి
= లక్షలాది మంది ఏండ్లుగా వీక్షిస్తారు 
= ఈసీకి దేవాదాయ శాఖ మంత్రి లెటర్
= కమిషన్ నిర్ణయం కోసం నిరీక్షణ
= ఏప్రిల్ 17న శ్రీరామనవమి ఉత్సవాలు
=  భద్రాచలంలో పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్న సీఎస్ శాంతి కుమారి

హైదరాబాద్: ఇల వైకుంఠపురి మన భద్రగిరి.. ఇక్కడి మిథిలా స్టేడియంలో జరిగే సీతారాముల కల్యాణాన్ని టీవీల్లో కనులారా వీక్షించడం పరిపాటి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు టీవీలకు అతుక్కుపోయి ఆ జగదానందకారకుడు, జానకీ ప్రాణనాయకుడి కల్యాణోత్సవాన్ని తిలకిస్తూ భక్తి తన్మయత్వానికి లోనవుతారు. అలాంటి సీతారాముల కల్యాణోత్సవానికి ఎన్నికల కమిషన్ పరదా కట్టేసింది. కోడ్ నేపథ్యంలో ప్రత్యక్ష ప్రసారం కుదరని తేల్చింది. దీంతో రామభక్తులకు నిరాశే మిగిలింది.

దూరదర్శన్ (డీడీ)లోనైనా అనుమతి ఇవ్వాలని కోరుతూ దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు.  రాములోరి కల్యాణానికి ప్రత్యక్ష ప్రసారానికి అనుమతివ్వాలని విజ్ఞప్తి చేశారు. లక్షలాది మంది భక్తులు ఆ అద్భుతఘట్టం కోసం ఎదురుచూస్తారని, ఏడాదికి ఒకసారి వచ్చే ఇలాంటి కార్యక్రమాన్ని ఆపడం సరికాదని ఆమె కోరారు.

మరోవైపు ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో కళ్యాణ క్రతువుకు సీఎం రేవంత్ రెడ్డి కూడా దూరం ఉండనున్నారు. దీంతో ప్రభుత్వం తరపున ముత్యాల తలంబ్రాలు, సీఎస్ శాంతికుమారి, దేవాదాయ శాఖ అధికారులు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. రేపు మిథిలా స్టేడియంలో అభిజిత్ లగ్నంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం జరగనుంది. 18న మహా పట్టాభిషేకానికి గవర్నర్ సీపీ రాధాకృష్ణ హాజరయ్యే అవకాశం ఉంది.