- పోలింగ్‌కు రెండు రోజుల ముందే లిక్కర్ బంద్
- క్యాండిడేట్లతో క్యాంపులు నిర్వహించడం కుదరదు
- గైడ్‌లైన్స్ జారీ చేసిన ఎన్నికల కమిషన్
హైదరాబాద్, వెలుగు : జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న క్యాండిడేట్లు ప్రచారం కోసం లౌడ్ స్పీకర్లు, మైకులను ఉపయోగించడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం కొన్ని షరతులు పెట్టింది. క్యాండిడేట్లు, రాజకీయ పార్టీలు అనుసరించాల్సిన రూల్స్, గైడ్‌లైన్స్ విడుదల చేసింది. ఆథరైజ్డ్ ఆఫీసర్ నుంచి పర్మిషన్ లేకుండా లౌడ్ స్పీకర్లు ఉపయోగించకూడదు. రికార్డింగ్ చేసిన ఉపన్యాసాలు వినిపించడానికి మాత్రమే లౌడ్ స్పీకర్‌లను, మైక్‌లను ఉపయోగించుకోవచ్చు. వీటితో పాటలు, మ్యూజిక్ ప్లే చేయకూడదు. బహిరంగ సభలు, రోడ్ షోలలో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు, ఇతర ప్రచారాల కోసం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే మైక్‌లు ఉపయోగించాలి. ప్రచారం సందర్భంగా హాస్పిటళ్లలోని రోగులు సౌండ్ పొల్యూషన్‌తో ఇబ్బంది పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఊరేగింపు తీయదల్చుచుకున్న పార్టీలు, క్యాండిడేట్లు ముందే అనుమతులు తీసుకోవాలి. ఊరేగింపు మార్గాల్లో ఏవైనా రిస్ట్రిక్షన్లు ఉంటే వాటిని కచ్చితంగా పాటించాలి. ఒకే రోడ్డులో రెండు, లేదా అంతకన్నా ఎక్కువ పార్టీలు ఒకే టైంలో ర్యాలీలు చేయవలసి వస్తే ఒకరికొకరు ఎదురుపడకుండా పోలీసులు ముందు జాగ్రత్తలు తీసుకుంటారు. పోలింగ్, ఓట్ల లెక్కింపునకు 48 గంటల ముందే లిక్కర్అమ్మకాలను నిలిపివేస్తారు. ఓటర్ స్లిప్పులపై ఓటర్ పేరు, ఇతర వివరాలు మాత్రమే ఉండాలి. అధికార పార్టీ నిర్వహించే ప్రచార కార్యక్రమాల్లో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనకూడదు.
గెలిచినవారితో క్యాంపులు చట్టవ్యతిరేకం
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గెలుపొందిన క్యాండిడేట్లతో క్యాంపులు నిర్వహించడం చట్ట వ్యతిరేకమని ఎస్‌ఈసీ తేల్చిచెప్పింది. ఇలాంటివి మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికను ప్రభావితం చేస్తాయని పేర్కొంది. గెలిచిన వారికి క్యాంపుల్లో విలాసవంతమైన సౌకర్యాలు కల్పించడం, భారీగా ఖర్చు చేయడం ఓటర్లను అవమానించడమేనని స్పష్టం చేసింది. గెలిచిన క్యాండిడేట్ తన పార్టీ జారీ చేసిన విప్‌కు వ్యతిరేకంగా ఓటు వేయకూడదు. అలా చేస్తే మొదటి సాధారణ సమావేశంలోనే సభ్యత్వాన్ని కోల్పోతాడు. ఎస్‌ఈసీ నిబంధనలు అతిక్రమిస్తే చట్ట ప్రకారం శిక్ష ఉంటుంది. ఎన్నికల డ్యూటీల్లోని ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు రూల్స్ అతిక్రమించినా ప్రాసిక్యూషన్ ఉంటుందని ఎస్‌ఈసీ స్పష్టం చేసింది.