టీఆర్ఎస్కు ఓటేయకపోతే స్కీంలు ఆగుతాయనడంపై సీరియస్
ఇయ్యాల మధ్యాహ్నంలోపు వివరణ ఇవ్వాలని ఆదేశం
లేకుంటే తగిన నిర్ణయం తీస్కుంటామని వార్నింగ్
హైదరాబాద్ : మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ కు ఓటేయకుంటే సంక్షేమ పథకాలు ఆగిపోతాయన్న మంత్రి జగదీశ్ రెడ్డి కామెంట్లపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) సీరియస్ అయింది. ఓటర్లను బెదిరించడం ద్వారా ఎలక్షన్ కోడ్‌ను ఉల్లంఘించడానికి సంబంధించి వివరణ ఇవ్వాలంటూ మంత్రికి నోటీసులు ఇచ్చింది. శనివారం మధ్యాహ్నం 3 గంటలలోపు వివరణ ఇవ్వాలని, లేకపోతే తాము తగిన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం సందర్భంగా ఈ నెల 25న మంత్రి జగదీశ్‌రెడ్డి చేసిన ప్రసంగంపై బీజేపీ నేత కపిలవాయి దిలీప్ కుమార్ ఈసీకి కంప్లయింట్ చేశారు.
ఆయన ఫిర్యాదు ఆధారంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి, నల్గొండ జిల్లా ఎన్నికల అధికారి నుంచి ఈసీ నివేదిక తెప్పించుకుంది. టీఆర్ఎస్కు ఓటేయకపోతే సంక్షేమ పథకాలను నిలిపివేస్తామంటూ జగదీశ్‌రెడ్డి హెచ్చరించినట్లు నివేదికలో పేర్కొన్నారు. ‘‘రూ.2 వేల పెన్షన్ కావాల్నా, వద్దా? రైతుబంధు, 24 గంటల కరెంట్, దివ్యాంగులకు పెన్షన్ వంటి స్కీములు అమలు కావాలంటే కేసీఆర్‌కు ఓటేయాలె. ఇవన్నీ ఆగిపోవాలంటే మోడీకి ఓటు వేయాలె” అని మంత్రి కామెంట్లు చేశారు. ఆయన ప్రసంగం నోట్‌ను కూడా జిల్లా ఎన్నికల అధికారి ఈసీకి పంపారు. వీటిని పరిగణనలోకి తీసుకున్న ఈసీ.. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లు అభిప్రాయానికి వచ్చింది.