తెలంగాణ యూనివర్సిటీ పాలక మండలి సమావేశం

డిచ్​పల్లి, వెలుగు: తెలంగాణ యూనివర్సిటీ ఈసీ (పాలక మండలి) మీటింగ్​ రాష్ట్ర ఉన్నత విద్యామండలి జోక్యంతో ఎట్టకేలకు 17 నెలల  తర్వాత హైదరాబాద్​లో బుధవారం జరగనుంది. ప్రతి 3 నెలలకోసారి మీటింగ్​ నిర్వహించాలనే  రూల్​ ఉన్నప్పటికీ   ఏడాదిన్నరగా నిర్వహించలేదు. చివరిసారిగా 2021 నవంబర్​ 27న హైదరాబాద్​లోనే ఈసీ మీటింగ్​నిర్వహించారు. వర్సిటీలో జరిగే అన్ని చెల్లింపులు, అభివృద్ధి పనులు, నియామకాలు, ప్రమోషన్లకు ఈసీ ఆమోదం తప్పనిసరి అయినప్పటికీ, వీసీ రవీందర్​ గుప్తా ఇవేమీ పట్టించుకోకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్నారని విమర్శలున్నాయి. ఇష్టారాజ్యంగా నియామకాలు, ప్రమోషన్లు, సామగ్రి కొనుగోలు చేశారని స్టూడెంట్లు ఆరోపిస్తున్నారు. ఈసీ లో చర్చించాల్సిన ఎజెండాను కూడా పూర్తి వివరాలతో పంపకుండా, 5 పాయింట్లతో  నామ్​కే వాస్తే గా పంపించారని పాలకమండలి మెంబర్లు కూడా వీసీపై సీరియస్​గాఉన్నారు. దీంతో  మీటింగ్​లో ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ  నెలకొంది.


అక్రమ నియామకాలు, అడ్డగోలు కొనుగోళ్లు

టీయూ వీసీ గా రవీందర్​ గుప్తా  నియామకమైనప్పటి నుంచి  ఆయన వైఖరి వివాదాస్పదంగానే ఉంది. ప్రభుత్వం, ఈసీ  పర్మిషన్​లేకుండా 2021 అక్టోబర్​ లో ​100 కు పైగా  ఔట్​సోర్సింగ్​ఎంప్లాయీస్​ను నియమించారు. అక్రమ నియామకాలపై  స్టూడెంట్​యూనియన్లు ఆందోళనలు చేయడంతో అదే నెల 30 న జరిగినఈసీ మీటింగ్​లో నియామకాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. కొన్ని రోజులు సైలెంట్​ గా ఉండి డైలీ వేజ్​ పేరుతో  అడపాదడపా నియామకాలు చేస్తూ వచ్చారు. ఇటీవల మళ్లీ 100 మంది  ఎంప్లాయీస్​ను నియమించారు. టీచింగ్​, నాన్​టీచింగ్​ స్టాఫ్​ కి అడ్డగోలుగా ప్రమోషన్లు కల్పించారు. ఈ తతంగంలో లక్షల రూపాయలు చేతులు మారినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.  ఇవే కాకుండా వర్సిటీ లోని అన్ని  డిపార్ట్​మెంట్లలో మౌలిక వసతుల పేరుతో అవసరం లేకున్నా..  అడ్డగోలుగా కంప్యూటర్లు, ఏసీలు, ఇతర సామగ్రిని కొనుగోలు చేశారు. కమీషన్ల కోసం అవసరానికి మించి కొన్నారనే విమర్శలు ఉన్నాయి. అంతే కాకుండా వీటిలో ఏ ఒక్కదానికి కూడా ఈసీ ఆమోదం లేదు.


రిజిస్ట్రార్​ ను మార్చే అవకాశం?

 2021 మే లో వీసీగా  వచ్చిన రవీందర్​ గుప్తా తరచూ  రిజిస్ట్రార్​లను మార్చుతూ వస్తున్నారు. ఆయన బాధ్యతలు తీసుకునే నాటికే రిజిస్ట్రార్​ గా ఉన్న ప్రొఫెసర్​ నసీం ను ఆ యేడు సెప్టెంబర్​ 1 న తొలగించి ప్రొఫెసర్​ కనకయ్యను  నియమించారు. ఆతర్వాత అక్రమ నియామకాలు వెలుగు చూడడంతో అక్టోబర్​ 30 న ఈసీ మీటింగ్​ లో నియామకాలు రద్దు చేసి  కనకయ్యను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈసీ ఆమోదంతో అదే రోజు  ప్రొఫెసర్​ యాదగిరిని రిజిస్ట్రార్​ గా నియమించారు. ఆ తర్వాత  ఈసీ నియామకాన్ని కాదని 40 రోజులకే యాదగిరిని తొలగించి  వీసీ ప్రొఫెసర్​ శివశంకర్​ ని రిజిస్ట్రార్​ గా  నియమించారు. అనంతరం 8 నెలల పాటు ఆయన్ను కొనసాగించి ఇటీవల  ప్రొఫెసర్ విద్యావర్థినిని రిజిస్ట్రార్​ గా నియమించారు. ఈసీ ఆమోదం లేకుండా నియమించిన   విద్యావర్ధినిని ఆ పదవి లో కొనసాగించేందుకు ఈసీ మెంబర్లు సిద్ధంగా లేరనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తిరిగి ప్రొఫెసర్​ యాదగిరి ని లేదా మరొకరిని రిజిస్ట్రార్​ గా నియమించే ఛాన్స్​ఉన్నట్లు తెలుస్తోంది. 

నామ్​కే వస్తే ఎజెండా..

ఈసీ మీటింగ్​కు కనీసం వారం రోజుల ముందు పూర్తి వివరాలతో కూడిన ఎజెండాని ఈసీ మెంబర్లకు అందజేయాల్సి ఉంటుంది. కానీ వర్సిటీ ఆఫీసర్లు 5 పాయింట్ల తో కూడిన  నామ్​కే వాస్తే ఎజెండాని  పంపించారని ఈసీ మెంబర్లు చెప్తున్నారు. గతంలో  ప్రతి ఎజెండా పాయింట్​ కి సంబంధించిన పూర్తి వివరాలు ఇచ్చేవారని అంటున్నారు. అలా ఇవ్వకపోగా ఈ అంశాలను  కూడా  రెండు రోజుల ముందు మెయిల్​చేశారని చెప్తున్నారు.  


ఎజెండాలోని 5 పాయింట్లు

1. ఇన్ చార్జి రిజిస్ట్రార్​ విద్యావర్థిని నియామకంపై ఆమోదం 
2. 2022–2023 బడ్జెట్ కు​ ఆమోదం 
3. 2023–2024 బడ్జెట్ కు​ ఆమోదం 
4. అకడమిక్​ పదవుల నియామకం పై ఆమోదం 
5. చైర్మన్ ఆమోదంతో ఇతర అంశాల పై చర్చ