బీఆర్‌‌ఎస్ నేతలు డబ్బులు దాచారు.. ఎన్నికల అధికారులకు ఫిర్యాదు వెళ్లగా తనిఖీలు

  • బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాల దాడి
  • మేడిపల్లిలో ఘటన

మేడిపల్లి, వెలుగు: మేడ్చల్‌ జిల్లా పీర్జాదిగూడ కార్పొరేషన్ పరిధిలోని మేడిపల్లిలోని ఎవీ ఇన్ఫోప్రైడ్ అపార్ట్‌మెంట్‌లోని ఒక ప్లాట్‌లో బీఆర్‌‌ఎస్ పార్టీకి చెందిన నగదు ఉందని ఫిర్యాదు రావడంతో ఎన్నికల అధికారులు ఆదివారం తనిఖీ చేపట్టారు.  ఈ సందర్భంగా బీఆర్‌‌ఎస్ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.  మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌‌ రెడ్డితో పాటు కాంగ్రెస్ నేతలు సంఘటనా స్థలానికి చేరుకుని ఎన్నికలు సజావుగా నిర్వహించాలని అధికారులను డిమాండ్ చేశారు. 

లేకపోతే ఎన్నికల కమిషనర్‌‌కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఈ సమయంలో పీర్జాదిగూడ మేయర్‌‌ బీఆర్‌‌ఎస్ నాయకులు జక్క వెంకట్‌ రెడ్డి ఏవీ ఇన్పోప్రైడ్‌కు తన అనుచరులతో చేరుకుని పీర్జాదిగూడ కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీలత, కాంగ్రెస్ కార్యకర్తలపై  దాడులకు దిగారు.  మహిళ అని చూడకుండా విచక్షణారహితంగా దాడులు చేశారన్నారు.  కాంగ్రెస్ కార్యకర్తలపై దాడి చేసిన మేయర్ జక్కా వెంకట్ రెడ్డి, అతడి అనుచరులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.