అమరావతి: ఏపీలో తూర్పుగోదావరి-పశ్చిమ గోదావరి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం(నవంబర్ 04) షెడ్యూల్ విడుదల చేసింది. ఈ ఉప ఎన్నికకు ఈ నెల 11న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఈసీ తెలిపింది. నవంబర్ 18వరకు నామినేషన్లు స్వీకరించి.. 19న నామినేషన్లను పరిశీలన చేపట్టనున్నారు. అనంతరం నామినేషన్ల ఉపసంహరణకు నవంబర్ 21 వరకూ గడువు ఇవ్వనున్నారు. ఇక డిసెంబర్ 5న పోలింగ్ నిర్వహించనుండగా.. డిసెంబర్ 9న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటించనున్నారు.
ఎందుకీ ఉప ఎన్నిక..?
తూర్పుగోదావరి- పశ్చిమ గోదావరి ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఉన్న షేక్ సాబ్జీ(పీడీఎఫ్) రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో ఉప ఎన్నిక నిర్వహించనున్నారు.