న్యూఢిల్లీ: మహారాష్ట్ర, జార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో నేతల విమర్శలు, ప్రతి విమర్శలతో వాతావరణం వేడెక్కింది. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించారంటూ బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఒకరిపై మరొకరు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీనిపై ఈసీ స్పందించింది. కోడ్ ఉల్లంఘనపై వివరణ ఇవ్వాలంటూ బీజేపీ అధ్యక్షుడు నడ్డా, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు లేఖలు రాసింది.
రాహుల్‌పై బీజేపీ.. అమిత్ షా పై కాంగ్రెస్..
ముంబైలో ఈ నెల 6న నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో రాహుల్‌గాంధీ ఎన్నికల ప్రవర్తనా నియామవళిని ఉల్లంఘించేలా మాట్లాడారని ఈసీకి బీజేపీ ఫిర్యాదు చేసింది. జార్ఖండ్‌లోని ధన్బాద్లో ఈ నెల 12న నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో కాంగ్రెస్, దాని మిత్రపక్షాలపై తప్పుడు, విభజనపూరిత, దురుద్దేశపూరిత ప్రకటనలు చేశారంటూ అమిత్ షాపై ఈసీకి కాంగ్రెస్ కంప్లయింట్ చేసింది.