శాతవాహన యూనివర్సిటీలో ఈసీ వర్సెస్ వీసీ

కరీంనగర్, వెలుగు : శాతవాహన యూనివర్సిటీలో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు, వైస్ చాన్స్ లర్ మధ్య పంచాయితీ రోజురోజుకు ముదురుతోంది. శాతవాహన వర్సిటీ ఉద్యోగుల లెక్కల్లో గందరగోళంపై వివరణ ఇవ్వాలని ఆరుగురు ఈసీ మెంబర్స్​ఈ నెల 8న యూనివర్సిటీ రిజిస్ట్రార్ కు లెటర్​రాసిన విషయం తెలిసిందే.

యూనివర్సిటీలో పనిచేస్తున్న 185 మంది  ఔట్ సోర్సింగ్ (ఎస్ హెచ్ జీలు, వారధి, ఇతర ఏజెన్సీ ఎంప్లాయీస్) ఉద్యోగుల పేర్లు, హోదాలు, అనుభవం, అర్హతలు, అపాయింట్‌మెంట్ విధానం, అపాయింట్‌మెంట్ తేదీ, జీతం వివరాలతో కూడిన లిస్టు అందించాలని, వారి 6 నెలల పే స్లిప్పులతోపాటు ఇతర వివరాలు ఇవ్వాలని కోరారు. అయితే ఈ లెటర్​కు యూనివర్సిటీ నుంచి రిప్లై కోసం ఈసీ మెంబర్స్​ ఎదురుచూస్తుండగానే.. తెరపైకి ఉద్యోగ సంఘాల నాయకులు రావడం చర్చనీయాంశంగా మారింది. దీంతో ఇప్పటి వరకు వీసీ వర్సెస్ ఈసీగా సాగిన వ్యవహారం ఈసీ వర్సెస్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ వర్కర్స్ గా మారేలా ఉంది. 

ఈసీ మెంబర్స్ పై ఎదురుదాడి..  

యూనివర్సిటీకి ప్రభుత్వం 410 ఉద్యోగాలు సాంక్షన్ చేస్తూ నిరుడు జీవో నంబర్ 1222 విడుదల చేసింది. ఇందులో ప్రస్తుతం185 మంది మాత్రమే పనిచేస్తున్నట్లు తమకు సమాచారం ఉందని, మిగతా 225 మంది ఉద్యోగులు పని చేస్తున్నారా ? లేదా ? ఈ నియామకాలను ఈసీ ఆమోదించిందా? ఏ ప్రాతిపదికన సెలెక్ట్ చేశారు ? అని ఇటీవల రిజిస్ట్రార్ కు రాసిన లెటర్​లో ఈసీ మెంబర్స్​వివరణ కోరారు.

లెటర్​లో ఇలా ఉంటే ఉద్యోగ సంఘాల నాయకులు మాత్రం జీవో 1222నే ఈసీ మెంబర్స్​వ్యతిరేకిస్తున్నారని, తమకు ఉద్యోగ భద్రత లేకుండా కుట్ర చేస్తున్నారని ఎదురు దాడికి దిగడం గమనార్హం. మరోవైపు తాము ఎక్కడా ఉద్యోగులకు రావాల్సిన బెనిఫిట్స్​ఆపాలని, కొత్తగా బెనిఫిట్స్​ఇవ్వొద్దని ఏనాడూ అనలేదని ఈసీ మెంబర్స్​వాదిస్తున్నారు. నిజానికి ఈ నెలాఖరుతో ఈసీ కాలపరిమితి పూర్తి కానుంది. దీంతో ఈ లోపే ఉద్యోగుల సంఖ్యపై ఏదో ఒకటి తేల్చుకోవాలని సభ్యులు సిద్ధమైనట్లు తెలిసింది. 

Also Read : నల్గొండలో టెన్షన్‌.. టెన్షన్‌.. కాంగ్రెస్‌, బీఆర్‌‌ఎస్‌ పోటాపోటీగా సభలు

14 ఏండ్లుగా పనిచేస్తున్నం.. 

యూనివర్సిటీ ప్రారంభించనప్పటి నుంచి మేం చిరుద్యోగులుగా సేవలందిస్తున్నాం. 2018 వరకు హైర్డ్ వర్కర్స్ గా, ఆ తర్వాత కలెక్టర్ గెజిట్ కింద సెల్ఫ్ హెల్ప్ గ్రూపులుగా పని చేస్తున్నాం. మాకు 14 ఏండ్లుగా ఈఎస్ఐ, పీఎఫ్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత లేదు. ఈ క్రమంలోనే వీసీ మల్లేశ్​మమ్మల్ని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులుగా తీసుకునేందుకు జీవో నంబర్ 1222 తీసుకొచ్చారు. ఈ జీవో ప్రకారం మాకు వేతన స్థిరీకరణ జరగనుంది. కానీ, ఈసీ సభ్యులు ఈ జీవోతో విభేదిస్తూ సంబంధం లేని ఉద్యోగుల సంఖ్యను ప్రచారం చేస్తున్నారు. ఇదంతా దళిత, బహుజన ఉద్యోగులకు ఉద్యోగ భద్రత లేకుండా చేసే కుట్ర.

- పి. చంద్రశేఖర్, ప్రెసిడెంట్, ఆల్ యూనివర్సిటీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్