‘ఎమ్మెల్సీ’ ప్రచారంలో టీచర్లు పాల్గొంటే వేటు

  • అభ్యర్థులు, టీచర్లకు ఈసీ, విద్యాశాఖ అధికారుల వార్నింగ్ 

హైదరాబాద్,వెలుగు: రాష్ట్రంలో త్వరలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగే ఎన్నికలపై ఎలక్షన్ కమిషన్ నజర్ పెట్టింది. ప్రస్తుతం రెండు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనుండటంతో  చాలామంది సర్కారు స్కూళ్ల టీచర్లు ప్రత్యక్ష్యంగా, పరోక్షంగా ప్రచారంలో పాల్గొంటున్నారు. అయితే, ఇది నిబంధనలకు విరుద్ధమని అధికారులు చెప్తున్నారు. ప్రచారంలో పాల్గొన్న టీచర్లు, సర్కారు ఉద్యోగులపై వేటు తప్పదని హెచ్చరిస్తున్నారు. మార్చిలో రెండు టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో దానికి సంబంధించిన ఏర్పాట్లపై ఎన్నికల కమిషన్ కసరత్తు చేపట్టింది. 

ఈ క్రమంలోనే ఎన్నికల ప్రచారంపైనా నిఘా పెట్టింది. అయితే, బడుల్లో ప్రచారం చేయొద్దని ఇప్పటికే ఆయా సెగ్మెంట్ల ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్లు ఉత్తర్వులు జారీచేశారు. ఎన్నికల నిబంధనల ప్రకారం.. ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా తమ ఆఫీసుల్లో, లేదా ఇంటింటి ఎన్నికల ప్రచారంలో పాల్గొనవద్దు. స్కూళ్లలో, సర్కారు ఆఫీసుల్లో అభ్యర్థులు ప్రచారం చేయొద్దు. కేవలం అభ్యర్థులు, ఉద్యోగులుకాని వాళ్లు మాత్రమే ఇంటింటి ప్రచారం చేసుకునే అవకాశం ఉంది. కానీ, పలువురు టీచర్లు, సంఘాల నేతలు ప్రచారంలో పాల్గొంటున్నారు. దీనిపై ఎన్నికల కమిషన్​కు, విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదులు వస్తున్నాయి. 

తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థిగా ఉన్న ఓ టీచర్ సంఘం నేతపై కొందరు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయడంతో.. ఏకంగా ఆ లీడర్ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు.  చాలామంది టీచర్లు ఇంటింటి ప్రచారం చేస్తున్నారనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. దీనికి తోడు సోషల్ మీడియాలో కొందరు టీచర్లు అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. దీంతో ఎవరెవరు ప్రచారంలో పాల్గొంటున్నారనే వివరాల సేకరణకు ప్రత్యేకంగా టీములను ఏర్పాటు చేసే అవకాశాలున్నాయి. దీనికి ఈసీ చర్యలు చేపడుతున్నట్టు తెలిసింది.