ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆప్ అధినేత, మాజీ సీఎం కేజ్రీవాల్ ఇరకాటంలో పడ్డారు. ఢిల్లీకి వచ్చే యమునా నది జలాలను హర్యానా బీజేపీ ప్రభుత్వం విషపూరితం చేస్తోందని కేజ్రీవాల్ చేసిన వివాదస్పద వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. బీజేపీ ఫిర్యాదు మేరకు కేజ్రీవాల్‌కు లేఖ రాసింది ఈసీ. హర్యానా ప్రభుత్వం యమునా నీటిలో అమ్మోనియా కలుపుతోందని చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ఆధారాలు సమర్పించాలని ఈసీ లేఖలో కోరింది. 2025, జనవరి 29వ తేదీ రాత్రి 8 గంటలలోగా ఎవిడెన్స్ సమర్పించాలని కేజ్రీవాల్‌కు డెడ్ లైన్ విధించింది ఈసీ.
కేజ్రీవాల్ ఆరోపణల దృష్ట్యా.. హర్యానా నుంచి ఢిల్లీకి సరఫరా అవుతున్న యమునా నది నీటిలో అమ్మోనియా స్థాయిపై జనవరి 28లోగా వాస్తవ నివేదిక సమర్పించాలని హర్యానా ప్రభుత్వాన్ని కూడా ఈసీ ఆదేశించింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా జనవరి 27న కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ‘‘బీజేపీ తన నీచ రాజకీయాల కోసం ఢిల్లీ ప్రజలకు నీటి కొరత సృష్టించాలని చూస్తోంది. హర్యానా నుంచి ఢిల్లీకి వస్తోన్న నీటిలో విషం కలుపుతున్నారు. ఈ కలుషిత నీరు చాలా విషపూరితమైనది. దీనిని ఢిల్లీలో ఉన్న నీటి శుద్ధి కర్మాగారాల ద్వారా శుద్ధి చేయడం అసాధ్యం.
ఢిల్లీ వాసులను సామూహికంగా హత్య చేయాలని బీజేపీ కుట్ర చేస్తోంది. మేము దీనిని జరగనివ్వం. ప్రజలకు నీరు అందకుండా చేయడం కంటే పెద్ద పాపం మరొకటి లేదు’’ బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు. కేజ్రీవాల్ వ్యాఖ్యలు హర్యానా, ఢిల్లీ మధ్య వివాదానికి దారి తీశాయి. కేజ్రీవాల్ ఆరోపణలను హర్యానా సీఎం నాయబ్ సింగ్ సైనీ తీవ్రంగా ఖండించారు. కేజ్రీవాల్ కామెంట్స్‌ను సీరియస్‌గా తీసుకున్న బీజేపీ.. నిరాధార ఆరోపణలు చేసిన కేజ్రీవాల్‌పై చర్యలు తీసుకోవాలని ఈసీకి ఫిర్యాదు చేసింది. బీజేపీ కంప్లైంట్ మేరకు.. కేజ్రీవాల్‌కు ఈసీ లేఖ రాసింది.