Los Angeles 2028 Olympics: 2028 ఒలింపిక్స్.. ఒకే జట్టుగా పోటీపడనున్న ఇంగ్లండ్, స్కాట్లాండ్

Los Angeles 2028 Olympics: 2028 ఒలింపిక్స్.. ఒకే జట్టుగా పోటీపడనున్న ఇంగ్లండ్, స్కాట్లాండ్

వరల్డ్ కప్ లాంటి ఈవెంట్లు ఎన్ని గెలిచినా..  ఒలింపిక్స్ లో సాధించే ఒక్క పతకం ఎంతో ప్రత్యేకంగా నిలుస్తుంది. ఎంతో గొప్ప చరిత్ర ఉన్న ఒలింపిక్స్ లో క్రికెట్ లాంటి జెంటిల్ మెన్ గేమ్ లేకపోవడంతో చాలా మంది క్రికెట్ అభిమానులు నిరాశకు గురయ్యారు. అయితే  ఒలింపిక్స్‌లోకి మళ్లీ క్రికెట్ ఎంట్రీ ఇవ్వబోతోంది. 2028లో లాస్‌ ఏంజిల్స్‌ వేదికగా జరగనున్న ఒలింపిక్స్ లో క్రికెట్‌ను భాగం చేసేందుకు అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (IOC) ఆమోదం తెలిపింది. అధికార ప్రకటన రాకపోయినా 2028 ఒలింపిక్స్ కు క్రికెట్ ను చేర్చడం దాదాపుగా ఖాయమైంది.  

ఈ విశ్వ క్రీడలకు క్రికెట్ లో ఇంగ్లాండ్, స్కాట్లాండ్ కలిసి ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంగ్లాండ్, స్కాట్లాండ్ రెండూ కూడా గ్రేట్ బ్రిటన్ దేశాలు. దీంతో ఈ రెండు జట్లు కలిసి ఒక జట్టుగా మారనున్నాయని నివేదికలు చెప్పుకొస్తున్నాయి. దీని ప్రకారం 2028లో లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో టీమ్ గ్రేట్ బ్రిటన్‌కు ఇంగ్లాండ్, స్కాట్లాండ్ రెండు దేశాలకు చెందిన అగ్రశ్రేణి ఆటగాళ్లు కలిసి ఒక బలమైన జట్టుగా ఒలింపిక్స్ లో ఆడనున్నాయి. మెన్స్ తో పాటు.. ఉమెన్స్ క్రికెట్ లో ఈ మార్పులు జరుగనున్నాయని సమాచారం. 

"లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్ కు నాలుగు సంవత్సరాల సమయం ఉంది. ఇది ప్రారంభ దశ. గ్రేట్ బ్రిటన్, క్రికెట్ స్కాట్లాండ్ తో చర్చలు జరుపుతున్నాం. అని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ప్రతినిధి తెలిపారు. తొలిసారి 1900 పారిస్ ఒలింపిక్స్ గేమ్స్ సమయంలో క్రికెట్ క్రీడలను నిర్వహించారు. అప్పట్లో గ్రేట్ బ్రిటన్ జట్టు ఫైనల్లో ఫ్రాన్స్‌ను 158 పరుగుల తేడాతో ఓడించి.. విశ్వవిజేతగా నిలిచింది.