ఎకో ఫ్రెండ్లీ విగ్రహాలనే హుస్సేన్‌‌సాగర్‌‌లో నిమజ్జనం చేయాలి

ఎకో ఫ్రెండ్లీ విగ్రహాలనే హుస్సేన్‌‌సాగర్‌‌లో నిమజ్జనం చేయాలి
  • మూడేండ్ల తర్వాత కోర్టు ధిక్కరణ పిటిషన్​ వేయడమేంటని ప్రశ్న 
  • గతంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయాలని ఆదేశం
  • కోర్టు ధిక్కార పిటిషన్‌‌ కొట్టివేత.. 
  • తీర్పు వెల్లడించిన డివిజన్‌‌ బెంచ్‌‌ 

హైదరాబాద్, వెలుగు: హుస్సేన్‌‌సాగర్‌‌లో వినాయక విగ్రహాల నిమజ్జనంపై దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్‌‌ను అనుమతించలేమని హైకోర్టు మంగళవారం తేల్చిచెప్పింది. తీర్పు వెల్లడైన మూడేండ్ల తర్వాత పిటిషన్​ వేయడమేంటని ప్రశ్నించింది. మట్టి, ఎకో ఫ్రెండ్లీ విగ్రహాలను మాత్రమే హుస్సేన్‌‌సాగర్‌‌లో నిమజ్జనం చేయాలని, పీవోపీ (ప్లాస్టర్‌‌ ఆఫ్‌‌ పారిస్‌‌) విగ్రహాలను జీహెచ్‌‌ఎంసీ ఏర్పాటు చేసిన కృత్రిమ సరస్సుల్లోనే నిమజ్జనం చేయాలని ఆదేశించింది.

గతంలో ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయాలని  తెలిపింది. హుస్సేన్‌‌సాగర్‌‌లో విగ్రహాల నిమజ్జనానికి సంబంధించి గతంలో ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయలేదని, దీన్ని కోర్టు ధిక్కరణ కింద పరిగణించాలని న్యాయవాది మామిడి వేణుమాధవ్‌‌ వ్యక్తిగత హోదాలో కోర్టు ధిక్కరణ పిటిషన్‌‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌‌ టి.వినోద్‌‌కుమార్, జస్టిస్‌‌ జె.అనిల్‌‌కుమార్‌‌తో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. పిటిషనర్‌‌ వాదనలు వినిపిస్తూ గత ఏడాది హుస్సేన్‌‌సాగర్‌‌లో విగ్రహాల నిమజ్జనానికి 17 క్రేన్‌‌లను ఏర్పాటు చేశారన్నారు. విగ్రహాల నిమజ్జనం నిమిత్తం ఏర్పాటు చేస్తున్న భారీ క్రేన్ల వల్ల ట్యాంక్‌‌బండ్‌‌ భద్రతకు ప్రమాదం పొంచి ఉందన్నారు. 

దీనిపై కోర్టు జోక్యం చేసుకుంటూ.. మూడేండ్లుగా కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘన జరుగుతుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. ఇప్పుడు పండుగ సమయంలో కోర్టు ధిక్కరణ పిటిషన్‌‌ దాఖలు చేయడంలో ఉద్దేశాలేమున్నాయని నిలదీసింది. గతంలో కోర్టులు ఆదేశాలిచ్చేనాటికి లేని హైడ్రాను కోర్టు ధిక్కరణ పిటిషన్‌‌లో ప్రతివాదిగా ఎలా చేరుస్తారని ప్రశ్నించింది. పీవోపీ విగ్రహాల తయారీపై నిషేధం లేకపోయినా అధికారులు కేసులు నమోదు చేస్తున్నారని తెలంగాణ గణేష్‌‌ ముక్తి కళాకార్‌‌ వెల్ఫేర్‌‌ అసోసియేషన్‌‌ తరఫు న్యాయవాది ఎం.వి.దుర్గాప్రసాద్‌‌ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. పీవోపీ విగ్రహాల తయారీపై ఎలాంటి నిషేధం లేదని, కేవలం పీవోపీ విగ్రహాల నిమజ్జనంపైనేనని, ఇందులో జోక్యం చేసుకోవద్దని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.