అడవులతోనే పర్యావరణ సమతుల్యత

అడవులతోనే పర్యావరణ సమతుల్యత

మానవుల సుఖమయ జీవనానికి, శ్రేయస్సుకు అడవులు చాలా ముఖ్యం. మానవ జీవనంలో అడవుల పాత్రను గుర్తించడానికి యూఎన్​అంతర్జాతీయ అటవీ దినోత్సవాన్ని జరుపుతోంది. భూమి మీద దాదాపు 25% విస్తీర్ణంలో  సహజ అడవులు ఉన్నాయి.  ఈ అడవులు దాదాపు 3.8 బిలియన్ హెక్టార్లలో విస్తరించి ఉన్నాయి.  ఉత్తర అమెరికా, అంటార్కిటికా కలిపిన పరిమాణం అంత విస్తీర్ణం ఇది.

ప్రపంచ అటవీ విస్తీర్ణంలో కేవలం పది దేశాలలో మూడింట రెండు వంతుల విస్తీర్ణంలో అడవులు ఉన్నాయి.  అందులో రష్యా (20%),  బ్రెజిల్ (13%),  కెనడా (11%)లో  ఎక్కువగా ఉన్నాయి. ఇండోనేసియా, కాంగో వంటి దేశాలలో కూడా అడవులు గణనీయంగా ఉన్నాయి. పుడమి వాతావరణం మీద ఈ అడవుల ప్రభావం గణనీయంగా ఉంటుంది.  అనేక దేశాలలో అటవీ విస్తీర్ణం పడిపోతున్నది.

అడవులు ఎక్కువగా ఉన్న దేశాలు ఈ మధ్య అటవీ సంపదను తమ ఆదాయానికి ఉపయోగించి, ఎగుమతుల ద్వారా తమ దేశీయ ఆర్థికరంగాన్ని నిర్వహిస్తున్నాయి. అడవుల నరికివేతను ప్రోత్సహిస్తున్నాయి. పర్యావరణ పరిరక్షణ సదస్సులలో ఉన్న అటవీ విస్తీర్ణం కాపాడుకునే ప్రయత్నాలలో ఈ ధోరణి ఒక ఆటంకంగా మారింది. అయితే, అటవీ ఉత్పత్తుల మీద ఆధారపడిన ఆర్థిక రంగం వేరు అడవుల నరికివేత మీదనే ఆధారపడిన ఆర్థిక రంగం వేరు.

ఉష్ణోగ్రతను నియంత్రించాలంటే అడవులు చాలా కీలకం.  ఇప్పటికే పుడమి ఉష్ణోగ్రత 1.5 డిగ్రీలు పెరిగిన దరిమిలా ఉన్న అడవులను ఎట్టి పరిస్థితులలో కాపాడుకోవాలి. ఇప్పుడు చెట్లు నాటి, అడవి అభివృద్ధి అత్యంత అవసరమే అయినా అది సమయం తీసుకుంటుంది.  కనుక ఉన్న చెట్లను,  అడవిని, అటవీ ప్రాంతాలను కాపాడుకోవడం ప్రాధాన్యతగా గుర్తించాలి.  

ప్రస్తుత కర్బన ఉద్గారాలకు కారణమైన, కారణమవుతున్న దేశాలు.. అడవులను కాపాడడానికి తగిన నిధులు చెల్లించాలి.  అడవులు ఎక్కువగా లాటిన్ అమెరికా, ఆఫ్రికా ఖండాలలో ఉన్నందున అమెరికా, ఐరోపా దేశాలు ఈ దిశగా వేగంగా అడుగులు వేయాలి. భారతదేశంలో అడవులు 33 శాతం ఉండాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది.  ప్రాజెక్టుల కోసం వేల ఎకరాల అటవీ భూమి దారి మళ్ళింది.  

బాహ్య ప్రపంచంలోని 50% కంటే ఎక్కువ మొక్కలు, జంతు జాతులు అడవులలోనే ఉన్నాయని శాస్త్రవేత్తల ఆధ్యయనాలు చెబుతున్నాయి.  కొన్ని ఉష్ణమండల అడవులలో హెక్టారుకు 300 కంటే ఎక్కువ జాతుల చెట్లు ఉన్నాయి. గత 12,000 సంవత్సరాలలో ప్రపంచంలోని 46% చెట్లను తొలగించినట్లు ఒక పరిశోధనలో వెల్లడైంది.  ఖచ్చితమైన సంఖ్య చర్చనీయాంశమైనప్పటికీ, 2015 అధ్యయనంలో ప్రపంచంలో 3 ట్రిలియన్ చెట్లు ఉన్నాయని అంచనా వేసింది. వీటి సగటు వయస్సు 50 సంవత్సరాలకు మించి ఉండవచ్చు.  చెట్లను ఎట్టి పరిస్థితులోనూ కొట్టివేయకుండా అంతర్జాతీయ సదస్సులలో ప్రపంచ దేశాలు ఒక ఒప్పందానికి రావాల్సిన అవసరం ఉన్నది. 

తగ్గిపోతున్న అడవుల విస్తీర్ణం

భారతదేశంలో కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధ ప్రాతిపదికన అడవుల పరిరక్షణపై చర్చల అనంతరం తగిన చట్టం, విధానాలు ప్రకటించాలి. అడవులు పెద్ద మొత్తంలో కార్బన్‌‌ను నిల్వ చేస్తాయి. కర్బన ఉద్గారాలను ప్రాణ వాయువుగా మార్చే సామర్థ్యం గణనీయంగా అడవులకు ఉన్నది.  అడవులను, చెట్లను కాల్చినా, నరికినా  ఎక్కువ భాగం కార్బన్‌‌ వాతావరణంలోకి విడుదల అవుతుంది.

అందువల్ల, వాతావరణ మార్పులను నియంత్రించడానికి అటవీ సంరక్షణ,  పునరుద్ధరణ చాలా కీలకం. అడవులు కేవలం వాతావరణంలో కార్బన్ తగ్గించడమే కాకుండా స్థానిక ఉష్ణోగ్రతలను నియంత్రిస్తాయి, వర్షపాతం,  వాతావరణ నమూనాలను ట్రాన్స్‌‌పిరేషన్ ద్వారా నిర్వహించడంలో  ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.  నేల కోతను తగ్గిస్తాయి.  స్థానిక ఉష్ణోగ్రతలను మితంగా ఉంచడం, కరువు లేదా వరదల పునరావృతం కాకుండా నిరోధిస్తాయి. కాగా, ప్రపంచం ప్రతి సంవత్సరం విస్తారమైన అడవులను కోల్పోతోంది.  

మేరీల్యాండ్ విశ్వవిద్యాలయం డేటా ప్రకారం.. 2015 నుంచి ప్రతి సంవత్సరం 3 మిలియన్ హెక్టార్ల కంటే ఎక్కువ ప్రాథమిక అడవులను (primary forests) ఉష్ణమండల ప్రాంతాలు మాత్రమే కోల్పోతున్నాయి.  ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ శాతం అటవీ నష్టం జరగడానికి మానవ కార్యకలాపాలే కారణం.  పరిశ్రమల విస్తరణ, పట్టణాల విస్తరణ, పారిశ్రామిక వ్యవసాయం, పశువుల మాంసం ఉత్పత్తి కేంద్రాలు, గ్రీన్ ఫీల్డ్ రోడ్లు, రోడ్ల విస్తరణ, భవనాలు, భూముల ప్రైవేటీకరణ. మానవ కార్యకలాపాల వల్ల అడవుల విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోతున్నది.
చెర్నోబిల్ అణు ప్రమాదం వల్ల 

వాతావరణంలోకి రేడియేషన్

అన్ని రకాల జీవాలకు ‘కొత్త’ అడవులు ఆలవాలం కావాలి అంటే చాలా ఏండ్లు పడుతుంది. శతాబ్దాల అటవీ నిర్మూలన తర్వాత ఉత్తర అమెరికా, ఐరోపాలో విస్తారమైన అటవీ ప్రాంతాలు మళ్లీ పెరిగాయి. కోస్టారికా, న్యూజిలాండ్ వంటి దేశాలలో అడవుల నిర్మూలన తిరోగమన దిశలో ఉంది.  1986లో చెర్నోబిల్ అణు ప్రమాదం వల్ల వాతావరణంలోకి రేడియేషన్ వ్యాపించింది.

ఈ విపత్తువల్ల లక్ష పైన జనాభా తమ ఇండ్లను అత్యవసరంగా వదిలిపెట్టారు. అణుధార్మికత ఉండడంతో రియాక్టర్ చుట్టూ 30 కిలోమీటర్ల ఒక జోన్ ప్రకటించారు. ఈ భూభాగంలోకి ఎవరూ ప్రవేశించకుండా ఒక ప్రత్యేక నిషేధిత ప్రాంతంగా చేశారు. ఇందులో రెండు పెద్ద పట్టణాలు, 100కు పైగా గ్రామాలు,  పొలాలు ఉన్నాయి.  తదుపరి, ఆ ప్రాంతంలో మానవులు ఎవరూ అడుగుపెట్టలేదు.

అయితే,  ఆ ప్రాంతం మానవుల ఉనికి లేని పరిస్థితులలో ఒక బ్రహ్మాండమైన అడవిగా తయారు అయ్యింది. ఆశ్చర్యపరిచే రీతిలో  చెర్నోబిల్ మినహాయింపు జోన్, 2,800 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో, ఐరోపా ప్రధాన భూభాగంలో మూడవ అతిపెద్ద ప్రకృతి రిజర్వ్‌‌గా మారింది.  ప్రకృతికి అవకాశం ఇస్తే,  మానవుల ప్రమేయం తగ్గిస్తే.. తనంతటతానే సుస్థిర పరిస్థితికి చేరుకుంటుంది అని ఈ ప్రాంతం రుజువు చేసింది. ఇదే జోన్లో కొన్ని ప్రాంతాలలో చెట్ల సాంద్రత 30% పెరిగింది. 

అటవీ ఉత్పత్తులతో 27.50 కోట్ల మందికి ఉపాధి

భారతదేశంలో అడవుల నుంచి సేకరించే కలపయేతర సహజ ఉత్పత్తుల మీద ఆధారపడి దాదాపు 27.50 కోట్ల మంది  ప్రజలు జీవిస్తున్నారు. అందులో ఆదివాసీ ప్రజలు 40 శాతం వరకు ఉన్నారు.  సమస్త జీవరాశుల సమతుల్య జీవనానికి నిదర్శనం అడవి.  ఒకే రకం చెట్లను నాటి దానిని అడవిగా పేర్కొనడం సరి కాదు. Monoculture ప్లాంటేషన్ వల్ల కలప తప్పితే ఇతర ప్రయోజనాలు ఏమీ ఉండవు.

వన్యప్రాణులు అడవి దాటి జనారణ్యంలోకి రావడానికి ప్రధాన కారణం మనం అడవిగా భావిస్తున్న ప్రాంతాలలో అవి జీవించలేకపోవటం. వాటికి కావాల్సిన ఆహారం, నీరు ఉంటే బిక్కుబిక్కుమని రోడ్ల మీదకు రావు.  అటవీ ప్రాంతాలను అడవులుగా మార్చటం, అడవికి మానవుల నుంచి రక్షణ కల్పించటం, అటవీ విస్తీర్ణం పెంచటం, దానికి తగ్గ విధానాలు, పాలనా ప్రక్రియలు తయారు చేయటం వనమహోత్సవాలలో భాగంగా ప్రభుత్వాధినేతలు చూడాల్సిన అవసరం ఉంది.  ప్రకృతి పునరుద్ధరణ అడవుల విస్తరణ ద్వారా మాత్రమే సాధ్యం.

అటవీ పునరుత్పత్తితో సహజ జల వ్యవస్థ

మానవ కార్యకలాపాలు లేకపోవడం వల్ల సహజ అటవీ పునరుత్పత్తి జరిగి స్వచ్ఛమైన సహజ జల వ్యవస్థ ఏర్పడడానికి దోహదపడింది. దట్టమైన అడవుల గుండా తిరుగుతున్న అనేక జంతువుల ఉనికిని పరిశోధకులు గుర్తించారు. పర్యావరణ వ్యవస్థ తిరిగి తన సమతుల్యతను పొందడానికి సహజ ప్రక్రియలను కొనసాగించడం చాలా ఉత్తమమైన మార్గం అని మనకు ఇక్కడ బోధపడుతుంది.

పర్యావరణ వ్యవస్థ పునరుద్ధరణ కోసం ఐక్యరాజ్యసమితి పూనుకుంది.   కొవిడ్​ మహమ్మారి నేపథ్యంలో,  మానవ ఆరోగ్యం,  శ్రేయస్సు కోసం సహజ పర్యావరణ వ్యవస్థలు అవసరమని మనం గుర్తుంచుకోవాలి. వ్యవసాయ,ఆహార వ్యవస్థలలో అడవులు, చెట్లు చాలా ముఖ్యమైన విభాగాలు. అటవీ నిర్మూలన, పచ్చదనం కోల్పోవడం వల్ల ముఖ్యంగా ఉష్ణమండల ప్రాంతంలో,  స్థానికంగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయి.  వర్షపాతంలో మార్పులు సంభవించి వర్షాలకు అంతరాయం కలుగుతుంది. ఇది ప్రపంచ వాతావరణం మీద ప్రభావం చూపుతుంది.  వ్యవసాయ ఉత్పాదకత మీద ప్రభావం చూపుతూ మానవుల మనుగడకే ఎసరు పెడుతుంది. 

- డా. దొంతి నరసింహారెడ్డి, పాలసీ ఎనలిస్ట్​