- ఆదిలాబాద్జిల్లాలో గతేదాడితో పోలిస్తే తగ్గిన కేసులు
- వార్షిక నేర నివేదిక విడుదల
ఆదిలాబాద్ టౌన్, వెలుగు: ఆదిలాబాద్ జిల్లాలో ఈ ఏడాది ఆర్థిక నేరాలు, రోడ్డు ప్రమాదాలు పెరిగాయి. ఓవరాల్‌గా గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం కేసులు తగ్గడం విశేషం. మంగళవారం ఎస్పీ గౌస్ ఆలం స్థానిక పోలీస్ హెడ్‌క్వార్టర్ మీటింగ్ హాల్లో సమావేశం నిర్వహించి వార్షిక నేర నివేదిక విడుదల చేశారు. జిల్లా వ్యాప్తంగా కేసులు, నేరాలు, హత్యలు తగ్గుముఖం పట్టినట్లు తెలిపారు.
ముఖ్యంగా మాదకద్రవ్యాలు, గంజాయిని అదుపు చేయడంలో జిల్లా పోలీసులు ప్రగతిని సాధించి నట్లు చెప్పారు. 2023లో 3,275 కేసులు నమోదు కాగా ఈ ఏడాది 3034 కేసులు నమోదైనట్లు తెలిపారు. 1714 కేసుల్లో కోర్టులో 729 కేసుల నేరం రుజువైనట్లు చెప్పారు. హత్య కేసులు 13, రోడ్డు ప్రమాదాల కేసులు 346 (మరణాలు 133, గాయాలు 195) నమోదయ్యాయి. 344 ఆర్థిక నేర కేసులు, 5583 డ్రంక్ అండ్ డ్రైవ్, 45 అత్యాచారాల కేసులు, 190 చీటింగ్ కేసులు నమోదైనట్లు వెల్లడించారు.
పకడ్బందీగా లా అండ్ ఆర్డర్
సైబర్ నేరగాళ్ల ద్వారా మోసపోయిన బాధితులు పోగొట్టుకున్న డబ్బును తిరిగి అందించడంలో సైబర్ విభాగం కీలక పాత్ర పోషించినట్లు చెప్పారు. ఫ్లాగ్ డే సందర్భంగా రక్తదాన శిబిరాలు నిర్వహించి 275 యూనిట్ల రక్తాన్ని జిల్లా బ్లడ్ బ్యాంక్‌కు అందజేశామన్నారు. మెగా జాబ్ మేళా నిర్వహించిన 325 మంది గిరిజనులకు సెక్యూరిటీ విభాగంలో ఉద్యోగాలు కల్పించి ఉపాధి అవకాశాలు కల్పించామన్నారు. 6 నకిలీ విత్తనాల కేసుల్లో 12 మందిని అరెస్టు చేసి రూ.10.39 లక్షల విలువైన విత్తనాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
గాంజా సరఫరా చేస్తున్న 152 మందిపై 77 కేసులు నమోదు చేసి వారి నుంచి 1044 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నామన్నారు. గుట్కాను రూపుమాపేందుకు 123 మందిని అదుపులోకి తీసుకుని 78 కేసులను నమోదు చేసి వారి వద్ద నుండి రూ.1.86 కోట్ల విలువైన గుట్కాను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. సైబర్ నేరాల్లో 108 కేసుల్లో రూ.32.28 లక్షలు ఫ్రీజ్ చేయించి తిరిగి బాధితులకు అందజేసినట్లు తెలిపారు.
జిల్లాలో శాంతి భద్రతల కోసం 24 గంటల పాటు అప్రమత్తంగా ఉంటూ పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ఎస్పీ బి.సురేందర్ రావు, డీఎస్పీలు పోతారం శ్రీనివాస్, ఎల్.జీవన్ రెడ్డి, సీహెచ్.నాగేందర్, సీఐలు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.