మహిళా శక్తితో ఆర్థికంగా బలోపేతం : హనుమంతు జండగే

యాదాద్రి, వెలుగు : మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే మహిళాశక్తి పథకం ముఖ్యఉద్దేశమని కలెక్టర్ హనుమంతు జండగే అన్నారు. ఈ పథకాన్ని జిల్లాలో పకడ్బందీగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్​లో మహిళాశక్తి స్కీం అమలుపై రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్​మాట్లాడుతూ సూక్ష్మపరిశ్రమలు, వ్యాపారాల నిర్వహణను ప్రోత్సహించి సంఘాల్లో సభ్యులైన మహిళల ఆర్థిక స్వావలంబనకు సహకరించడం, సంఘాలను బలోపేతం చేయడమే లక్ష్యమన్నారు. ఉత్పత్తికి అవసరమైన ఆర్థిక సహకారం కోసం బ్యాంక్ లింకేజీల సదుపాయం కల్పించడం, ఉత్పత్తి అయిన సరుకులు మార్కెటింగ్ కు అవసరమైన ప్రణాళికలు, సహకారం ఉంటుందని చెప్పారు.

మైక్రో ఎంటర్​ప్రైజెస్,  పర్మనెంట్ స్టిచింగ్ సెంటర్లు, పాడి గేదెల పెంపకం సహా 14 రకాల వ్యాపారాలు ఇందులో భాగమని తెలిపారు. మహిళాశక్తి పథకంలో జిల్లాలో 2024–--25 సంవత్సరానికి 12,451 యూనిట్లకు వర్తింపజేస్తామన్నారు.  రివ్యూలో అడిషనల్​కలెక్టర్​గంగాధర్, డీఆర్​డీవో ఎంఏ కృష్ణన్, అడిషనల్ డీఆర్​డీవో శ్రీనివాస్, సంబంధిత శాఖల జిల్లా అధికారులు, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు రేణుక, కార్యదర్శులు సంతోష, మౌనిక పాల్గొన్నారు.