బడ్జెట్ సమావేశాల్లో భాగంగా కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో 2022-23 ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టారు. 2023-24లో దేశ ఆర్థిక వృద్ధి రేటు 6 నుంచి 6.8 శాతంగా ఉండే అవకాశం ఉందని చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి 7శాతంగా ఉండనున్నట్లు చెప్పారు. పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగించిన అనంతరం నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టారు. అనంతరం లోక్‌సభను రేపటికి వాయిదా వేశారు. రేపు కేంద్ర బడ్జెట్ ను లోక్‌సభలో నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు.
పేదలు లేని భారత్ కావాలి
ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూస్తున్నాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. కేంద్ర బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. ఆత్మనిర్బర్తో ఆధునిక భారత నిర్మాణం జరుగుతోందని అభిప్రాయపడ్డారు. పేదలు లేని భారత్ కావాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్న ఆమె.. యువ, మహిళా శక్తి దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. అవినీతి లేని దేశం వైపు భారత్ అడుగులేస్తోందని ముర్ము చెప్పారు. దేశాభివృద్ధిలో రానున్న పాతికేళ్లు అత్యంత కీలకమని అన్నారు. అన్ని రంగాల్లో దూసుకుపోతున్న భారత్ పై ప్రపంచదేశాలన్నీ ఆధారపడే పరిస్థితి వచ్చిందని చెప్పారు.