![వాస్తవాలకు దూరంగా ఆర్థిక సర్వే!](https://static.v6velugu.com/uploads/2025/02/economic-survey-far-from-facts-story-of-analyst-doniti-narasimhareddy_FKtlZ9cyo0.jpg)
ఆర్థిక సర్వే 2024-25.. ప్రభుత్వ నియంత్రణను ఉపసంహరించడమే ప్రధానంగా ప్రస్తావించింది. డిరెగ్యులేషన్ పదం దాదాపు 57 సార్లు ఉచ్చరించిన ఈ నివేదిక దానికి అనుగుణంగా రాతలు, లెక్కలు చూపెట్టింది. గత కొన్నేళ్ళుగా ప్రతి ఏడాది పార్లమెంటుకు వార్షిక బడ్జెట్ ఒక రోజు ముందు అందించే నివేదిక, వాస్తవాలను ప్రతిబింబించకుండా ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా రూపొందించడం జరుగుతోంది. ఇందులో తప్పు ఏమి ఉంది అనిపించవచ్చు. అయితే, ఈ నివేదిక కేవలం ఆర్థిక రంగంలో కొనసాగుతున్న ఏడాది పరిస్థితులను అంచనా వేసి, అవసరమైన మార్పులను సూచిస్తూ పార్లమెంటు సభ్యులకు ఒక సమాచార పత్రంలాగ ఉపయోగపడేది.
ఆర్థిక రంగం అంచనాలలో వాస్తవాలు కనపడితే విమర్శలు వస్తాయని భయపడిన కేంద్ర ప్రభుత్వం నివేదిక తీరును మార్చేసింది. తన పనితీరును సమర్థించుకోవచ్చు. అయితే, పూర్తిగా భజన చేసే నివేదిక ఇస్తే దానికి అర్థం లేదు. ఆర్థిక సర్వే ముఖ్య ఉద్దేశ్యం ప్రస్తుత ఆర్థిక పరిస్థితి మీద సమాచారం ఇస్తూ, భవిష్యత్తు మీద పూర్తి స్థాయి అంచనా వేసి తగిన సూచనలు రూపొందించడం. దాదాపుగా 2015-16 నుంచి ఆర్థిక సర్వే సామాన్యులకు అర్థం కాకుండా ఉన్నది. ప్రభుత్వం చెప్పేవే ఇందులో ప్రధానంగా తీసుకోవడం పెద్ద లోపం.
గణాంకాలు కొత్త రకంగా చూపెట్టి, అవసరమైన చోట వాస్తవాలు కనుమరుగు చేయటం ఆర్థిక సర్వే లక్ష్యంగా కనపడుతున్నది. కంప్యూటర్ గ్రాఫిక్స్ వాడి అసలు విషయం మరుగుపరిచేందుకు ఈ నివేదిక ప్రయత్నం చేస్తోంది. భారత ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సమస్యలపైన రూపొందించే ఏకైక ముఖ్యమైన నివేదిక ఒక సమాచార సాధనంగా కాకుండా, నివేదిక ఒక ప్రశంసా పత్రంగా మారింది.
ఆర్థిక సర్వేను అభివృద్ధి చేసే బాధ్యత ప్రధాన ఆర్థిక సలహాదారు ( చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్) కార్యాలయం మీద ఉంటుంది. అయితే, ఆర్థిక సలహాదారు స్వతంత్రంగా కాకుండా అధికారిక ఆలోచనలకు అనుగుణంగా ఉండడం శోచనీయం. ఒక ఆర్థికవేత్తకు ఆర్థిక అంశాలలో నైపుణ్యం ఉంటుంది. అయితే, ప్రపంచీకరణ నేపథ్యంలో దేశ ఆర్థికరంగం మీద బహుముఖ ఒత్తిడి ఉంటుంది. వాటన్నింటి గురించి సమాచారం సేకరించి, తగిన పరిశోధన చేసి, ప్రభుత్వ సంస్థల గణాంకాలు జోడించి, విశ్లేషించి ఒక నివేదిక తయారు చేయాల్సిన సీఈఏ ఆ పని చేయడం లేదు. స్వతంత్రంగా వ్యవహరించడం లేదు.
దిగుమతుల పెరుగుదల
ఆర్థికాభివృద్ధి అంశాలతో పాటు రాజకీయ విధానాలను ప్రభావితం చేసే సలహాలను కూడా ఇవ్వడం గమనార్హం. భౌగోళిక రాజకీయాలు ఒక కారణంగా దాదాపు 53 సార్లు ప్రస్తావించిన ఈ వార్షిక నివేదిక ఆయా సందర్భాలలో వాస్తవాలను కప్పి పుచ్చడం, ఆయాచిత సలహాలు ఇవ్వడం అలవాటుగా మార్చింది.
దేశ ఆర్థిక పటిష్టతకు కీలకంగా పరిగణించే ఎగుమతులు, -దిగుమతుల సమతుల్యత (ట్రేడ్ బ్యాలన్స్) గురించి కేవలం ఒక్కసారి ప్రస్తావించింది ఈ నివేదిక. మొత్తం ఎగుమతులు (2024-25లో మొదటి 9 నెలలు) 602.6 బిలియన్ డాలర్లు కాగా, అదే కాలానికి మొత్తం దిగుమతులు 682.2 బిలియన్ డాలర్లు. అంటే లోటు 79.6 బిలియన్ డాలర్లు. ఈ లోటు పెరిగితే మన ఆర్థిక రంగం మీద పడే దుష్ప్రభావాల గురించి నివేదిక చెప్పడం లేదు.
ట్రంప్ నిర్ణయాల ప్రభావంపై విశ్లేషణ లేదుడిసెంబర్ 2024 చివరి నాటికి భారతదేశ విదేశీ మారక నిల్వలు 640.3 బిలియన్ డాలర్లు. సెప్టెంబర్ 2024 నాటికి మనకున్న విదేశీ ఋణం 711.8 బిలియన్ డాలర్లు. రాబోయే ఒడుదొడుకులకు ఈ నిల్వలు సరిపోతాయని నివేదిక విశ్వసిస్తున్నది. ట్రంప్ ఆధ్వర్యంలో అమెరికా తీసుకునే నిర్ణయాల వల్ల మన విదేశీ వాణిజ్యం మీద ప్రభావం ఎట్లా ఉంటుంది వంటి అంశాల మీద ఆర్థిక నివేదికలో విశ్లేషణ లేదు.
ప్రభుత్వ విధాన ఆమోద పత్రంగా...
ఆర్థిక శాస్త్రం జీవితంలో ఒక కోణం మాత్రమే. ప్రజా విధానాలు, విధానాల దిశను నిర్ణయించేటప్పుడు పరిగణనలోకి తీసుకోవలసిన అనేక అంశాలు ఉన్నాయి. ఒకవైపు ప్రపంచ దేశాల ఆర్థిక సమస్యలు, దేశీయ వ్యవసాయ సంక్షోభం ప్రస్తావిస్తూ, భారతదేశం దృఢంగా ఉంది, అభివృద్ధి రేటు పెరుగుతుంది అని ఈ ఆర్థిక సర్వే విశదీకరించడం ఆశ్చర్యం కలిగిస్తున్నది.
అసలు ఈ నివేదికలో కొత్త తరహా లెక్కల మీద సంశయం ఉన్నది. వృద్ధి రేటు ఒక్కటే సమస్య కాదు. వ్యవసాయ ఉత్పత్తుల పరిమాణం పెరిగింది అని చూపుతున్న లెక్కల మీద విశ్వసనీయత లేదు. 2023-24తో పోలిస్తే, 2024-25 ఖరీఫ్ లో అతి ముఖ్యమైన ఆహార ధాన్యాలైన వరి, కంది ఉత్పత్తి వరుసగా 5.9 శాతం, 2.5 శాతం పెరుగుతుందని అంచనా వేశారు.
ప్రకృతి విపత్తుల కారణంగా పంటలు దెబ్బ తిన్నా, మార్కెట్లో పంట తడిచినా కూడా ధాన్యాల ఉత్పత్తి పెరగడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఒకవైపు ఆహార ధాన్యాల ధరలు పెరుగుతున్నాయని ఒప్పుకుంటూనే ఉత్పత్తి పెరుగుతుంది అనడం అవాస్తవికతకు అద్దం పడుతుంది. ఉత్పత్తి పెరిగితే ధరలు పడిపోవాలి. ఉత్పత్తి తగ్గి ధరలు పెరుగుతున్నాయి కాబట్టే దిగుమతులు పెరుగుతున్నాయి.
విదేశీ శక్తుల ప్రభావితం
‘నవంబర్‌లో ఓఈసీడీ విడుదల చేసిన నివేదికను పరిశీలించడం ద్వారా రైతు మద్దతు విధానాలు ప్రయోజనం పొందవచ్చు’ అని ఆర్థిక సర్వే చెబుతోంది. దీనిని బట్టి కూడా ఆర్థిక సలహాదారు కార్యాలయం తన ప్రాథమిక పనిని కూడా చేయడం లేదని స్పష్టమవుతున్నది. భారత వార్షిక ఆర్థిక రంగ 2024-25 నివేదికప్రపంచ బ్యాంకు, ఓఈసీడీ మొదలైన విదేశీ సంస్థల పట్టికలు, గణాంకాలు, డేటాను ఉటంకిస్తుంది.
ఇంత పెద్ద దేశంలో స్వతంత్ర ఆర్థిక విశ్లేషణ సంస్థలు లేవా? విదేశీ సంస్థలు చేసే విశ్లేషణలపై మనం ఆధారపడాల్సిన అవసరం ఉందా? ఈ నివేదికలో ‘ప్రపంచ బ్యాంకు’ అనే పదం 25 సార్లు, ‘ఓఈసీడీ’ అనే పదం 24 సార్లు, ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) అనే పదాలను 7 సార్లు జపించడం మన దేశీయ ఆర్థిక మేధ ‘వలసవాద’ బానిసత్వాన్ని స్పష్టం చేస్తున్నది. ఈ నివేదికలో ఒక్కసారి కూడా సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ ( సీఎంఐఈ)ని సూచించదు.
మన దేశంలో సొంత ఆర్థిక సంస్థలు, దేశీయ ఆర్థిక నైపుణ్యం ఉన్నాయి. మేధ ఉన్నది. కానీ, సీఈఏ రూపొందించే ఆర్థిక సర్వేలో వాటి ప్రస్తావన కూడా ఉండడం లేదు. మన ఆర్థికవేత్తలు, పాలకుల ఆలోచనలను విదేశీ శక్తులు ఏ మేరకు ప్రభావితం చేస్తున్నాయో తెలిపే ఒక చిన్న ఉదాహరణ మాత్రమే ఇది!
నివేదికలో విదేశీ వాసన!
విదేశీ ఆర్థిక రంగాలు ఆదర్శంగా, వ్యవసాయం వంటి ప్రాథమిక రంగాల విస్మరించి, అన్ని రంగాలలో ప్రైవేటీకరణకు, విదేశీ పెట్టుబడులకు ఊతమిచ్చే లెక్కలు, వాదనలతో ఈ ఆర్థిక నివేదిక నిండిపోయింది. సామాన్యులకు, రైతులకు, పేదలకు, మహిళలకు, యువతకు భవిష్యత్తు మీద ఆశ కల్పించే ఆలోచనలు, తగిన విశ్లేషణ, మూల సమస్యల ప్రస్తావన లేకుండా, విదేశీయుల ఆలోచన విధానానికి అనుకూలంగా ఈ ఆర్థిక సర్వే అనేక సూచనలు చేసింది.
అవినీతికి విరుగుడు పారదర్శకత
ఆర్థిక సర్వే 2024-–25 నియంత్రణ సడలింపులో భాగంగా ఒక అడుగు ముందుకు వేసి, నియంత్రణ చట్టాల ఉల్లంఘనలను నేరరహితం చేయాలని సూచిస్తున్నది. అవినీతికి విరుగుడు పాలనలో పారదర్శకత. పాలనలో లోపిస్తున్న పారదర్శకత గురించి కాకుండా ఆర్థిక సర్వే వ్యాపార రంగ అభివృద్ధి పరమావధిగా చెప్పడం విడ్డూరంగా ఉంది.
వ్యవసాయ ఉత్పత్తి పుంజుకుంటుంది. ఆహార ద్రవ్యోల్బణం తగ్గుదల అంచనాలు ఉన్నాయి. స్థిరమైన స్థూల ఆర్థిక వాతావరణం ఉన్నది. ఈ మూడు కారణాల వల్ల గ్రామీణ డిమాండ్ పెరిగి స్వల్పకాలిక వృద్ధికి ఊతం ఇస్తుంది అంటున్నది ఈ సర్వే. అయితే, వ్యవసాయ ఉత్పత్తి ఏ విధంగా పుంజుకుంటుంది అనేది చెప్పలేదు.
- డా. దొంతి నరసింహారెడ్డి,పాలసీ ఎనలిస్ట్-