ఎకనామిక్​ సర్వే అంచనా .. జీడీపీ వృద్ధి 6.5 నుంచి 7 శాతం

ఎకనామిక్​ సర్వే అంచనా .. జీడీపీ వృద్ధి 6.5 నుంచి 7  శాతం
  • ఆర్థిక వ్యవస్థ పటిష్టం
  • మరిన్ని ఎఫ్​డీఐలు రావాలి
  • ఉపాధి కల్పనకు ప్రాధాన్యం
  • అదుపులోనే ధరలు  నేడే బడ్జెట్​

న్యూఢిల్లీ : దేశ ఆర్థిక వ్యవస్థకు దిక్సూచి అయిన ఆర్థిక సర్వేను బడ్జెట్​కు ఒక రోజు ముందు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​ పార్లమెంటులో ప్రవేశపెట్టారు.  ఇది మోదీ 3.0 ప్రభుత్వం  ఆర్థిక ప్రాధాన్యతలను వివరించింది.  2047 నాటికి అభివృద్ధి చెందిన దేశం కోసం తీసుకోవాల్సిన నిర్ణయాలు, సంస్కరణల గురించి ప్రస్తావించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 6.5 నుంచి 7 శాతం పెరుగుతుందని అంచనా వేసింది.

ఇది మునుపటి 2023-–24 ఆర్థిక సంవత్సరం వృద్ధి 8.2 శాతం కంటే తక్కువ.  ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆర్​బీఐ  వేసిన 7.2 శాతం అంచనా కంటే కూడా తక్కువ. ఆర్థిక వ్యవస్థలో మరిన్ని ఉద్యోగాలను సృష్టించాల్సిన అవసరం ఉందని పేర్కొంది.  ఎగుమతులను పెంచడానికి మరిన్ని చైనీస్ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐలు) కావాలని స్పష్టం చేసింది.   ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ) కార్యాలయం రూపొందించిన ఈ రిపోర్టులోని ముఖ్యాంశాలు:

  • ప్రైవేట్ పెట్టుబడులను పెంచడం, చిన్న వ్యాపారాలు  వ్యవసాయాన్ని బలోపేతం చేయడం వంటివి కీలకం. చిన్న వ్యాపారాల కోసం నిబంధనలను సరళీకరించాలి. ఆదాయ అసమానతలను తగ్గించాలి.  ఉద్యోగ కల్పనకు మరింత అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడానికి కార్మిక సంస్కరణల అమలును వేగవంతం చేయాలి. 
  • పెరుగుతున్న శ్రామికశక్తికి అనుగుణంగా వ్యవసాయేతర రంగంలో 2030 వరకు భారత ఆర్థిక వ్యవస్థ ఏటా సగటున 78 లక్షల ఉద్యోగాలను సృష్టించాలి.  2023 నాటికి నిరుద్యోగిత రేటు 3.2 శాతానికి తగ్గింది. 
  • ప్రపంచమార్కెట్ల నుంచి ఇబ్బందులు ఉన్నప్పటికీ దేశీయ ఆర్థిక వ్యవస్థ చోదకాలు వృద్ధికి సాయపడ్డాయి.   పేద,  తక్కువ ఆదాయ వినియోగదారులకు అధిక ఆహార ధరల వల్ల కలిగే కష్టాలను తట్టుకోవడానికి కూపన్లు ఇవ్వాలి లేదా ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (డీబీటీ) ద్వారా డబ్బు బదిలీ చేశాయి. 
  • ఇప్పటికే రాయితీలు,  సహాయక చర్యలు ఉన్నప్పటికీ వ్యవసాయ విధానాల్లో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని సీఈఏ నాగేశ్వరన్ అభిప్రాయపడ్డారు. 
  • కరోనా అనంతర రికవరీని కొనసాగించడానికి, దేశీయ రంగంలో భారీ చర్యలు ఉండాలి. వాణిజ్యం, పెట్టుబడులు  వాతావరణం వంటి కీలక ప్రపంచ సమస్యలపై ఒప్పందాలు చేసుకోవడం కష్టంగా మారింది. 
  • స్వల్పకాలిక ద్రవ్యోల్బణ దృక్పథం బాగానే ఉంది. ఆహారేతర ద్రవ్యోల్బణం అదుపులోనే ఉంది. మనదేశంలో పప్పుధాన్యాల కొరత నిరంతరం ఉంటోంది. అందుకే ధరలు పెరుగుతాయి. అయితే 2024లో ద్రవ్యోల్బణం 5.4 శాతమే ఉంది. 
  • భౌగోళిక రాజకీయ సమస్య పెరుగుదల  ఆర్​బీఐ  ద్రవ్య విధానాన్ని ప్రభావితం చేయవచ్చు.  అయితే మనదేశ ఆర్థిక రంగ భవిష్యత్​ బాగుంటుంది.  
  • ఆరోగ్యవంతమైన కార్పొరేట్  బ్యాంక్ బ్యాలెన్స్ షీట్లు ప్రైవేట్ పెట్టుబడులను మరింత బలోపేతం చేస్తాయి.  పన్ను సమ్మతి లాభాలు, వ్యయ నియంత్రణ, డిజిటలైజేషన్ ప్రభుత్వ ఆర్థిక నిర్వహణలో చక్కటి సమతుల్యతను సాధించడంలో సహాయపడతాయి. 
  • భారతదేశ వృద్ధికి క్యాపిటల్ మార్కెట్లు కీలకంగా మారాయి. భౌగోళిక, రాజకీయ, ఆర్థిక షాక్‌‌‌‌‌‌‌‌లను తట్టుకోగల శక్తి మన మార్కెట్లకు ఉంది. 
  • విదేశీ చెల్లింపులు ప్రస్తుత సంవత్సరంలో 124 బిలియన్ డాలర్ల నుంచి వచ్చే ఏడాది129 బిలియన్ డాలర్లకు చేరుతాయి.
  • పునరుత్పాదక శక్తి  రంగం 2024–2030 మధ్య భారతదేశంలో సుమారు రూ. 30.5 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షిస్తుంది.  ఇది భారీగా ఆర్థిక అవకాశాలను సృష్టిస్తుంది.
  • 2016లో ఐబీసీ ప్రారంభమైనప్పటి నుంచి రూ. 10.2 లక్షల కోట్ల విలువైన దివాలా కేసులు పరిష్కారమయ్యాయి. పరిష్కార ప్రక్రియలో ఉన్న కంపెనీలలో ఐదవ వంతు కంటే ఎక్కువ రియల్ ఎస్టేట్ రంగానికి చెందినవి.
  • అమెరికాకు చెందిన స్మార్ట్‌‌‌‌‌‌‌‌ఫోన్ మేజర్ యాపిల్​ ఈ ఏడాది గ్లోబల్ ఐఫోన్లలో 14 శాతం భారతదేశంలోనే అసెంబుల్ చేసింది. గ్లోబల్ ఎలక్ట్రానిక్స్ ఎగుమతిలో దేశం ర్యాంకింగ్ నాలుగు స్థానాలు మెరుగుపడింది.
  • రాబోయే సంవత్సరాల్లో ఆదాయ అసమానతలను పరిష్కరించడంలో పన్ను విధానాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఏఐ వంటి టెక్నాలజీలు ఉపాధి, ఆదాయంపై  హానికరమైన ప్రభావాన్ని చూపుతాయి.

ఈసారి ఏడు శాతం జీడీపీ సాధిస్తామన్న నమ్మకం మాకు ఉంది. అయితే ఆర్థిక వ్యవస్థకు కొన్ని సవాళ్లు ఉన్నాయి. అనిశ్చితి వాతావరణం, ఫైనాన్షియల్​ మార్కెట్లలో అస్థిరత, భౌగోళిక రాజకీయ సమస్యలను ఎదుర్కోవాలి. వీటిని ఎదుర్కొని లక్ష్యాలను సాధించగలమన్న నమ్మకం ప్రభుత్వంలో ఉంది. అయితే ధరలు అదుపులోనే ఉన్నాయి. ఆహార పదార్థాల ధరలను మాత్రం నియంత్రించాలి

 సీఈఏ అనంత నాగేశ్వరన్