శ్రీలంకలో పదేళ్ల వరకూ పరిస్థితి మారదా.. ?

శ్రీలంక రాజకీయ సంక్షోభం కాస్త కొలిక్కి వచ్చింది. ఆ దేశ కొత్త అధ్యక్షుడిగా రణిల్ విక్రమ సింఘె ఎన్నికయ్యారు. మొన్నటి వరకూ ప్రధానిగా ఉన్న ఆయన.. ఇప్పుడు అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. అయితే.. కొత్త అధ్యక్షుడు వచ్చినా శ్రీలంకలో పరిస్థితులు చక్కబడతాయా అనేది ఇప్పుడు అసలు ప్రశ్న. ప్రస్తుతం దేశాన్ని మళ్లీ నిలబెట్టడం విక్రమ సింఘె ముందున్న అతిపెద్ద సవాల్. అల్లర్లు, నిరసనలతో రగులుతున్న శ్రీలంకను చక్కదిద్దాలంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే ప్రస్తుతం అక్కడి ప్రభుత్వం దగ్గరా పైసా లేదు. అత్యవసర సేవల నిర్వహణకు చిల్లిగవ్వ లేదు. చమురు నిల్వలు దాదాపు దగ్గరపడ్డాయి. ప్రభుత్వ ఆఫీసులు, స్కూళ్లు మూతపడ్డాయి. విరాళాలిస్తే తప్ప నడిపే పరిస్థితి లేదని హాస్పిటళ్లు అడుగుతున్నాయి. 

ఆగష్టు నాటికి క్లారిటీ...

కొత్త అధ్యక్షుడు వచ్చినా.. ఇలాంటి సమస్యలన్నీ ఇప్పటికిప్పుడు పరిష్కారమయ్యేవి కాదని ఆర్థిక నిపుణులు అంటున్నారు. శ్రీలంక మళ్లీ యథాస్థితికి రావాలంటే చాలా కాలం పడుతుందని చెబుతున్నారు. శ్రీలంకకు బెయిలవుట్‌ ప్యాకేజీపై కసరత్తు చేస్తున్న ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్.. తాజా పరిస్థితులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. సంక్షోభం ముగిసిపోయాకే బెయిలవుట్ ప్యాకేజీపై చర్చలు మళ్లీ మొదలవుతాయని కొద్దిరోజుల క్రితం చెప్పింది. ఇప్పుడు కొత్త ప్రెసిడెంట్ వచ్చారు కాబట్టి IMFతో చర్చలు మొదలయ్యే అవకాశముందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ఆగష్టు నాటికి దీనిపై క్లారిటీ వస్తుందని చెప్పిన విక్రమ సింఘె.. ఇప్పుడు ఆ దిశగా చర్యలు ప్రారంభించే అవకాశముందంటున్నారు. 

అతి పెద్ద సంక్షోభం ఇదే...

శ్రీలంక సంక్షోభం ఈనాటిది కాదు. మొదటినుంచి ద్వీప దేశాన్ని ఆర్థిక కష్టాలు వెంటాడుతున్నాయి. అయితే.. 1948లో బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్ర్యం పొందిన తర్వాత ఎదుర్కొన్న అతిపెద్ద సంక్షోభం ఇదే. విదేశీ మారక ద్రవ్యం విలువ తీవ్రంగా పడిపోయింది. ఈ సంక్షోభం నుంచి బయటపడడానికి ఆ దేశానికి కనీసం కనీసం  31 వేల 938 కోట్లు కావాల్సి ఉంటుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. 

రుణాలు పుడ్తలేవు.. 

శ్రీలంకలో ప్రస్తుత పరిస్థితి దారుణంగా ఉంది. శ్రీలంకలో విదేశీ మారకపు నిధుల కొరత ఉంది. డాలర్ల కొరత కారణంగా పెట్రోలు, డీజిల్, మందులు మొదలైన నిత్యావసర వస్తువుల దిగుమతి ఆగిపోయింది. అవసరమైన ఇతర వస్తువులను దిగుమతి చేసుకోలేని పరిస్థితి. పాత రుణాలకు వడ్డీలు సకాలంలో చెల్లించలేకపోతున్నారు. దాంతో కొత్త రుణాలు పుట్టడం లేదు. పాత రుణాల లావాదేవీలపై చర్చలు జరిపి, బ్యాంకుల్లో నిర్మాణాత్మక మార్పులు తీసుకురావాలని రుణ సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. 

జీరో పర్సెంట్ కు టూరిజం...

 IMF నిధులు మాత్రమే శ్రీలంకను కాపాడగలవని అక్కడి ఆర్థిక నిపుణులు అంటున్నారు. పర్యాటక రంగ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలంటున్నారు. వాస్తవానికి శ్రీలంకకు టూరిజం నుంచి భారీగా ఆదాయం వస్తుంది. కానీ గతంలో ఉగ్రదాడులు, ఆ తర్వాత కొద్ది రోజులకే కరోనా విపత్తు ముంచుకురావడంతో టూరిజం చాలా వరకు పడిపోయింది. కొన్ని నెలలుగా జరుగుతున్న ఆందోళనలతో అది జీరో అయ్యింది. ఇప్పుడు టూరిజాన్ని ప్రోత్సహిస్తే విదేశీ మారక ద్రవ్యం వచ్చే అవకాశముంది. అయితే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో శ్రీలంకలో టూరిజం డెవలప్ అవ్వడం అంత సులువు కాదంటున్నారు. అక్కడున్న పరిస్థితులతో టూరిస్టులెవరూ రిస్క్ చేయబోరని.. చెబుతున్నారు. అటు.. సముద్రతీరం ఉండి.. టూరిస్ట్ స్పాట్లుగా ఆల్రెడీ పేరున్న ఇండోనేషియా, థాయ్‌లాండ్ వైపు పర్యాటకులు ఆసక్తి చూపిస్తున్నారంటున్నారు. ఆ దేశాలు తక్కువ రేట్లకే మంచి సదుపాయాలు కల్పిస్తుండటం కూడా టూరిస్టులను ఆకర్షిస్తోంది. 

గత పదేళ్లలో ఇదే కనిష్టం...

విదేశాల్లో స్థిరపడిన శ్రీలంక పౌరులు స్వదేశానికి డబ్బు పంపేలా ప్రోత్సహించాలని ఫైనాన్స్ ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు. దీని ద్వారా కూడా విదేశీ మారకద్రవ్యాన్ని సమకూర్చుకోవచ్చని.. భవిష్యత్ లో దేశం ఇబ్బందులు పడకుండా ఇది ఉపయోగ పడుతుందని అంటున్నారు. ఈ మధ్య కాలంలో శ్రీలంక నుంచి విదేశాలకు వెళ్లే వారి సంఖ్య పెరిగింది. కానీ వారి నుంచి దేశానికి వచ్చే డబ్బు మొత్తం మాత్రం చాలా వరకు తగ్గిపోయింది. గతేడాది 5.49 బిలియన్ డాలర్ల నిధులు విదేశాల్లో ఉన్న శ్రీలంక పౌరులు స్వదేశానికి పంపించారు. ఇది గత పదేళ్లలో కనిష్టం. దేశంలో పరిస్థితులతో పాటు.. చాలా అంశాలు దీన్ని ప్రభావితం చేస్తున్నాయి. స్వదేశానికి పంపే డాలర్లకు శ్రీలంక సెంట్రల్ బ్యాంకు నిర్ణయించిన ధర తక్కువగా ఉంటోందని వారంటున్నారు. సెంట్రల్ బ్యాంకు ఒక డాలరుకు 200 నుంచి 203 శ్రీలంక రూపాయలు చెల్లించడానికి సిద్ధంగా ఉంది. కానీ బయట హవాలా మార్కెట్లో డాలరు ధర 250 రూపాయలు పలుకుతోంది.

ఇబ్బందికరంగా మారిన రాజపక్స నిర్ణయాలు...

దేశం నుంచి ఎగుమతులు పెరిగినా ఆర్థిక వ్యవస్థ బలోపేతమయ్యే ఛాన్స్ ఉంది. శ్రీలంకలో టీ భారీగానే ఉత్పత్తి అవుతుంది. అయితే టీ ఉత్పత్తుల్లో భారత్, కెన్యా వంటి దేశాల నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. 1970లో, దేశంలోని తేయాకు, రబ్బరు తోటలను ప్రైవేటు రంగం నుంచి సర్కారు టేకోవర్ చేసింది. కానీ పర్యవేక్షణ సరిగా లేకపోవడంతో ఉత్పత్తి తగ్గిపోయింది. ప్రభుత్వం కూడా అందులో కొత్త పెట్టుబడులు పెట్టకపోయే సరికి అది పూర్తిగా కుదేలైంది. మరోవైపు.. వ్యవసాయ రంగానికి సంబంధించి గోటబాయ రాజపక్స తీసుకున్న నిర్ణయాలు ఇబ్బందికరంగా మారాయి. ముందస్తు ప్రణాళిక లేకుండా ఎరువుల వాడకాన్ని పూర్తిగా నిషేధించడంతో ఉత్పత్తి విపరీతంగా పడిపోయింది. ఈ సమస్య నుంచి భయపడి ఉత్పాదకత పెరగాలంటే చాలా ఏళ్లు పడుతుందని వ్యవసాయరంగ నిపుణులు అంటున్నారు. 

పదేళ్లు పట్టొచ్చు...

ప్రస్తుత పరిస్థితుల్లో శ్రీలంక ఆర్థిక స్థిరత్వం సాధించాలంటే కనీసం ఐదేళ్లు పట్టొచ్చని ఎక్స్ పర్ట్స్ అంచనా వేస్తున్నారు. ఆ ఐదేళ్లలో కూడా సమర్థవంతమైన ఆర్థిక సంస్కరణలుంటేనే ఇది సాధ్యమవుతుందని లేకుంటే అంతకు రెట్టింపు సమయం పట్టినా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు. ప్రభుత్వ రుణాలకు కొత్త నిబంధనలు రూపొందించడం, ప్రభుత్వ సంస్థల్లో సంస్కరణలు, కార్మిక చట్టాలు, పన్ను రేట్లలో మార్పులు చేపట్టాలని సూచిస్తున్నారు. 

51 బిలియన్ డాలర్ల అప్పులు...

గతంలో పెట్టుబడులు పెరుగుతాయని, మార్కెట్ లో వస్తువుల డిమాండ్ పెరుగుతుందని ప్రభుత్వం పన్ను రేట్లు తగ్గించింది. కానీ ఆదాయం పెరగకపోగా.. చాలా వరకు తగ్గింది. మరోవైపు ప్రభుత్వ ఖర్చులు తగ్గలేదు. 15 లక్షల మంది ప్రభుత్వోద్యోగులకు జీతాలు చెల్లిస్తూనే ఉంది. ప్రభుత్వ వ్యయాన్ని నెట్టుకొచ్చేందుకు బ్యాంకులు నోట్లను ముద్రిస్తూనే ఉన్నాయి. దీనివల్ల ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగింది. ప్రస్తుతం ద్రవ్యోల్బణం 57 శాతంగా ఉంది. ఇది 75 శాత వరకు వెళ్లొచ్చని శ్రీలంక సెంట్రల్ బ్యాంకు అంచనా వేస్తోంది. దేశ కరెన్సీ విలువ 80 శాతం తగ్గిపోయింది. ప్రభుత్వ నిర్ణయాలతో ఇప్పటికే భారీగా అప్పుల్లో కూరుకుపోయింది. శ్రీలంకకు దాదాపు 51 బిలియన్ డాలర్ల అప్పులున్నాయి. కనీసం వాటికి వడ్డీ కూడా చెల్లించలేని పరిస్థితి వచ్చింది. కనీసం గ్యాసోలిన్‌, పాలు, కుకింగ్‌ గ్యాస్‌ వంటి నిత్యావసరాల దిగుమతికి కూడా డబ్బులు చెల్లించని స్థితి ఏర్పడింది.

అధికారాలన్నీ వారి చేతుల్లోనే...

శ్రీలంకలో రాజకీయ అవినీతి.. దేశ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసిందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. దేశ సంపద మొత్తం కొందరి చేతుల్లోకే వెళ్లిపోవడంతో ప్రజలకు ఇబ్బందులు మొదలయ్యాయి. ఫలితంగా ఆర్థిక వ్యవస్థ కోలుకోలేని పరిస్థితికి వచ్చింది. శ్రీలంక అధ్యక్షుడు, ప్రధాన మంత్రి, ఆర్థిక మంత్రి ఇలా అందరూ ఒకే కుటుంబానికి చెందిన వారు. అధికారాలన్నీ వీరి చేతుల్లోనే ఉన్నాయి. దేశానికి ప్రధాన ఆదాయ వనరులన్నీ వీరి శాఖల కిందే ఉన్నాయి. ఈ కుటుంబం అంతులేని అవినీతి మూలంగానే దేశం ఇలాంటి దారుణ పరిస్థితికి చేరిందని ఎక్స్ పర్ట్స్ అంటున్నారు. 

ముందున్న సవాళ్లు అవే...

ఇప్పుడు వీటన్నింటిని దాటుకుని దేశాన్ని నిలబెట్టడం విక్రమ సింఘె ముందున్న అతిపెద్ద సవాల్. ప్రతీ నిర్ణయం చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సి ఉంటుంది. పైసా ఖర్చు పెట్టాలన్నా ఒకటికి రెండు సార్లు లెక్కలేసుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. మరీ ముఖ్యంగా విదేశీ మారక నిల్వలు పెంచుకోవడంపై ఫోకస్ పెట్టాలని చెబుతున్నారు. ఖర్చులు తగ్గించి.. దేశంలో ఉత్పత్తి పెంచి, ఎగుమతులు పెరిగితేనే పరిస్థితులు చక్కబడతాయంటున్నారు.