ఎకోటూరిజం పనులు స్టార్ట్!..35 వేల ఎకరాల్లో విస్తరించి ఉన్న కనకగిరి కొండలు

ఎకోటూరిజం పనులు స్టార్ట్!..35 వేల ఎకరాల్లో విస్తరించి ఉన్న కనకగిరి కొండలు
  • 20 కిలోమీటర్ల సఫారీ రూట్ సిద్ధం
  • ఈనెల 15 నుంచి వైల్డ్ లైఫ్ ఎక్స్ పర్ట్ లు, ఎన్జీవోలకు అనుమతి
  • అభివృద్ధి పనులపై ఫీడ్ బ్యాక్ తీసుకోనున్న ఆఫీసర్లు

ఖమ్మం, వెలుగు : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పచ్చని అడవి, ఆహ్లాదకరమైన వాతావరణంలో కనువిందు చేస్తున్న పులిగుండాల ప్రాజెక్టును ఎకోటూరిజం ప్రాంతంగా అభివృద్ధి చేసే పనులు ప్రారంభమయ్యాయి. 35 వేల ఎకరాల్లో విస్తరించి ఉన్న కనకగిరి కొండలను టూరిస్ట్ ఎట్రాక్షన్ గా తీర్చిదిద్దేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కనకగిరి కొండల్లోనే పులిగుండాల ప్రాజెక్టు ఉండగా, అక్కడికి ఇప్పటికే శని, ఆదివారాల్లో వందల సంఖ్యలో టూరిస్టుల తాకిడి ఉంటుంది. ప్రాజెక్టు అందాలతో పాటు సమీపంలోని బర్డ్ వాచ్ టవర్ ను ఎక్కి, ప్రకృతి అందాలను టూరిస్టులు ఆస్వాదిస్తుంటారు. 

ఇప్పుడు అక్కడ మరిన్ని సౌకర్యాలను కల్పించడంతో పాటు, ట్రెక్కింగ్, హైకింగ్, రాత్రి బస, సఫారీ, బోటింగ్, టూరిస్టుల సేఫ్టీ కోసం ఫెన్సింగ్ లాంటివి ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. అందులో భాగంగా ఇప్పటికే 20 కిలోమీటర్ల మేర సఫారీ ట్రాక్ ను, లెపర్డ్ వాచ్ టవర్ ను ఏర్పాటు చేశారు. గేట్, క్యాంటీన్ నిర్మాణం జరుగుతుండగా, నైట్ క్యాంపింగ్ కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కనకగిరి కొండల్లో ఉన్న వివిధ రకాల పక్షులు, జంతువుల గురించి సర్వే చేసేందుకు ఇటీవల 8 మంది నిపుణులతో ఏర్పాటు చేసిన టీమ్ రెండ్రోజుల పాటు వివరాలను సేకరించింది. 

15 నుంచి వారికి మాత్రమే ఎంట్రీ!

ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల పరిధిలో 35 వేల ఎకరాల్లో విస్తరించిన కనకగిరి కొండల్లో ఎకోటూరిజం అభివృద్ధి కోసం రూ.67 లక్షలతో అటవీ శాఖ అధికారులు చేసిన ప్రతిపాదనలకు ఇప్పటికే ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందులో భాగంగా వ్యూ పాయింట్, మినీ బ్రిడ్జి, కల్వర్టులు, సోలార్ బోర్ వెల్, ట్రెక్కింగ్ దారుల అభివృద్ధి, సోలార్ సీసీ కెమెరాల ఏర్పాటు, టాయిలెట్స్, వాకీటాకీలు, పులిగుండాల ప్రాజెక్టు దగ్గర ఫెన్సింగ్ ఏర్పాటు, ఎంట్రీ గేట్, బ్యారియర్స్, గైడ్ ల ఏర్పాటు లాంటివి ప్రతిపాదించారు. ఇవన్నీ సౌకర్యాలు కల్పిస్తే టూరిస్టుల సంఖ్య పెరిగి ఏడాదికి రూ.6 లక్షల వరకు ఆదాయం వస్తుందని అంచనా వేశారు. 

అయితే వేలాది ఎకరాల్లో విస్తరించిన అడవిలో టూరిస్టులకు సేఫ్టీ మెజర్మెంట్స్ ఏర్పాటు, అత్యవసర పరిస్థితుల్లో సహాయక చర్యలు, వైర్ లెస్ కమ్యూనికేషన్ లాంటి ఇబ్బందులు ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే ఎకోటూరిజం అభివృద్ధికి అటవీ అభివృద్ధి కార్పొరేషన్ నుంచి అనుమతి వచ్చినా, ఇంకా నిధులు మాత్రం మంజూరు కాలేదు. ముందు టూరిస్టుల కోసం కొన్ని కనీస సౌకర్యాలను ఏర్పాటు చేసి, నిపుణుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్న తర్వాత దశలవారీగా అభివృద్ధి పనులు చేయాలని ఆఫీసర్లు నిర్ణయించారు. 

అందుకే టూరిస్టులను నేరుగా అనుమతించకుండా ఈనెల 15 నుంచి వైల్డ్ లైఫ్ ఎక్స్ పర్ట్ లు, ఎన్జీవోలకు సంబంధించిన ప్రతినిధులను అనుమతించనున్నారు. వారు అడవిలో ఉన్న వృక్ష జాతులు, జంతు జాతుల గురించి పూర్తిగా అధ్యయనం చేస్తారు. అడవిలో తీసుకోవాల్సిన సేఫ్టీ చర్యల కూడా నివేదిస్తారు. ఆ తర్వాత వాటిపై అధికారులు నిర్ణయం తీసుకుని, తగిన సౌకర్యాలను కల్పించాలని ప్లాన్ చేశారు.  

జిల్లా టూరిజం ప్రమోషన్ కమిటీ ఏర్పాటు 

ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఆధ్వర్యంలో ఇటీవల జిల్లా టూరిజం ప్రమోషన్ కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో వివిద శాఖల అధికారులను భాగస్వామ్యం చేశారు. ఈ కమిటీ నిర్ణయం మేరకు శని, ఆదివారాల్లో వైల్డ్ లైఫ్ ఎక్స్ పర్టులతో బర్డ్ వాచింగ్ ఈవెంట్స్ లాంటి యాక్టివిటీలు నిర్వహించాలని ప్లాన్ చేశారు. ఇక ట్రెక్కింగ్, నైట్ క్యాంపింగ్, పులిగుండాల ప్రాజెక్టులో పెడల్ బోటింగ్ ను ఏర్పాటు చేస్తున్నారు. 

అడవిలోకి ఎలాంటి ప్లాస్టిక్ రాకుండా నో ప్లాస్టిక్ క్యాంపెయిన్ ను నిర్వహించనున్నారు. టూరిస్టుల కోసం క్యాంటీన్ ను ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే నిర్మాణాన్ని కూడా పూర్తి చేస్తున్నారు. ఇందిరా మహిళా శక్తి కింద మహిళా సంఘాలతో లోకల్ ఫుడ్ తో క్యాంటీన్ నిర్వహించనున్నారు.  

చేయాల్సిన పనులు.. 

కనకగిరి కొండల్లో కాకతీయుల కాలంలో నిర్మించిన వీరభద్రస్వామి ఆలయం, శివాలయం, పల్లేర్ల బావి, పాత ఖిల్లా ఉన్నాయి. ఈ పాత ఖిల్లా నుంచి వరంగల్ కు గుహ ఉందని స్థానికులు చెబుతుంటారు. వ్యూపాయింట్ తో సెల్ఫీ పాయింట్లను అభివృద్ధి చేయనున్నారు. ప్రకృతికి ఇబ్బంది లేకుండా, అడవి ధ్వంసం కాకుండానే అభివృద్ధి పనులు చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. ఇక సఫారీ కోసం వాహనాలు ఏర్పాటు చేయడంతో పాటు, స్థానికులకు ఉపాధి కల్పించేందుకు శిక్షణ పొందిన డ్రైవర్లను ఎంపిక చేయనున్నారు. 

పులిగుండాల వాటర్ ఫాల్స్ దగ్గర ట్రెక్కింగ్ కోసం నిపుణులను, గైడ్ లను సిద్ధం చేస్తారు. విద్యార్థులు స్టడీ టూర్ వెళ్లేందుకు ఏర్పాట్లు చేయడంతో పాటు, వెదురు బొంగులతో హట్స్ నిర్మించనున్నారు. ఎకోటూరిజం పనులు పూర్తయితే టూరిస్టుల రాక పెరిగి, ప్రైవేట్ రిసార్టులు, ఇతర వసతి సౌకర్యాలు కూడా అభివృద్ధి అవుతాయని అధికారులు భావిస్తున్నారు. 

దశలవారీగా ఎకోటూరిజం అభివృద్ధి పనులు

పులిగుండాల దగ్గర జిల్లా కలెక్టర్ నిధులతో కనీస సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటికే బర్డ్ వాచ్ టవర్, లెపర్డ్ వాచ్ టవర్ ఉన్నాయి. గేట్ ఏర్పాటు చేస్తున్నాం. ఫెన్సింగ్, క్యాంటీన్, నైట్ క్యాంపింగ్ స్టార్ట్ చేస్తాం. ఈనెల 15 నుంచి వైల్డ్ లైఫ్ ఎక్స్ పర్ట్ లు, ఎన్జీవోల కోసం ఓపెన్ చేస్తున్నాం. వాళ్ల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్న తర్వాత దశలవారీగా అభివృద్ధి పనులు చేస్తాం. ఇప్పటికే 20 కిలోమీటర్లు సఫారీ ట్రాక్ సిద్ధమైంది. 

మరో 10 కిలోమీటర్లు ఇంకా ఏర్పాటు చేయాల్సి ఉంది. పర్యాటకుల కోసం చెరువులో బోటింగ్, వసతి కాటేజ్ లు, భోజనం, తాగునీరు వసతులను కల్పిస్తాం. ప్రతి ఒక్కరూ కుటుంబం, పిల్లలతో సందర్శించి ఆనందంగా గడిపేలా తయారుచేస్తాం. పిల్లలకు సైక్లింగ్, ఓపెన్ జిమ్, అడ్వెంచర్ యాక్టివిటీస్ లాంటివి అభివృద్ధి చేస్తాం. 

-  సిద్ధార్థ్ విక్రమ్ సింగ్, డీఎఫ్ వో, ఖమ్మం