న్యూఢిల్లీ: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఓటర్ల లిస్టులోకి ఎవరినీ ఏకపక్షంగా చేర్చడం గాని, తొలగించడం గాని చేయలేదని ఎలక్షన్ కమిషన్(ఈసీ) వెల్లడించింది. సాయంత్రం 5 గంటలకు విడుదల చేసిన ఓటింగ్ డేటాను ఫైనల్ పోలింగ్ డేటాతో పోల్చడం కరెక్ట్ కాదని స్పష్టం చేసింది. నవంబర్‌లో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ ఇటీవల ఈసీని ఆశ్రయించింది. సాయంత్రం 5 గంటలకు వెలువడిన ఓటింగ్ శాతానికి, ఫైనల్ పోల్ పర్సెంటేజీకి వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉందని కాంగ్రెస్ పేర్కొంది.
దీనిపై సందేహం వ్యక్తం చేసింది. జులై నుంచి నవంబర్ మధ్య మహారాష్ట్రలోని 50 అసెంబ్లీ స్థానాల్లో సగటున 50 వేల మంది ఓటర్లు చేరారని.. ఈ 50 సీట్లలోని 47 స్థానాల్లో మహాయుతి కూటమి గెలిచిందని ఆరోపించింది. ఎన్నికల జాబితాల తయారీ నుంచి పోల్ ప్రక్రియ పూర్తయ్యే దాకా అవకతవకలు జరిగాయని వివరించింది. మహారాష్ట్ర ఎన్నికలపై కాంగ్రెస్ లేవనెత్తిన ప్రశ్నలకు ఈసీ మంగళవారం స్పందించింది. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 11:45 గంటల వరకు ఓటింగ్ శాతం పెరగడం సాధారణమేనని కాంగ్రెస్కు తెలిపింది.
అసలు ఓటింగ్ శాతాన్ని మార్చడం అసాధ్యమని ఈసీ స్పష్టం చేసింది. ఎందుకంటే, ఓటింగ్ ముగిశాక.. పోలింగ్ బూత్ వద్ద అభ్యర్థుల ఏజెంట్లకు ఓటింగ్ వివరాలను తెలియజేసే చట్టబద్ధమైన ఫారం 17సీ అందుబాటులో ఉంటుందని వివరించింది. పోలింగ్ స్టేషన్‌లో పోలైన మొత్తం ఓట్లకు ఫారం 17సీ చట్టబద్ధమైనదని తెలిపింది. దీన్ని సవరించడం కుదరదని.. పోలింగ్ కేంద్రాలు మూసివేయడానికి ముందే వాటిని అభ్యర్థులకు అందుబాటులో ఉంచామని చెప్పింది.
ఓటరు జాబితా తయారీలో పారదర్శకత
మహారాష్ట్ర ఓటరు జాబితాను పారదర్శకంగా తయారు చేశామని ఈసీ వెల్లడించింది. ఎవరినీ ఏకపక్షంగా చేర్చడంగాని, తొలగించడం గాని చేయలేదని తెలిపింది. పేర్ల తొలగింపులో ఎలాంటి అవకతవకలు జరగలేదని పేర్కొంది. ఓటరు జాబితాను తయారీలో కాంగ్రెస్ ప్రతినిధుల భాగస్వామ్యంతో సహా తగిన ప్రక్రియలను ఫాలో అయినట్లు చెప్పింది. కేవలం 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 50 వేలకు పైగా ఓటర్లు పెరిగారని కమిషన్ పేర్కొంది. మరణం, బదిలీ, డూప్లికేట్ ఎంట్రీల కారణంగా ప్రతి సీటుకు సగటున 2,779 మంది ఓటర్ల తొలగింపులు జరిగాయని వివరించింది.