ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించిన స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. తాజాగా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సిమెన్స్ కంపెనీ ఆస్తులను అటాచ్ చేసింది. ఢిల్లీ, ముంబై, పూణేలలోని సిమెన్స్ కంపెనీకి చెందిన రూ.23 కోట్ల ఆస్తులను అటాచ్ చేసినట్లు ఈడీ వెల్లడించింది. కాగా, 2014 నుండి 2019 మధ్య చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో అవకతవకలు జరిగినట్లు గత వైసీపీ ప్రభుత్వం ఆరోపించింది.
జగన్ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏపీ సీఐడీ చంద్రబాబుతో పాటు మరి కొందరిపై కేసు నమోదు చేసింది. స్కిల్ డెలప్మెంట్ కార్పొరేషన్ కేసులో మనీలాండరింగ్ జరిగినట్లు గుర్తించిన ఈడీ.. ఏపీ సీఐడీ కేసు ఆధారంగా ఈ కేసులో విచారణ మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే నకిలీ ఇన్ వాయిస్‌ల ద్వారా వస్తువులు కొనుగోలు చేసినట్లు గుర్తించిన ఈడీ.. స్కిల్ డెవలప్మెంట్ నిధులను వ్యక్తిగత ఖాతాలకు మళ్లించినట్లు గుర్తించింది.
ALSO READ | ఏపీలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్.. చంద్రబాబు ప్రకటన
ఈ మేరకు వ్యక్తిగత అకౌంట్లకు వెళ్లిన నిధులను తాజాగా ఈడీ అటాచ్ చేసింది. కాగా, ఇదే స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు 52 రోజుల పాటు జైలుకు వెళ్లిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇలాంటి సమయంలో చంద్రబాబుపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తిన కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ దూకుడు పెంచడం ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.