కరీంనగర్ : ఈడీ, ఐటీ డిపార్ట్మెంట్ల జాయింట్ ఆపరేషన్ ఇవాళ కూడా కొనసాగింది. కరీంనగర్ పరిధిలోని పలు గ్రానైట్ సంస్థల్లో అధికారులు సోదాలు నిర్వహించారు. కొత్తపల్లి మండలం నాగుల మల్యాలలోని ఓ గ్రానైట్ సంస్థలో, బావుపేటలోని ఎస్.వి.జి. గ్రానైట్ సంస్థలో సోదాలు జరుగుతున్నట్లు సమాచారం.దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
అంతకుముందు రోజు..
అంతకుముందు రోజు (బుధవారం) కూడా హైదరాబాద్, కరీంనగర్ లలో ఈడీ, ఐటీ టీమ్స్ ఆకస్మిక దాడులు చేశాయి. ఈడీ, ఐటీ అధికారులు దాదాపు 20కి పైగా టీమ్స్ గా విడిపోయి, ఏక కాలంలో అన్ని చోట్ల సోదాలు నిర్వహించారు. మంత్రి గంగుల కమలాకర్, ఆయన కుటుంబ సభ్యుల ఇండ్లు, ఆఫీసులతో పాటు మరికొందరు గ్రానైట్ వ్యాపారుల ఇండ్లు, ఆఫీసులు, క్వారీల్లో తనిఖీలు చేశాయి. మొత్తం 15 ప్రాంతాల్లో బుధవారం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు రైడ్స్ చేశాయి.
హైదరాబాద్ పంజాగుట్టలోని పీఎస్‌ఆర్ గ్రానైట్ ఆఫీస్, సోమాజిగూడలోని గ్రానైట్ వ్యాపారి శ్రీధర్ ఆఫీస్, రాజేంద్రనగర్ హైదర్‌గూడలోని జనప్రియ అపార్ట్‌మెంట్స్‌లో ఉన్న ఆయన ఇంట్లో అధికారులు సోదాలు చేశారు. కరీంనగర్ లోని మంత్రి గంగుల కమలాకర్ ఇల్లు, ఆఫీస్, ఆయన కుటుంబ సభ్యులు పార్ట్ నర్స్ గా ఉన్న శ్వేత గ్రానైట్స్ కార్యాలయంలో తనిఖీలు చేశారు. అలాగే సిటీలోని పీఎస్ఆర్ గ్రానైట్స్, గ్రానైట్ అసోసియేషన్, అరవింద్ వ్యాస్ కంపెనీ, ఎస్ వీజీ గ్రానైట్స్ ఆఫీసులు, శంకరపట్నం, కొత్తపల్లి, బావుపేటలోని క్వారీల్లోనూ సోదాలు జరిపారు. సోదాల్లో గ్రానైట్ కంపెనీలకు చెందిన కీలక డాక్యుమెంట్లు, హార్డ్ డిస్క్ లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది.
మంత్రి ఇంటి తాళం పగులగొట్టి సోదాలు..
మంత్రి గంగుల కమలాకర్ కుటుంబ సభ్యులతో కలిసి రెండ్రోజుల కింద దుబాయ్ టూర్ కు వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో మంత్రి పీఏ కిషన్ ప్రసాద్ సమక్షంలో తాళం తీయించేందుకు ప్రయత్నించారు. అయితే ఎంత ప్రయత్నించినా రాకపోవడంతో చివరకు పగులగొట్టారు. గంగుల ఇంటితో పాటు అదే ఆవరణలో ఉన్న ఆయన సోదరుల ఇండ్లలోనూ అధికారులు సోదాలు నిర్వహించారు. అంతకుముందు గంగుల ఆఫీస్ (మీసేవా) లో తనిఖీలు చేపట్టారు. ఆయన కుటుంబ సభ్యులు పార్టనర్స్ గా ఉన్న శ్వేత గ్రానైట్స్ ఆఫీస్ మంకమ్మతోటలో ఉండగా, అక్కడా తనిఖీలు చేశారు. కాగా, దాడుల విషయం తెలిసి దుబాయ్ టూర్ లో ఉన్న గంగుల హుటాహుటిన బుధవారం అర్ధరాత్రి కరీంనగర్ కు చేరుకున్నారు.
ఏంటీ కేసు?
ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి జరిగిన గ్రానైట్ ఎగుమతుల్లో అవకతవకలు చోటుచేసుకున్నాయని చాలా ఫిర్యాదులు వచ్చాయి. 2008 నుంచి 2011దాకా పర్మిట్లు లేకుండా విదేశాలకు ఎగుమతి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. కాకినాడ, కృష్ణపట్నం పోర్టుల నుంచి ఎక్కువగా ఎగుమతి జరిగింది. ఈ అక్రమ రవాణాపై విజిలెన్స్ విచారణ చేపట్టి 2013లో రిపోర్టు ఇచ్చింది. గ్రానైట్ కంపెనీలు రూ.124.94 కోట్ల సీనరేజీ ఫీజు ఎగ్గొట్టినట్లు తేల్చింది. దీనికి 5 రెట్ల జరిమానా రూ. 624.73 కోట్లతో కలిపి మొత్తం రూ.749.66 కోట్లు చెల్లించాలని ఆయా కంపెనీలకు నోటీసులు ఇచ్చింది.
అయితే ఆ కంపెనీలు ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించలేదు. దీనిపై 2013లోనే సీబీఐ కేసు నమోదు చేసింది. ఎంపీ బండి సంజయ్ 2019లో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు ఫిర్యాదు చేశారు. ఆపై 2021లో బీజేపీ నేత బేతి మహేందర్ రెడ్డి ఈడీ, పీఎంవోలకు ఫిర్యాదు చేశారు. పోయినేడాది నవంబర్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు పేరాల చంద్రశేఖర్ రావు సీబీఐకి ఫిర్యాదు చేశారు.