మనీలాండరింగ్ కార్యకలాపాలపై కొనసాగుతున్న విచారణలో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED).. చైనా మొబైల్ తయారీదారు వివో మొబైల్స్ ఇండియాకు చెందిన నలుగురు ఎగ్జిక్యూటివ్‌లను అరెస్టు చేసింది. ఇందులో ఒక చైనా పౌరుడు కూడా ఉన్నారు. లావా ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు హరి ఓం రాయ్ కూడా ఈడీ అరెస్టు చేసిన వ్యక్తుల్లో ఒకరు. అయితే అతని ప్రమేయంపై అధికారులు మాత్రం ఎలాంటి వివరాలు వెల్లడించలేదు.
గ్రాండ్ ప్రాస్పెక్ట్ ఇంటర్నేషనల్ కమ్యూనికేషన్స్ (GPICPL)తో సహా వివో మొబైల్స్ ఇండియా, 23 అనుబంధ కంపెనీలను కలిగి ఉన్న 48 స్థానాల్లో ఈడీ వరుస దాడులు నిర్వహించింది. ఢిల్లీ పోలీసులు దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను ప్రకారం, మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎమ్‌ఎల్‌ఎ) కింద ఈడీ దర్యాప్తు ఫిబ్రవరి 3, 2022న ప్రారంభమైంది. GPICPL చీటింగ్, మోసం, నేరపూరిత కుట్రకు పాల్పడిందని ఆరోపిస్తూ కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ చేసిన ఫిర్యాదు ఆధారంగా ఈ ఎఫ్ఐఆర్(FIR) నమోదైంది.
అక్రమంగా చైనాకు నిధులను బదిలీ చేయడమే ప్రధాన ఉద్దేశ్యంగా భారత్‌లో బహుళ కంపెనీలను విలీనం చేశారని ఈడీ ఆరోపించింది. వివో మొబైల్స్ ఇండియా గణనీయమైన మొత్తాన్ని బదిలీ చేసిందని దర్యాప్తు వెల్లడించింది. దాని అమ్మకాల ఆదాయంలో దాదాపు సగం అంటే రూ. 1.25 లక్షల కోట్లు, చైనాకు, భారత్‌లో పన్నులు ఎగవేసినట్లు ఆరోపణలు వచ్చాయి.