మాజీ ఎంపీ ఎంవీవీకి భారీ షాక్.. రూ.44.74 కోట్ల ఆస్తులు జప్తు చేసిన ఈడీ

మాజీ ఎంపీ ఎంవీవీకి భారీ షాక్.. రూ.44.74 కోట్ల ఆస్తులు జప్తు చేసిన ఈడీ

విశాఖపట్నం మాజీ ఎంపీ, వైసీపీ నేత ఎంవీవీ సత్యనారాయణకు భారీ షాక్ తగిలింది. హయగ్రీవ ఫామ్స్‌కు చెందిన రూ. 44.74 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ జప్తు చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద రూ.42.03 కోట్ల విలువైన 14 స్థిరాస్తులు, రూ.2.71 కోట్ల విలువైన ఆరు చరాస్తులను ఈడీ అటాచ్ చేసింది. 

అనాథలు, వృద్ధులకు సేవ చేస్తామని ఎండాడలోని 12.51 ఎకరాల ప్రభుత్వ భూమిని ఎంవీవీ తీసుకున్నారు. అనంతరం దానిని ఫ్లాట్లుగా మార్చి విక్రయించారు. దీనిపై గతేడాది జూన్‌‌లో పోలీసులకు ఫిర్యాదు అందగా.. ఆ ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా రంగంలోకి దిగిన ఈడీ దర్యాప్తు మొదలు పెట్టింది. గతేడాది అక్టోబరులో ఎంవీవీ, ఆయన కార్యాలయాల్లో సోదాలు జరిపిన ఈడీ.. నకిలీ పత్రాలను తయారు చేసే డిజిటల్ పరికరాలు, వివిధ కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుంది.

హయగ్రీవ భూముల అమ్మకాల్లో ఎంవీవీ, ఆడిటర్ జీవీ, మేనేజింగ్ పార్టనర్ గద్దె బ్రహ్మాజీలు కీలక పాత్ర పోషించినట్లు ఈడీ దర్యాప్తులో తేలింది. అనాథల కోసం ఉద్దేశించిన భూమిని మోసపూరితంగా బదిలీ చేయడంపై దర్యాప్తులో భాగంగా ఈడీ ఈ చర్యలు తీసుకుంది. 

అటాచ్ చేసిన ఆస్తులు ఎంవీవీ బిల్డర్స్, హయగ్రీవ ఇన్‌ఫ్రాటెక్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్, గద్దె బ్రహ్మాజీ, అతని భార్య, చిలుకూరి జగదీశ్వరుడు, చిలుకూరి రాధా రాణి, హయగ్రీవ ప్రాజెక్ట్స్, వారణాసి దిలీఫ్‌లకు చెందినవి.