- సీఏలు, హవాలా ఆపరేటర్ల నెట్‌వర్క్‌ను ఛేదించిన ఈడీ
న్యూఢిల్లీ: గత కొన్ని సంవత్సరాల నుంచి రూ.10 వేల కోట్లకు పైగా బ్లాక్‌మనీని విదేశాలకు పంపిన సీఏలు, హవాలా ఆపరేటర్ల నెట్‌వర్క్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఛేదించింది. ఈ నెల 2న థానే, ముంబై, వారణాసిలో జరిపిన సోదాల్లో ఇందుకు సంబంధించిన డిజిటల్, ఇతర డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన జితేంద్ర పాండే.. బ్లాక్‌మనీని సింగపూర్, హాంకాంగ్, థాయిలాండ్ కు పంపి.. వైట్‌మనీగా మార్చడానికి 98 కి పైగా షెల్ కంపెనీలను, 269 బ్యాంకు ఖాతాలను తెరిచినట్టు ఈడీ వెల్లడించింది.
అనేక బ్యాంకు ఖాతాలలో లావాదేవీలు జరిపిన తర్వాత.. నిందితులు 12 ప్రైవేట్ కంపెనీల ఖాతాలకు నిధులు బదిలీ చేసి.. విదేశీ చెల్లింపులు చేశారని పేర్కొంది. చైనా నుంచి వస్తువుల దిగుమతికి చెల్లింపుల పేరుతో నిధులను దేశం నుంచి బయటకు పంపించారని తెలిపింది.
సరుకు రవాణా, లాజిస్టిక్స్ వ్యాపారంలో.. సరుకు రవాణా చార్జీల పేరుతో విదేశాలకు నిధులను పంపారని ప్రకటించింది. కంపెనీలను విలీనం చేయడంలో, నిందితులకు సహాయం సీఏలు చేశారు. పాండేతో పాటు మరికొందరిపై గత సంవత్సరం థానే పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ దర్యాప్తు ప్రారంభించింది.