సీఎం సిద్ధరామయ్య కుమారుడు యతీంద్రపై ఈడీ కేసు

సీఎం సిద్ధరామయ్య కుమారుడు యతీంద్రపై ఈడీ కేసు

మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) భూ కుంభకోణానికి సంబంధించిన సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఆయన కుమారుడు డాక్టర్ యతీంద్ర సిద్ధరామయ్య ప్రయత్నిస్తు న్నారంటూ వచ్చిన ఫిర్యాదుపై ఈడీ కేసు నమోదైంది. 14 స్థలాలకు సంబంధించిన కీలకమైన సాక్ష్యాలను ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేయడంలో సీఎం సిద్ధరామయ్య, ఆయన కుమారుడి ప్రమేయం ఉందని ప్రదీప్ కుమార్ అనే వ్యక్తి ఈడీకి ఫిర్యాదు చేశారు. 

ఇదిలా ఉండగా ముడా కుంభకోణంపై ఫిర్యాదు చేసిన సామాజిక కార్యకర్త స్నేహమయి కృష్ణ ఇవాళ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఎదుట హాజరై విచారణకు సంబంధించిన రికార్డుల వాంగ్మూలం ఇచ్చారు.  ముడా కుంభకోణం కేసులో విచారణ ఎదుర్కొంటున్న సిద్ధరామయ్య ఎప్పటికైనా సత్యమే గెలుస్తుందన్న నమ్మకం తనకు ఉందన్నారు. మైసూరులోని చాముండేశ్వరీ ఆలయ ప్రాంగణంలో దసరా ఉత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు. 

ప్రజలు, అమ్మవారి ఆశీస్సులు ఉన్నంత వరకూ తనను ఎవరూ ఏమీ చేయలేరని సీఎం పేర్కొన్నారు. తాను ఏ తప్పు చేయలేదని, తప్పు చేసి ఉంటే ఇంతకాలం రాజకీయాల్లో ఉడడం అసాధ్యమన్నారు.