- ఫెమా ఉల్లంఘన కింద ఈసీఐఆర్ నమోదు
- అందులో కేటీఆర్, అర్వింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డి పేర్లు
- అంతకుముందు ఎఫ్ఐఆర్ సహా కేసు రికార్డుల కోసం ఏసీబీకి లెటర్
- ఏసీబీ డాక్యుమెంట్లన్నీ అందించడంతో కేసు నమోదు
- బ్రిటన్ కంపెనీకి బదిలీ అయిన రూ.46 కోట్లపై ఈడీ నజర్
హైదరాబాద్, వెలుగు : ఫార్ములా–ఈ రేస్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకున్నది. దీనిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా కేసు నమోదు చేసింది. ఇప్పటికే ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా శుక్రవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఈసీఐఆర్)ను రిజిస్టర్ చేసింది. ఇందులో అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అర్వింద్ కుమార్, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బి.లక్ష్మీనరసింహారెడ్డి పేర్లను చేర్చింది.
ఫార్ములా-ఈ రేస్ వ్యవహారంలో బ్రిటన్ కంపెనీకి బదిలీ అయిన రూ.46 కోట్లపై ఈడీ దృష్టిపెట్టింది. ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా తరలించిన డబ్బు లెక్కలను తీస్తున్నది. ఫారిన్ ఎక్స్ ఛేంజ్ యాక్ట్ (ఫెమా) ఉల్లంఘన కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నది. కాగా, అంతకుముందు శుక్రవారం ఉదయం ఏసీబీ డీజీకి ఈడీ హైదరాబాద్ జోనల్ జాయింట్ డైరెక్టర్ రోహిత్ ఆనంద్ లెటర్ రాశారు. ఫార్ములా-ఈ రేస్ వ్యవహారంలో విదేశీ కంపెనీలకు చెల్లింపులపై ప్రస్తావించారు. ఫెమా ఉల్లంఘన కింద దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ఇందుకోసం ఈసీఐఆర్ రిజిస్టర్ చేసేందుకు సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అందించాలని కోరారు. ఎఫ్ఐఆర్ కాపీ, ఎంఏయూడీ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోర్ ఇచ్చిన ఫిర్యాదు కాపీ, ఫార్ములా–ఈ రేస్ నిర్వహణ అగ్రిమెంట్స్ సహా పూర్తి డాక్యుమెంట్లను అందించాలని విజ్ఞప్తి చేశారు. దీంతో ఈడీ అడిగిన డాక్యుమెంట్లన్నీ సాయంత్రానికల్లా ఏసీబీ అధికారులు అందజేశారు. వాటి ఆధారంగా ఈడీ ఈసీఐఆర్ నమోదు చేసింది.
ఐటీ సమాచారంతో వెలుగులోకి..
మూడేండ్ల పాటు ఫార్ములా–ఈ రేస్ నిర్వహించేందుకు గాను బ్రిటన్ కు చెందిన ఫార్ములా–ఈ ఆపరేషన్స్ (ఎఫ్ఈవో) కంపెనీతో రూ.600 కోట్లకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ క్రమంలో సీజన్ 10 కోసం నిబంధనలకు విరుద్ధంగా చెల్లింపులు చేసింది. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండగానే హెచ్‌ఎండీఏ నుంచి ఎఫ్ఈవో కంపెనీ అకౌంట్లకు రూ.45 కోట్ల 71లక్షల 60 వేల 625 ట్రాన్స్‌ఫర్ చేసింది. ఈ లావాదేవీలను ఇన్‌కమ్‌ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌లోని ఇంటెలిజెన్స్ యూనిట్ గుర్తించింది.
ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా విదేశీ కంపెనీకి చెల్లింపులు జరగడంతో హెచ్‌ఎండీఏకు రూ.8.07 కోట్ల జరిమానా విధించింది. ఈ అనధికారిక లావాదేవీల సమాచారాన్ని సెంట్రల్ ఏజెన్సీలకు అందజేసింది. ఈ వ్యవహారంలో హెచ్‌ఎండీఏ నుంచి మొత్తం రూ.54 కోట్ల 88లక్షల 87వేల 43 దుర్వినియోగం అయినట్టు గుర్తించారు. దీనిపై ఎంఏయూడీ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోర్ ఫిర్యాదు మేరకు ఏసీబీ కేసు నమోదు చేసింది. అందులో కేటీఆర్, అర్వింద్‌కుమార్, బీఎల్‌ఎన్ రెడ్డిని నిందితులుగా చేర్చింది.
ఏసీబీ దర్యాప్తు ముమ్మరం..
ఫార్ములా–ఈ రేస్ కేసుపై విచారణ కొనసాగించవచ్చని హైకోర్టు చెప్పడంతో ఏసీబీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఎంఏయూడీ ముఖ్య కార్యదర్శి దానకిశోర్ నుంచి మరోసారి వివరాలు సేకరించనున్నారు. శనివారం ఆయన స్టేట్‌మెంట్ రికార్డ్ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ కేసులో కేటీఆర్‌పై మోపిన అభియోగాలు వీగిపోకుండా, అందుకు సంబంధించిన ఆధారాలను అధికారులు సేకరిస్తున్నారు. ఇందులో భాగంగా అగ్రిమెంట్స్, నగదు చెల్లింపులు, ఇతర లావాదేవీలకు సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారు. ఇందుకోసం ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ డీఎస్పీ మాజిద్ అలీఖాన్ నేతృత్వంలో స్పెషల్ టీమ్ పని చేస్తున్నది.