‘ఈఎస్‌ఐ’ స్కామ్ కేసులో ఈడీ చార్జ్​షీట్

  • విచారణకు స్వీకరించిన నాంపల్లి ఎమ్‌ఎస్‌జే కోర్ట్
  • దేవికారాణి సహా 17 మందిపై అభియోగాలు

హైదరాబాద్‌, వెలుగు : ఈఎస్‌ఐ ఇన్సూరెన్స్‌ మెడికల్‌ సర్వీసెస్‌(ఐఎమ్‌ఎస్) స్కామ్‌ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మనీ ల్యాండరింగ్‌ యాక్ట్‌ కింద నాంపల్లి మెట్రోపాలిటన్ సెషన్స్‌ కోర్టులో ఈడీ చార్జ్​షీట్​ దాఖలు చేసింది. ఐఎమ్‌ఎస్ మాజీ డైరెక్టర్‌‌ దేవికారాణి, జాయింట్ డైరెక్టర్‌‌ కలకుంట్ల పద్మ సహా మొత్తం 17 మందిపై అభియోగాలు మోపింది. ఏసీబీ నమోదు చేసిన ఎనిమిది ఎఫ్‌ఐఆర్‌‌ల ఆధారంగా దర్యాప్తు చేసినట్లు వెల్లడించింది. దేవికారాణి సహా నిందితులు అంతా కలిసి మోసానికి పాల్పడట్లు పేర్కొంది. మెడిసిన్‌, మెడికల్ ఎక్విప్​మెంట్​ కొనుగోలులో అక్రమాలకు పాల్పడట్టు చార్జ్​షీట్​లో తెలిపింది. వెండర్స్​తో కుమ్మక్కై ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టినట్లు వివరించింది. ప్రైవేట్ వ్యక్తులతో కలిసి కుట్ర పన్నారని తెలిపింది. ఉద్దేశపూర్వకంగా అత్యవసర పరిస్థితులు, వైద్య పరికరాల కొరతను సృష్టించారని దర్యాప్తులో వెల్లడైనట్లు పేర్కొంది.

బినామీలు, ప్రైవేట్​ వ్యక్తులతో కలిసి..

లోకల్ వెండర్స్‌ ద్వారా నకిలీ ఆర్డర్స్‌, నకిలీ ఇన్‌వాయిస్‌లు క్రియేట్ చేశారని ఈడీ చార్జిషీట్​లో తెలిపింది. దేవికా రాణి సహకారంతో బినామీ సంస్థలు కూడా వెలిశాయని ఈడీ అధికారులు కోర్టుకు వివరించారు. నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ ధరలకు మందులు, మెడికల్ కిట్స్‌ కొనుగోలు చేశారని తెలిపింది. ఇలా ప్రైవేటు వ్యక్తులు, బినామీ నెట్​వర్క్​తో రూ.కోట్లు సంపాదించారని వివరించింది. దేవికారాణి సహా ఐఎమ్‌ఎస్‌ అధికారులు క్విడ్ ప్రోకో గా డబ్బు సేకరించారని వెల్లడించింది. ఇలా సంపాదించిన డబ్బుతో విలువైన నగలు, స్థిరాస్తులు కొనుగోలు చేశారని ఆధారాలు అందజేసింది. ఇప్పటికే ఈ కేసులో రూ.143.15 కోట్లు విలువ చేసే ఆస్తులు జప్తు చేసినట్లు ఈడీ అధికారులు పేర్కొన్నారు. ఈడీ దాఖలు చేసిన ప్రాసిక్యూషన్ కంప్లయింట్‌ను కోర్టు విచారణకు స్వీకరించింది. మనీల్యాండరింగ్‌ యాక్ట్‌ కింద విచారణ జరుపనుంది.