- జీఎస్టీ కేసులోకి ఈడీ ఎంట్రీ!
- ఈసీఐఆర్ నమోదు చేసిన ఆఫీసర్లు
- నిందితుడిగా మాజీ సీఎస్ సోమేశ్
- రూ.46 కోట్ల కుంభకోణంపై విచారణ స్టార్ట్
- నకిలీ ఐటీసీ పొందిన సంస్థలపై ఆరా
- కలుగులోంచి ఎవరు బయటికొస్తారో..?
హైదరాబాద్: గత ప్రభుత్వ హయాంలో జరిగిన జీఎస్టీ స్కాం కేసులోకి ఈడీ ఎంట్రీ ఇచ్చింది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన జీఎస్టీ స్కామ్ పై ఈడీ కేసు నమోదు చేసింది. జీఎస్టీ చెల్లింపుల్లో రూ.46 కోట్ల మేర అవకతవకలు జరిగినట్లు ఈడీ గుర్తించింది. ఈసీఐఆర్ నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించింది. ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్, ఐజీఎస్టీ, సెస్ తదితరాలకు సంబంధించి చోటు చేసుకున్న ఈ గోల్‌మాల్‌లో ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌తో పాటు వాణిజ్య పన్నుల శాఖ అధికారులు నిందితులుగా ఉన్నట్టు తేలింది. సోమేశ్ కుమార్ కనుసన్నల్లోనే స్కాం జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు. ఈడీ విచారణలో ఎవరెవరు బయటికి వస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
బోగస్ ఇన్వాయిస్ లతో దందా
గత ప్రభుత్వ హయాంలో బోగస్ ఇన్వాయిస్‌లను సృష్టించి, పెద్ద ఎత్తున ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ ను క్లెయిమ్ చేసినట్లు వాణిజ్య పన్నుల శాఖ ఆడిట్‌లో గుర్తించింది. ఈ కేసులో వస్తువులు సరఫరా చేయకపోయినా బోగస్ ఇన్వాయిస్ లను సృష్టించారని అధికారులు గుర్తించారు. 70 కంపెనీల ఐజీఎస్టీ చెల్లింపుల్లో భారీగా అవకతవకలకు పాల్పడడమే కాకుండా ఐజీఎస్టీ కింద రూ.1000 కోట్ల మేర అక్రమంగా ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ బదిలీ చేసినట్లు రాష్ట్ర వాణిజ్యపన్నుల శాఖ ఆడిట్లో తేలింది. దీనిపై ఆ శాఖ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రాథమికగా విచారించిన సీసీఎస్ పోలీసులు ఏడుగురిపై కేసు నమోదు చేశారు. వాణిజ్య పన్నుల శాఖ అదనపు కమిషనర్ ఎస్‌వీ కాశీ విశ్వేశ్వరరావు, డిప్యూటీ కమిషనర్ ఏ శివరామప్రసాద్, అసిస్టెంట్ ప్రొఫెసర్ శోభన్‌బాబు, జీఎస్టీ సాఫ్ట్‌వేర్‌ను తయారు చేసిన ప్లింటో టెక్నాలజీని ఎఫ్‌ఐఆర్‌లో నిందితులుగా చేర్చారు. ఈ కేసులో మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ ఏ5గా ఉన్నారు. ఇది వందల కోట్ల వ్యవహారం కాదని, మొత్తం స్కామ్ రూ.వేల కోట్లలో ఉంటుందని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చి సమగ్ర దర్యాప్తు కోసం సీఐడీకి అప్పగించింది.
220 కంపెనీల నకిలీ ఐటీసీలు
దేశవ్యాప్తంగా 220 కన్నా ఎక్కువ కంపెనీలు నకిలీ బిల్లులు సృష్టించి ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ పొందాయని ఈడీ భావిస్తోంది. ఇందులో తెలంగాణకు చెందినవి కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఇటీవలే అహ్మదాబాద్లో ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వారిలో ఒక జర్నలిస్టు కూడా ఉండటం గమనార్హం. ప్రభుత్వ ఖజానాకు తీవ్ర నష్టం జరిగిందని భావించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ వ్యవహారంలోకి ఎంట్రీ ఇచ్చింది.