గోల్డ్‌‌‌‌ క్రెడిట్‌‌‌‌ లోన్ స్కీం పేరుతో రూ.549 కోట్ల మోసం

గోల్డ్‌‌‌‌ క్రెడిట్‌‌‌‌ లోన్  స్కీం పేరుతో రూ.549 కోట్ల మోసం
  • ఎంబీఎస్ జువెలర్స్‌‌‌‌ కేసులో ఈడీ చార్జిషీటు
  • రూ.363 కోట్ల విలువైన ప్రాపర్టీ జప్తు
  • రూ.149.10 కోట్లు విలువ చేసే ఆభరణాలు, రూ.1.96 కోట్ల నగదు సీజ్

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: మనీ లాండరింగ్‌‌‌‌ కేసులో ముసదిలాల్  జెమ్స్  అండ్  జువెల్లర్స్‌‌‌‌, ఎంబీఎస్‌‌‌‌  జువెలర్స్‌‌‌‌పై ఈడీ చార్జిషీటు దాఖలు చేసింది. ఆ రెండు కంపెనీల డైరెక్టర్లు సుఖేశ్  గుప్తా, కర్రి రవిప్రసాద్, వల్లూరి మోహన్ రావుపై మనీ లాండరింగ్  నిరోధక చట్టం కింద అభియోగాలు మోపింది. ఈడీ దాఖలు చేసిన చార్జిషీటును నాంపల్లిలోని ఆర్థిక నేరాల కోర్టు విచారణకు స్వీకరించింది.

గోల్డ్  క్రెడిట్  స్కీం పేరుతో  ముసదిలాల్  జెమ్స్  అండ్  జువెల్లర్స్‌‌‌‌  ఎండీ సుఖేశ్ గుప్తా.. మినరల్స్  అండ్  మెటల్స్  ట్రేడింగ్  కార్పొరేషన్ (ఎంఎంటీసీ) ఆఫ్ ఇండియా వద్ద గోల్డ్‌‌‌‌ బులియన్‌‌‌‌  బయ్యర్  క్రెడిట్‌‌‌‌  లోన్స్‌‌‌‌ స్కీమ్‌‌‌‌  తీసుకున్నాడు. 5 శాతం మార్జిన్  మనీ చెల్లించకుండా మోసం చేశాడు. దీంతో ఎంఎంటీసీకి రూ.549.06 కోట్ల మేర నష్టం వాటిల్లింది. ఇలా సంపాదించిన సొమ్మును సుఖేశ్  వివిధ కంపెనీలకు మళ్లించాడు. ఎంఎంటీసీ ఫిర్యాదుతో 2018లో సీబీఐ కేసు నమోదు చేసింది.

సీబీఐ ఎఫ్‌‌‌‌ఐఆర్  ఆధారంగా ఈడీ దర్యాప్తు చేసింది. 2018 అక్టోబర్‌‌‌‌‌‌‌‌లో, 2019 జులైలో, 2022 అక్టోబర్‌‌‌‌‌‌‌‌లో ఈడీ సోదాలు నిర్వహించింది. సుఖేశ్  గుప్తా కంపెనీలతో పాటు ఇళ్లలో రూ.149.10 కోట్ల విలువైన బంగారు ఆభరణలు, రూ.1.96 కోట్ల నగదు స్వాధీనం చేసుకుంది. రూ.363 కోట్లు విలువచేసే ఆస్తులను జప్తు చేసింది. వీటికి సంబంధించిన డాక్యుమెంట్లతో ప్రాసిక్యూషన్  కంప్లైంట్‌‌‌‌  (చార్జిషీటు) దాఖలు చేసింది.