ఫాంహౌస్ కేసు: నందకుమార్ను నాలుగు గంటల పాటు ప్రశ్నించిన ఈడీ 

ఫాంహౌస్ కేసు: నందకుమార్ను నాలుగు గంటల పాటు ప్రశ్నించిన ఈడీ 

ఫాం హౌస్ కేసులో నిందితుడిగా ఉన్న నందకుమార్ ను ఈడీ అధికారులు చంచల్ గూడ జైలులో సుమారు నాలుగు గంటలపాటు విచారించారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసుతో పాటు రోహిత్ రెడ్డితో సంబంధాలు, వ్యాపార లావాదేవీలపై ఆరా తీసినట్టు తెలుస్తోంది. నంద కుమార్ పై నమోదైన పలు కేసుల వివరాలను ఈడీ అధికారులు సేకరించినట్టు సమాచారం. మధ్యాహ్నాం12:10 గంటలకు జైలుకు వెళ్లిన అసిస్టెంట్ డైరెక్టర్ సుమిత్ గోయల్, దేవేందర్ సింగ్ , వీర నారాయణ్ రెడ్డి ఆధ్వర్యంలో నందకుమార్ ను విచారించారు. రేపు మరోసారి నందకుమార్ ను విచారించి స్టేట్ మెంట్ ను  రికార్డ్ చేయనున్నారు. 

లంచ్ కు ముందు వరకు నందకుమార్ వ్యక్తిగత వివరాలను మాత్రమే రికార్డు చేశారు. ఆయన వ్యాపారాలు, పరిచయాలపై ఆరా తీశారు. నందకుమార్ పార్ట్నర్గా ఉన్న  రోహిత్ రెడ్డి కుటుంబసభ్యులకు సంబంధించిన వివరాలను సైతం ఈడీ రికార్డు చేసింది. అభిషేక్ ఆవుల ద్వారా పరిచయమైన వ్యక్తుల వివరాలు, ఆర్థిక వ్యవహారాలపైనా అధికారులు సమాచారం సేకరిస్తున్నట్లు తెలుస్తోంది.

జైలర్ రూంలో నందు స్టేట్ మెంట్ ను అధికారులు రికార్డు చేసినట్టు తెలుస్తోంది. లంచ్కు ముందు గంటసేపు ప్రశ్నించిన ఈడీ.. 45 నిమిషాల భోజన విరామం అనంతరం మళ్లీ విచారణ ప్రారంభించారు. కరోనా కేసులు పెరుగుతున్నందున నంద కుమార్ను ఈడీ అధికారులు చంచల్ గూడ జైలులోనే ప్రశ్నించారు.