ల్యాండ్ స్కామ్‎లో ఈడీ దూకుడు.. పోలీసుల సహకారంతో కేసులు, అరెస్ట్‌‌లకు రంగం సిద్ధం..!

ల్యాండ్ స్కామ్‎లో ఈడీ దూకుడు.. పోలీసుల సహకారంతో కేసులు, అరెస్ట్‌‌లకు రంగం సిద్ధం..!

హైదరాబాద్‌‌, వెలుగు: మేడ్చల్‌‌ మల్కాజ్​గిరి, రంగారెడ్డి జిల్లాల భూముల కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఐఏఎస్ అమోయ్‌‌కుమార్‌‌‌‌పై చర్యలతో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజాప్రతినిధులు, ప్రస్తుత, మాజీ ఐఏఎస్‌‌లను విచారించేందుకు ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్‌‌ డైరెక్టరేట్‌‌(ఈడీ) రెడీ అయింది. సోమవారం నుంచి దర్యాప్తు మరింత స్పీడప్​చేయనుంది.

 ఈ మేరకు ఈడీ అధికారులు శుక్రవారం డీజీపీ జితేందర్‌‌‌‌ను కలిశారు. ప్రధానంగా మహేశ్వరం మండలం నాగారంలోని భూదాన్‌‌ భూముల అక్రమ రిజిస్ట్రేషన్స్‌‌ దర్యాప్తుకు సంబంధించిన వివరాలపై చర్చించారు. ఐఏఎస్‌‌ అమోయ్‌‌కుమార్‌‌ విచారణ ప్రారంభించిన తర్వాత వరుసగా వస్తున్న ఫిర్యాదుల గురించి డీజీపీకి వివరించినట్లు తెలిసింది.

12 ఫిర్యాదుల్లో పోలీస్‌‌ ఇన్వెస్టిగేషన్‌‌ చేయాలి

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం భూదాన్‌‌ భూముల కేసుల దర్యాప్తులో భాగంగా అమోయ్‌‌కుమార్‌‌ సహా పలువురు ఐఏఎస్‌‌లు, ఐపీఎస్‌‌లపై ఈడీకి 12 ఫిర్యాదులు అందాయి. మనీలాండరింగ్ చట్టం (పీఎంఎల్ఏ) కింద ఈ కేసులు దర్యాప్తు చేసేందుకు అవసరమైన పోలీస్‌‌ సహకారం అందించాలని ఈడీ అధికారులు డీజీపీని కోరారు. 

స్థానిక పోలీస్‌‌స్టేషన్లలో కేసులు నమోదు చేసి దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. భూదాన్‌‌ భూముల వ్యవహారంలో స్థానిక పోలీసులకు లేఖలు రాసినా ఎలాంటి వివరాలు అందించలేదని ఈడీ అధికారులు డీజీపీకి తెలిపారు. ప్రధానంగా శంకరాహిల్స్‌‌ సొసైటీ, బాలసాయిబాబా ట్రస్ట్‌‌ భూములు, రాయదుర్గంలోని కొన్ని ల్యాండ్‌‌ల వ్యవహారంలో ఇన్వెస్టిగేషన్‌‌ జరిపించాలని ఈడీ అధికారాలు డీజీపీని కోరినట్లు తెలిసింది.

అమోయ్‌‌ కుమార్‌‌ గుట్టు విప్పారా..!

గత బీఆర్ఎస్​ప్రభుత్వ హయాంలో రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో జరిగిన భూకుంభకోణంపై అమోయ్‌‌కుమార్‌‌ గుట్టు విప్పినట్లు తెలిసింది. మహేశ్వరం మండలం నాగారం రెవెన్యూ పరిధి సర్వే నంబర్‌‌‌‌లో గల 42 ఎకరాల 33 గుంటల భూమికి సంబంధించిన కేసులో ఈడీ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. భూదాన్‌‌ భూముల కుంభకోణానికి సంబంధించి రంగారెడ్డి జిల్లా మాజీ కలెక్టర్‌‌‌‌ ఐఏఎస్‌‌ అమోయ్‌‌కుమార్‌‌‌‌ను గత నెల 23, 24, 25 తేదీల్లో ఈడీ అధికారులు దాదాపు 28 గంటల పాటు ప్రశ్నించారు. 

ఈ క్రమంలోనే అమోయ్‌‌కుమార్‌‌‌‌పై ఈడీ అధికారులకు దాదాపు 12 ఫిర్యాదులు అందాయి. అమోయ్‌‌కుమార్‌‌‌‌ సహా పలువురు సీనియర్‌‌‌‌ ఐఏఎస్‌‌లు అధికారులపై భూకుంభకోణం, అక్రమ రిజిస్ట్రేషన్స్‌‌ సహా ఇతర ఆరోపణలు ఉన్నాయి. వీటిపై ఇప్పటికే అమోయ్‌‌కుమార్‌‌‌‌ నుంచి సమాచారం సేకరించినట్లు తెలిసింది. హైదరాబాద్‌‌ శివారు ప్రాంతాల్లో గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూకుంభకోణంలో ఆయా అధికారుల పాత్ర ఉన్నట్లు ఈడీ అనుమానిస్తున్నట్లు సమాచారం.

బాధితుల ఫిర్యాదు, స్టేట్​మెంట్లతో ఎంక్వైరీ 

అమోయ్‌‌కుమార్‌‌తో పాటు మహేశ్వరం మాజీ తహ సీల్దార్‌‌‌‌ జ్యోతి, మాజీ ఆర్డీఓ వెంకటాచారి ఇచ్చిన స్టేట్‌‌ మెంట్‌‌తో పాటు బాధితులు అందించిన డాక్యుమెంట్లు, ఇతర ఆధారాలతో ఈడీ ఎంక్వైరీ చేస్తున్నది. సంబంధిత అధికారులను విచారిస్తున్నారు. వీరి స్టేట్‌‌మెంట్స్‌‌, స్థానిక పోలీస్ స్టేషన్స్‌‌లో కేసుల ఆధారంగా పలువురు ప్రజా ప్రతినిధులు, ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్యూరోక్రాట్స్‌‌కు ఈడీ సమన్లు జారీ చేయనున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగానే డీజీపీ జితేందర్‌‌‌‌ను కలిసినట్లు సమాచారం. ఈ మొత్తం వ్యవహారంలో కేసుల నమోదు, దర్యాప్తు బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు అవసరమైన సహకారం అందించాలని ఈడీ అధికారులు డీజీపీని కోరినట్లు తెలిసింది.