- బీఆర్‌ఎస్‌కు గ్రీన్‌కో అనుబంధ కంపెనీల ఎలక్టోరల్ బాండ్ల వెనుక మతలబేంది?
- రూ. 41 కోట్ల బాండ్లు ఇచ్చిన 15 రోజుల్లోనే ఫార్ములా– ఈ రేస్ అగ్రిమెంట్లా?
- బ్రిటన్‌కు మనీ ట్రాన్స్ఫర్ చేసేప్పుడు ఆర్బీఐ రూల్స్ ఎందుకు పాటించలే?
- ఎలక్షన్ కోడ్ ఉన్న టైమ్‌లో విదేశీ కంపెనీకి ఎలా చెల్లిస్తారు?
- ఈసీ గైడ్‌లైన్స్ తెలియవా? మీరు చెప్తేనే చేశామని ఆఫీసర్లు అంటున్నరు
- వీటికి మీ సమాధానాలు ఏమిటి?.. డాక్యుమెంట్లు ముందుపెట్టి ప్రశ్నించిన ఈడీ
- రూల్స్ చూస్కోవాల్సిన బాధ్యత ఆఫీసర్లదేనన్న కేటీఆర్?
- కొన్ని ప్రశ్నలకు దాటవేత.. మరికొన్నింటికి నో ఆన్సర్
హైదరాబాద్, వెలుగు: ఫార్ములా– ఈ రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్రశ్నించింది. మనీలాండరింగ్, ఎలక్షన్ బాండ్స్ చుట్టూ ఎంక్వైరీ సాగింది. ఆర్బీఐ రూల్స్‌కు విరుద్ధంగా రూ.45.71 కోట్లను బ్రిటన్‌లోని కంపెనీకి చెల్లించడం, ఫార్ములా –ఈ రేస్ అగ్రిమెంట్‌కు 15 రోజుల ముందు బీఆర్‌ఎస్ పార్టీకి రూ.41 కోట్ల ఎన్నికల ఫండ్‌ను గ్రీన్‌కో అనుబంధ కంపెనీలు కేటాయించడంపై కేటీఆర్‌ను సుదీర్ఘంగా ఈడీ విచారించింది. గురువారం బషీర్‌బాగ్‌లోని ఈడీ ఆఫీసులో విచారణకు కేటీఆర్ హాజరయ్యారు. దాదాపు ఆరున్నర గంటలపాటు ఈడీ అధికారులు ఆయనను ప్రశ్నించారు. 52 ప్రశ్నలు సంధించారు. ఇప్పటికే సేకరించిన పలు డాక్యుమెంట్లు.. అర్వింద్‌కుమార్, బీఎల్‌ఎన్ రెడ్డి ఇచ్చిన స్టేట్‌మెంట్ల ఆధారంగా కేటీఆర్‌ను ఈడీ అధికారులు ప్రశ్నించారు. హెచ్‌ఎండీఏ బోర్డు అకౌంట్ నుంచి ఫార్ములా –ఈ ఆపరేషన్స్‌కు జరిగిన ట్రాన్సాక్షన్లను, బీఆర్‌ఎస్‌కు గ్రీన్‌కో అనుబంధ కంపెనీలు కేటాయించిన ఎన్నికల బాండ్లను కేటీఆర్ ముందు పెట్టి ప్రశ్నించినట్లు తెలిసింది.
ఐదుగురు సభ్యుల టీమ్
జూబ్లీహిల్స్ నందినగర్‌లోని తన ఇంటి నుంచి ఈడీ విచారణ కోసం వెళ్తానని కేటీఆర్ ముందుగా ప్రకటించారు. దీంతో గురువారం నందినగర్‌కు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కానీ, కేటీఆర్ తన రూట్ మార్చారు. నందినగర్ నుంచి కాకుండా గండిపేటలోని తన ఫామ్‌హౌస్ నుంచి ఉదయం 10 గంటలకు బయలుదేరారు. నేరుగా బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయానికి 10.30 గంటలకు చేరుకున్నారు. 10.40 గంటలకు మూడో అంతస్తులోని ఈడీ జాయింట్ డైరెక్టర్ రోహిత్ ఆనంద్ ముందు హాజరయ్యారు. కేటీఆర్‌తో పాటు ఇద్దరు లాయర్లు వచ్చినప్పటికీ ఆ లాయర్లను లోపలికి అనుమతించలేదు. కేటీఆర్ మొబైల్ ఫోన్‌ను సెక్యూరిటీ వద్దనే డిపాజిట్ చేయించారు. ఆ తర్వాత డిప్యూటీ డైరెక్టర్ ఆధ్వర్యంలో కేటీఆర్‌ను మొత్తం ఐదుగురు సభ్యుల ఈడీ టీమ్ ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్(పీఎమ్‌ఎల్‌ఏ) కింద విచారించింది. హెచ్‌ఎండీఏ బోర్డు అకౌంట్ నుంచి బ్రిటన్‌లోని ఫార్ములా –ఈ ఆపరేషన్స్ సంస్థ అకౌంట్‌కు వెళ్లిన రూ.45.71కోట్లకు సంబంధించిన వివరాలతో స్టేట్‌మెంట్ రికార్డ్ చేసింది. మధ్య మధ్య టీ, మధ్యాహ్నం లంచ్ ఏర్పాటు చేసింది. సాయంత్రం 5.30 గంటల వరకు విచారించారు. స్టేట్‌మెంట్ ప్రాసెస్ పూర్తి అయిన తర్వాత సాయంత్రం 6.30 గంటల సమయంలో కేటీఆర్ ఈడీ ఆఫీస్ నుంచి బయటకు వచ్చారు. అక్కడే మీడియాతో మాట్లాడారు. కాగా, అవసరమైతే మళ్లీ విచారణకు రావాలని కేటీఆర్‌కు ఈడీ అధికారులు ఆదేశించినట్లు తెలిసింది.
సమాధానాలు దాటవేసిన కేటీఆర్!
ఫార్ములా–ఈ ఆపరేషన్స్ (ఎఫ్‌ఈవో), ఏస్ నెక్స్ట్ జెన్, ఎంఏయూడీ మధ్య త్రైపాక్షిక ఒప్పందాలు, హిమాయాత్ నగర్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లోని హెచ్‌ఎండీఏ బోర్డు అకౌంట్ ట్రాన్సాక్షన్లకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను కేటీఆర్ ముందు పెట్టి.. వరుసగా ప్రధాన ప్రశ్నలు, అనుంబంధ ప్రశ్నలను ఈడీ అధికారులు సంధించినట్లు తెలిసింది. ప్రస్తుత ఎంఏయూడీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ దానకిశోర్, అప్పటి స్పెషల్ చీఫ్ సెక్రటరీ అర్వింద్‌కుమార్, ఫార్ములా ఈ ఆపరేషన్స్‌కు డబ్బులు బదిలీకి సంబంధించి బీఎల్‌ఎన్‌రెడ్డి ఇచ్చిన స్టేట్‌మెంట్స్ ఆధారంగానూ పలు ప్రశ్నలు వేసినట్లు సమాచారం. ‘‘ఆర్బీఐ నిబంధనలకు వ్యతిరేకమని తెలిసినా బ్రిటన్‌లోని ఎఫ్‌ఈవో కంపెనీకి డబ్బులు చెల్లించాలని ఎందుకు ఆదేశించారు? ఎలక్షన్ కోడ్ అమలులో ఉండగా విదేశీ కంపెనీకి నగదు ఎలా చెల్లిస్తారు? ఈసీ గైడ్‌లైన్స్ మీకు తెలియదనుకోవాలా? మీరు చెప్తేనే నగదు బదిలీ చేశామని అధికారులు చెప్తున్నారు.. దీనికి మీ సమాధానం ఏమిటి?’’ అనే ప్రశ్నలు ఒకటికి రెండుసార్లు అడిగినట్లు తెలిసింది. నాడు మంత్రిగా తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించానని, కానీ ప్రొసీడింగ్స్.. రూల్స్ ప్రకారం ఉన్నాయో లేదో చూసుకోవాల్సిన బాధ్యత అధికారులదని ఈడీకి ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో కేటీఆర్ చెప్పినట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. మొదట రూల్స్ ప్రకారమే చెల్లింపులు చేశామని కేటీఆర్చెప్తూ వచ్చినా ఐటీ శాఖ నుంచి ఎంఏయూడీకి వచ్చిన రూ. 8.01కోట్ల అడిషనల్ ట్యాక్స్ నోటీస్‌లను చూపించడంతో నాటి అధికారులపై నెట్టినట్లు సమాచారం. గతేడాది నిర్వహించ తలపెట్టిన ఫార్ములా–ఈ రేస్ సీజన్ 10 స్పాన్సర్ షిప్ నుంచి ఏస్ నెక్స్ట్ జెన్ తప్పుకోవడానికి గల కారణాలపై ఈడీ ఆరా తీసినట్లు తెలిసింది. ‘‘మొదటి అగ్రిమెంట్ గడువు ముగిసిన తర్వాత ఫార్ములా –ఈ ఆపరేషన్స్ కంపెనీ నుంచి మళ్లీ ప్రపోజల్స్ వచ్చాయా..? లేదంటే ఎంఏయూడీ వారిని సంప్రదించిందా?’’ అనే వివరాలతో ఈడీ స్టేట్‌మెంట్ రికార్డ్ చేసింది. ఎంఏయూడీ అగ్రిమెంట్ చేసుకుంటే హెచ్‌ఎండీఏ బోర్డు నిధులను ఎందుకు చెల్లించారనే కోణంలోనూ కేటీఆర్‌ను ప్రశ్నించినట్లు సమాచారం. సీజన్ 9 టైమ్‌లో ట్రాక్ ఏర్పాటు కోసం ఖర్చు చేసిన రూ.12 కోట్లకు సంబంధించిన వివరాలనూ ఆరా తీసినట్లు తెలిసింది. ప్రధానంగా ‘‘ఎఫ్‌ఈవోకు 2023 అక్టోబర్ 3, 11వ తేదీల్లో హెచ్‌ఎండీఏ బోర్డు నిధుల నుంచి రూ.45.71 కోట్లు మంజూరు చేసేందుకు అనుమతులు ఎవరు ఇచ్చారు..? వీటికి సంబంధించిన నోట్ ఫైల్, జీవోలు ఎక్కడ?’’ అని కూడా కేటీఆర్‌ను ఈడీ ఆఫీసర్లు ప్రశ్నించినట్లు సమాచారం.
ఎలక్టోరల్ బాండ్స్‌పై ఆరా
బ్రిటన్‌కు చెందిన ఫార్ములా –ఈ ఆపరేషన్స్(ఎఫ్‌ఈవో) సంస్థ హైదరాబాద్‌లోనే ఈవెంట్స్నిర్వహించాలనుకోవడానికి కారణమేమిటని ఈడీ ఆరా తీసింది. ‘‘ఫార్ములా ఈ ఆపరేషన్స్ ప్రపోజల్స్ ఎవరు తీసుకొచ్చారు? కంపెనీనే నేరుగా సంప్రదించిందా? లేదంటే ఇతర ప్రైవేట్ కంపెనీలు ఈ– రేస్‌ను రాష్ట్రానికి తీసుకొచ్చే ప్రయత్నాలు చేశాయా?’’ అని కేటీఆర్‌ను ప్రశ్నించినట్లు తెలిసింది. స్పాన్సర్‌గా అగ్రిమెంట్ చేసుకున్న ఏస్ నెక్స్ట్ జెన్ సంస్థ గురించి పదేపదే ఆరా తీసినట్లు సమాచారం. ‘‘ఏస్ నెక్స్ట్ జెన్ మాతృ సంస్థ గ్రీన్‌కో కంపెనీ ఎలక్టోరల్ బాండ్స్ ఎందుకు తీసుకుంది? 2022 ఏప్రిల్, అక్టోబర్ 10న గ్రీన్‌కో అనుబంధ కంపెనీల నుంచి బీఆర్‌ఎస్‌కు రూ.41 కోట్ల బాండ్స్ వచ్చిన 15 రోజుల వ్యవధిలో అంటే 2022 అక్టోబర్ 25న ఏస్ నెక్స్ట్ జెన్, ఫార్ములా ఈ ఆపరేషన్స్, ఎంఏయూడీ మధ్య ఫార్ములా రేస్ అగ్రిమెంట్స్ జరగడానికి కారణాలేంటి?’’ అని ఈడీ బృందం అడిగినట్లు తెలిసింది.
ఈ ప్రశ్నలకు కేటీఆర్ సమాధానం దాటవేసినట్లు సమాచారం. నాలుగు సీజన్స్ కోసం దాదాపు రూ.600 కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఎఫ్‌ఈవో, ఏస్ నెక్స్ట్ జెన్‌తో జరిగిన త్రైపాక్షిక ఒప్పందంలో ఎంఏయూడీ పేర్కొన్న విషయంపైనా ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఇందుకు సంబంధించిన అగ్రిమెంట్స్‌ను కేటీఆర్ ముందుంచి ఆరా తీశారు. అసలు కార్ రేసింగ్ ఈవెంట్స్ నిర్వహించడం వల్ల ప్రభుత్వానికి గానీ ఎంఏయూడీకి గానీ ఎలాంటి లాభాలు వచ్చాయి? అని ప్రశ్నించగా.. ఏసీబీకి చెప్పినట్లే రూ.700 కోట్ల లాభాలు వచ్చాయని కేటీఆర్ చెప్పినా, అవి ఎక్కడ ఉన్నాయంటే సమాధానం చెప్పలేకపోయినట్లు తెలిసింది.