
- గొర్రెల పంపిణీ విధివిధానాలు, నిధుల మంజూరుపై ఆరా
హైదరాబాద్, వెలుగు: గొర్రెల పంపిణీ స్కీమ్ స్కామ్ కేసులో పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్‌రావు బుధవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ముందు విచారణకు హాజరయ్యారు. బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయానికి ఉదయం11 గంటలకు ఆయన చేరుకున్నారు.ఈడీ సూచనల మేరకు పలు రికార్డులు అందించారు. ఈ సందర్భంగా గొర్రెల పంపిణీ పథకానికి సంబంధించిన విధివిధానాలు, లబ్ధిదారుల ఎంపిక, కాంట్రాక్టర్ల వివరాలను ఈడీ అధికారులు సేకరించారు. మొదటి విడతలో పంపిణీ చేసిన యూనిట్ల గురించి ఆరా తీశారు. గత ప్రభుత్వ హయాంలో గొర్రెల పంపిణీ స్కీమ్ ద్వారా రూ.700 కోట్ల ప్రభుత్వ నిధులు పక్కదారి పట్టినట్టు ఇప్పటికే ఏసీబీ ప్రాథమిక ఆధారాలు సేకరించిన సంగతి తెలిసిందే.
ఏసీబీ నమోదు చేసిన కేసు ఆధారంగా మనీ లాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఈ మేరకు పశుసంవర్ధక శాఖ నుంచి వివరాలు రాబడుతోంది. గొర్రెల పంపిణీ స్కీమ్‌లో జరిగిన మనీలాండరింగ్‌పైనే ఈడీ దృష్టి పెట్టినట్టు తెలిసింది. ఈ స్కీమ్ కోసం గత ప్రభుత్వం ఎంత కేటాయించింది? ఎన్ని నిధులు మంజూరు చేసింది? వాటిని ఎలా ఖర్చు చేశారు? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నది. ఈ క్రమంలోనే జిల్లాల వారీగా లబ్ధిదారుల వివరాలు, సెల్ నంబర్లు, బ్యాంకు అకౌంట్ నంబర్లను ఈడీ అధికారులు ఇప్పటికే సేకరించారు.
వీటి ఆధారంగా గొర్రెలు, మేకల సహకార అభివృద్ధి సంస్థకు సంబంధించిన ఏ బ్యాంకు అకౌంట్ నుంచి నిధులు ట్రాన్స్‌ఫర్ అయ్యాయనే వివరాలను శ్రీనివాస్‌రావు ద్వారా సేకరించినట్టే తెలిసింది. దీంతో పాటు గొర్రెల ట్రాన్స్‌పోర్టుకు సంబంధించిన ఏజెన్సీలు, వాహనాలు, గొర్రెల యూనిట్ల రికార్డులను పరిశీలించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే గొర్రెలు విక్రయించిన వారి అకౌంట్లలో జమచేయాల్సిన రూ.2.10 కోట్లు గోల్‌మాల్ సహా బినామీ అకౌంట్లకు సంబంధించిన వివరాలను ఈడీ అధికారులు సేకరిస్తున్నారు.
త్వరలోనే మాజీ అధికారుల విచారణ
అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్‌రావు ఇచ్చిన సమాచారంతో ఈడీ స్టేట్‌మెంట్ రికార్డ్ చేస్తోంది. ఇప్పటికే ఏసీబీ రికార్డు చేసిన స్టేట్‌మెంట్ల ఆధారంగా సంబంధిత వ్యక్తుల గురించి శ్రీనివాస్‌రావును ఆరా తీసినట్టు తెలిసింది. విచారణలో భాగంగా ఇప్పటికే పలువురు పశుసంవర్ధక శాఖ అధికారులను ఈడీ విచారించింది. ఈ కేసులో నిందితులైన రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్య మాజీ ఎండీ రాంచందర్‌నాయక్, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాజీ ఓఎస్డీ కల్యాణ్ కుమార్ సహా మాజీ అసిస్టెంట్ డైరెక్టర్లు రవికుమార్, కేశవసాయి, బినామీ అకౌంట్ హోల్డర్లకు నోటీసులు ఇచ్చి విచారించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
కాగా, బుధవారం వికారాబాద్ జిల్లాలో ఈడీ అధికారులు పర్యటించారు. ఈడీ ఇన్ స్పెక్టర్ రఘురాం, మరో అధికారి కలిసి జిల్లా పశువైద్య, సంవర్ధక శాఖ అధికారి సదానందంతో సమావేశమయ్యారు. కీలకమైన డ్యాకుమెంట్లను వెంట తీసుకువెళ్లారు. అనంతరం క్షేత్ర స్థాయి పరిశీలనలో భాగంగా నవాబుపేట, ధారూర్మండలాల్లో గొర్రెల పంపిణీ పథకం లబ్ధిదారుల వద్దకు వెళ్లి స్కీమ్‌కు సంబంధించిన వివరాలు సేకరించారు.