మెడికల్ సీట్ల బ్లాకింగ్ స్కామ్.. రూ. 9.71 కోట్ల ఆస్తులు జప్తు

  • మల్లారెడ్డి, ఎంఎన్ఆర్, ఆనందరావు కాలేజీలపై ఈడీ చర్యలు

హైదరాబాద్‌‌, వెలుగు: మెడికల్ సీట్ల బ్లాకింగ్‌‌ స్కాం కేసులో ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్‌‌ డైరెక్టరేట్‌‌(ఈడీ) దర్యాప్తు ముమ్మరం చేసింది. పీజీ మెడికల్‌‌ సీట్ల అడ్మిషన్లలో అక్రమాలకు పాల్పడిన ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు చెందిన రూ.5.34 కోట్లను విలువ చేసే ఆస్తులను జప్తు చేసింది. దీంతో ఈ కేసులో శుక్రవారం వరకు మొత్తం రూ.9.71 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్‌‌మెంట్‌‌ చేసినట్లు ఈడీ ప్రకటించింది. ఈ మేరకు ఈడీ హైదరాబాద్‌‌ జోనల్‌‌ జాయింట్ డైరెక్టర్‌‌‌‌ రోహిత్‌‌ ఆనంద్‌‌ శుక్రవారం వివరాలు వెల్లడించారు.

పీజీ మెడికల్ సీట్ల బ్లాకింగ్‌‌ను కాలోజీ నారాయణ రావు యూనివర్సిటీ ఆఫ్‌‌ హెల్త్‌‌ సైన్సెస్ గతంలోనే గుర్తించింది. రిజిస్ట్రార్‌‌ ఫిర్యాదు ఆధారంగా వరంగల్‌‌ జిల్లా మట్వాడ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎఫ్‌‌ఐఆర్ ఆధారంగా ఈడీ మనీ లాండరింగ్ కేసు రిజిస్టర్‌‌‌‌ చేసింది. గతేడాది జూన్‌‌ 22న 10 కాలేజీల్లో సోదాలు నిర్వహించింది.

మాజీ మంత్రి మల్లారెడ్డి మెడికల్ కాలేజీలో రూ.1.47 కోట్ల క్యాష్ ను సీజ్‌‌ చేసింది. బ్యాంక్ అకౌంట్లలోని రూ.2.89 కోట్లను ఫ్రీజ్ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీల్లోనూ సోదాలు చేసింది. చల్మెడ ఆనందరావు ఇన్‌‌స్టిట్యూట్‌‌ ఆఫ్‌‌ మెడికల్ సైన్సెస్‌‌కు చెందిన రూ.3.33 కోట్లు, ఎంఎన్‌‌ఆర్‌‌‌‌ మెడికల్ కాలేజీకి చెందిన రూ.2.01 కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్‌‌లను ఫ్రీజ్ చేసింది.