ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరోసారి దేశవ్యాప్తంగా దాడులు నిర్వహిస్తోంది. హైదరాబాద్ కేంద్రంగా లిక్కర్ స్కామ్ జరిగినట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో.. హైదరాబాద్ తో పాటు ఢిల్లీ, పంజాబ్‌లోని 35 ప్రాంతాల్లో ఈడీ దాడులు చేస్తోంది. ఈ రాష్ట్రాల్లోని మద్యం కంపెనీలు, డిస్ట్రిబ్యూటర్లు, సప్లై చైన్ నెట్‌వర్క్‌కు సంబంధించి పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తోంది. ఇటు హైదరాబాద్‌లో ఈడీ నాలుగు చోట్ల తనిఖీలు చేస్తోంది. నాలుగు బృందాలుగా ఏర్పడిన అధికారులు జూబ్లీహిల్స్, కూకట్‌పల్లితో పాటు మరో రెండుచోట్ల సోదాలు చేస్తున్నట్లు సమాచారం.
డర్టీ పాలిటిక్స్...
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ సోదాలు నిర్వహించడాన్ని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఖండించారు. డర్టీ పాలిటిక్స్ అంటూ కేంద్రంపై మండిపడ్డారు. 3 నెలల నుంచి దాదాపు 500 ప్రదేశాల్లో ఈడీ అధికారులు పనిచేస్తున్నారని కేజ్రీవాల్ తెలిపారు. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు వ్యతిరేకంగా సాక్ష్యాలను కనుగొనేందుకు 300 మంది ఈడీ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. కానీ ఇప్పటి వరకు ఒక్క సాక్ష్యం కూడా కనిపెట్టలేదన్నారు. నీచ రాజకీయాల కోసం కేంద్రం అధికారుల సమయాన్ని వృథా చేస్తోందన్నారు. ఇలా చేస్తే దేశం ఏవిధంగా పురోగమిస్తుందని కేజ్రీవాల్ ప్రశ్నించారు.
మనీలాండరింగ్ కేసు నేపథ్యంలో ఈడీ దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసులో సీబీఐ పలువురిపై FIR కూడా దాఖలు చేసింది. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో పాటు.. ఢిల్లీకి చెందిన పలువురు అధికారులను నిందితులుగా చేర్చింది. ఈ కేసులో మద్యం వ్యాపారి సమీర్ మహేంద్రను గత వారమే అరెస్ట్ చేసింది.
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఢిల్లీ మద్యం పాలసీపై సీబీఐ దర్యాప్తుకు ఆదేశించడంతో ఈ ఏడాది జూలైలోనే కేజ్రీవాల్ ప్రభుత్వం ఈ మద్యం పాలసీని రద్దు చేసింది. ఈ కేసులో సంబంధం ఉన్న 11 మంది ఎక్సైజ్ అధికారులను కూడా లెఫ్టినెంట్ గవర్నర్ సస్పెండ్ చేశారు.