
- టీజీ సీఎస్‌బీ ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ దర్యాప్తు
హైదరాబాద్, వెలుగు: నైజీరియన్ల డ్రగ్స్ కేసులో మనీలాండరింగ్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఫోకస్ పెట్టింది. ఇంటర్నేషనల్ డ్రగ్స్ సప్లయర్ నైజీరియన్ ఎబుకాసుజీ ఆర్థికలావాదేవీల వివరాలను సేకరిస్తున్నది. ఈ మేరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్(ఈసీఐఆర్) రిజిస్టర్ చేసేందుకు ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్, అమెరికాలో కొకైన్, ఎండీఎంఏ సప్లయ్ చేస్తున్న నైజీరియా గ్యాంగ్‌ను శనివారం తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో(టీజీ ఎన్‌ఏబీ) అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
విదేశాల్లో డ్రగ్స్ అమ్మకం ద్వారా వచ్చిన సొమ్మును అమెరికా నుంచి ఇండియాకు, ఇక్కడి నుంచి నైజీరియాకు తరలిస్తున్నట్లు సైబర్ సెక్యూరిటీ బ్యూరో(సీఎస్‌బీ) గుర్తించింది. గత ఐదేండ్లలో దాదాపు రూ.127 కోట్లు మనీ లాండరింగ్‌కు పాల్పడినట్టు ప్రాథమిక ఆధారాలు సేకరించింది. సీఎస్‌బీ నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. ఈ మేరకు సీఎస్‌బీ ఎఫ్‌ఐఆర్ సహా కేసుకు సంబంధించిన పూర్తి డాక్యుమెంట్లను సేకరించింది. వీటి ఆధారంగా ఈ కేసులో నిందితులైన ఫారెక్స్ ఏజెంట్లు, హవాలా వ్యాపారులను విచారించనుంది.