న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇటీవల ఫైల్ చేసిన చార్జ్ షీట్ లో ఒకచోట ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ పేరును ఈడీ పొరపాటున పేర్కొంది. అది గుర్తించిన ఈడీ.. దాన్ని కరెక్టు చేసేందుకు పోయిన నెల 20న కోర్టులో పిటిషన్ ఫైల్ చేసింది. ఢిల్లీ ఎక్సైజ్ కమిషనర్ రాహుల్ సింగ్ పేరుకు బదులు సంజయ్ సింగ్ పేరు వచ్చిందని అందులో పేర్కొంది. ఇది టైపోగ్రాఫికల్ మిస్టేక్ అని, దాన్ని సరిదిద్దేందుకు పర్మిషన్ ఇవ్వాలని కోరింది. అయితే ఈ విషయం తెలిసిన సంజయ్ సింగ్.. పోయిన నెల 22న ఈడీ అధికారులకు లీగల్ నోటీసులు పంపారు. దీనికి ఈడీ లాయర్ అదే నెల 29న రిప్లై ఇచ్చారు. ‘‘చార్జ్ షీట్లో మొత్తం నాలుగు చోట్ల రాహుల్ సింగ్ పేరు ఉంది. అయితే ఇందులో ఒకచోట రాహుల్ సింగ్‌కు బదులు సంజయ్ సింగ్ పేరు వచ్చింది. మీరు నోటీస్ పంపే కంటే ముందే.. దాన్ని కరెక్టు చేసేందుకు కోర్టులో పిటిషన్ వేశాం. ఇది మా సంస్థ చిత్తశుద్ధికి నిదర్శనం” అని సంజయ్ సింగ్ లాయర్‌కు రాసిన లెటర్లో పేర్కొన్నారు.
ఇదంతా మోడీ కుట్ర: సంజయ్ సింగ్
ఈడీ కావాలనే తన పేరును చార్జ్ షీట్లో పేర్కొందని సంజయ్ సింగ్ మండిపడ్డారు. ఈడీ డైరెక్టర్ సంజయ్ కుమార్ మిశ్రా, అసిస్టెంట్ డైరెక్టర్ జోగిందర్ సింగ్ లను విచారించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ కేంద్ర ఆర్థికశాఖ సెక్రటరీకి ఆయన లెటర్ రాశారు. ఈ ఇద్దరు అధికారులు తన ప్రతిష్టను దెబ్బతీశారని అందులో పేర్కొన్నారు. సంజయ్ సింగ్ బుధవారం మాట్లాడుతూ.. ‘‘చార్జ్ షీట్లో నా పేరు పొరపాటున వచ్చిందని ఈడీ ఒప్పుకుంది. ప్రధాని మోడీ చెప్పినట్టు ఆడుతున్న ఈడీ.. సీఎం కేజ్రీవాల్, ఇతర నేతల ప్రతిష్టను దెబ్బతీయాలని చూస్తోంది. ఈ కేసులో ఈడీ ఫేక్ ఇన్వెస్టిగేషన్ చేస్తోంది. ఇది మోడీ కుట్ర” అని ఆరోపించారు.