హైదరాబాద్, వెలుగు: పీజీ మెడికల్ సీట్ల బ్లాకింగ్ స్కామ్ కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. మాజీ మంత్రి మల్లారెడ్డికి చెందిన మల్లారెడ్డి మెడికల్ కాలేజీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సురేందర్‌రెడ్డిని గురువారం విచారించింది. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సుదీర్ఘంగా ప్రశ్నించింది. కాలేజీ ఆర్థిక లావాదేవీల వివరాలు.. ఎమ్‌బీబీఎస్, పీజీ మెడికల్ సీట్లను మేనేజ్‌మెంట్, కన్వీనర్, ఎన్‌ఆర్‌ఐ కోటా కింద భర్తీ చేసిన రికార్డులను ముందుపెట్టి ప్రశ్నించినట్లు తెలిసింది.
సురేందర్‌రెడ్డి ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా కాలేజీ ఎండీ, చైర్మన్ మల్లారెడ్డికి నోటీసులు ఇచ్చి విచారించనున్నట్టు సమాచారం. సీట్లు బ్లాక్ చేయడంపై గతేడాది జూన్ 22న మల్లారెడ్డి మెడికల్ కాలేజీ సహా రాష్ట్ర వ్యాప్తంగా10 మెడికల్ కాలేజీల్లో ఈడీ సోదాలు చేసిన సంగతి తెలిసిందే. ఈ సోదాల్లో మల్లారెడ్డి మెడికల్ కాలేజీలో రూ.1.4 కోట్ల నగదును స్వాధీనం చేసుకుంది. బ్యాంక్ అకౌంట్స్‌లోని రూ.2.89 లక్షలు ఫ్రీజ్ చేసింది. కాలేజీలకు చెందిన హార్డ్‌డిస్క్‌లు, డిజిటల్ డివైజెస్ సీజ్ చేసింది.
ఇతర రాష్ట్రాల స్టూడెంట్లతో సీట్లు బ్లాక్
రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల్లో పీజీ మెడికల్ సీట్లు బ్లాక్ చేస్తున్నారని కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ 2022లో గుర్తించింది. కౌన్సెలింగ్‌కు కూడా అప్లై చేయని ఇతర రాష్ట్రాలకు చెందిన ఐదుగురు విద్యార్థులు వారి రాష్ట్రాల్లో కన్వినర్ కోటాలో అవకాశం ఉన్నప్పటికీ తెలంగాణలోని ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో సీట్లు బ్లాక్ చేసినట్టు ఆధారాలు సేకరించింది. ఎన్‌ఆర్‌ఐ, మేనేజ్‌మెంట్ కోటాలను సెలెక్ట్ చేసుకున్నట్లు గుర్తించి సంబంధిత విద్యార్థుల వివరాలను సేకరించింది. ఇందులో ఐదుగురు కాళోజీ వర్సిటీలో కౌన్సెలింగ్‌కు కూడా అప్లై చేయలేదని నిర్ధారించింది. సీట్ల బ్లాకింగ్ స్కామ్‌పై హెల్త్ వర్సిటీ రిజిస్ట్రార్ 2022 ఏప్రిల్‌లో వరంగల్ జిల్లా మట్వాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మట్వాడ పీఎస్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా గతేడాది ఫిబ్రవరిలో ఎన్‌ఫోర్స్‌డైరెక్టరేట్ కేసు నమోదు చేసింది.
ఒక్కో సీటు రూ.1కోటి నుంచి రూ.2.5 కోట్లకు..
ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి ఈడీ దర్యాప్తు చేసింది. గతేడాది జూన్ 22న మల్లారెడ్డి మెడికల్ కాలేజీ, కామినేని మెడికల్ కాలేజీ సహా రాష్ట్ర వ్యాప్తంగా10 మెడికల్ కాలేజీలు వాటి డైరెక్టర్లు, కార్పొరేట్ ఆఫీసుల్లో సోదాలు నిర్వహించింది. హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం, కరీంనగర్, సంగారెడ్డి, మేడ్చల్, మహబూబ్‌నగర్, వికారాబాద్ జిల్లాల్లోని మొత్తం16 ప్రాంతాల్లో ఇతర రాష్ట్రాల నుంచి అత్యధిక మార్కులు సాధించిన పీజీ నీట్ అభ్యర్థుల సర్టిఫికెట్స్ ఉపయోగించి సీట్లు బ్లాక్ చేశారని గుర్తించింది. కౌన్సెలింగ్ మాప్ రౌండ్, అడ్మిషన్ లాస్ట్ డేట్ ముగిసిన తర్వాత కూడా సీట్లు ఖాళీగా ఉన్నాయని ఈడీ దర్యాప్తులో వెల్లడైంది. వీటిని మేనేజ్‌మెంట్, కన్వీనర్ కోటా కింది ఒక్కో సీట్‌ను రూ.కోటి నుంచి రూ.-2.5 కోట్లకు విక్రయిస్తున్నట్లు ఈడీ విచారణలో వెల్లడైంది.