తమిళనాడులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారి ఒకరు అరెస్ట్ కావడం సంచలనం రేపుతోంది. దిండిగల్ ప్రాంతంలో ఓ డాక్టర్ నుంచి 20 లక్షలు తీసుకుంటున్న ఈడీ అధికారి అంకిత్ తివారీని తమిళనాడు పోలీసులు రెడ్హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అధికారిని పోలీసులు విచారిస్తున్నారు. ఈడీ అధికారికి సంబంధించిన ఐడీ కార్డు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
దక్షిణాది రాష్ట్రమైన తమిళనాడులో ఏజెన్సీ యాక్టివ్ గా ఉన్న తరుణంలో ఒక ఈడీ అధికారి అరెస్ట్ వార్త ఇప్పుడు సంచలనం చేపుతోంది. తమిళనాడు ప్రభుత్వంలోని మంత్రులపై కూడా ఈడీ కేసులు దర్యాప్తులో ఉండగా.. అధికారి అరెస్ట్ అయ్యారు. మనీలాండరింగ్ ఆరోపణలతో 2023 జూన్ లో మంత్రి సెంథిల్ బాలాజీని ఈడి అరెస్ట్ చేసింది. తమిళనాడు మంత్రుల అరెస్ట్ తో అధికారి పార్టీ డీఎంకే ఇరుకులో పడింది. అరెస్ట్ అయిన కొన్ని గంటలకే మంత్రికి గుండె ఆపరేషన్ కూడా జరిగింది. సెంథిల్ బాలాజీపై ఈడీ కేసు రాజకీయ ప్రేరేపితమని డీఎంకే నేతలు ఆరోపించారు.
అయితే జూన్ 30న తమిళనాడు గవర్నర్ రవి మంత్రి సెంథిల్ బాలాజీని బర్తరఫ్ చేసిన తర్వాత వివాదం చెలరేగింది. ఈ విషయంపై వివాదం తర్వాత గవర్నర్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. మంత్రిని తొలగిస్తూ గవర్నర్ తీసుకున్న నిర్ణయంపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తీవ్రంగా స్పందించారు. నవంబర్ 28న అనారోగ్య కారణాలతో బెయిల్ పిటిషన్ వేయగా కోర్టు తిరస్కరించింది.
తమిళనాడులో దర్యాప్తు సంస్థల విచారణ ముమ్మరంగా కొనసాగుతున్న క్రమంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారి అరెస్ట్ కావడం చర్చనీయాంశమైంది. తమిళనాడులో నాటకీయ పరిణామాలపై జోరుగా ఊహాగానాలు కొనసాగుతున్నాయి.ఈడీ అధికారి ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలో తమిళనాడులో, అటు దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఈడీ దర్యాప్తులపై ఎలా ఉండబోతున్నాయి అనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.