హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా మాజీ కలెక్టర్ ఐఏఎస్ అమోయ్ కుమార్‌కు ఈడీ ఉచ్చు బిగుస్తున్నది. రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లోని ప్రభుత్వ, భూదాన్ భూముల అన్యాక్రాంతం, మనీ లాండరింగ్‌పై అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. రూ.వందల కోట్ల అక్రమ లావాదేవీలు జరిగినట్లు ప్రాథమిక ఆధారాలు సేకరించారు. ఇందులో భాగంగా శుక్రవారం అమోయ్ కుమార్‌ను రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి తీసుకెళ్లారు. ఆయన తెలిపిన వివరాల ఆధారంగా డాక్యుమెంట్లు సేకరించినట్లు సమాచారం.
మహేశ్వరం మండలం నాగారంలోని 42 ఎకరాల 33 గుంటల భూదాన్ భూములతో పాటు రెండు జిల్లాల్లో జరిగిన అక్రమాలపై ఈడీ దృష్టి సారించిన సంగతి తెలిసిందే. అమోయ్‌ను బుధవారం నుంచి అధికారులు విచారించారు. శుక్రవారం మూడో రోజు విచారణలో భాగంగా ప్రశ్నించారు. గత రెండు రోజుల వ్యవధిలో అమోయ్ అందించిన ల్యాండ్ రికార్డులు, ధరణి పోర్టల్, ఇప్పటికే సీజ్ చేసిన డాక్యుమెంట్ల ఆధారంగా ఈడీ స్పెషల్ టీమ్ ఆయనను విచారించింది. దాదాపు 9 గంటల పాటు ప్రశ్నల వర్షం కురిపించింది.
అయితే తన కన్నా ముందు పనిచేసిన కలెక్టర్లు కూడా భూకేటాయింపులు జరిపారని అమోయ్ కుమార్ తెలిపినట్లు సమాచారం. వాటికి సంబంధించి పలువురు కలెక్టర్లు, కొంత మంది ఐఏఎస్ అధికారుల పేర్లు వెల్లడించినట్లు తెలిసింది. మూడు రోజుల వ్యవధిలో మొత్తం 21 గంటల పాటు ఈడీ అధికారులు ఆయనను విచారించారు. తదుపరి విచారణకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. మహేశ్వరం మాజీ తహసీల్దార్ జ్యోతి,ఈఐపీఎల్ కన్‌స్ట్రక్షన్‌కు చెందిన ప్రతినిధులతో పాటు15 మంది ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా ఈడీ దర్యాప్తు చేస్తున్నది. అమోయ్ కుమార్ స్టేట్‌మెంట్ ఆధారంగా సోమవారం నుంచి మరికొంత మందికి సమన్లు జారీచేసే అవకాశాలు ఉన్నాయి.
మాజీ తహసీల్దార్ జ్యోతి స్టేట్‌మెంట్ ఆధారంగానే!
మాజీ తహసీల్దార్ జ్యోతి ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను ఈడీ ప్రామాణికంగా తీసుకున్నట్లు తెలిసింది. అమోయ్ కుమార్ కలెక్టర్‌గా ఉన్న సమయంలో భూ బదలాయింపులు జరిగినట్లు జ్యోతి వెల్లడించినట్లు సమాచారం. జ్యోతితో పాటు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీస్, మహేశ్వరం మండల కార్యాలయ సిబ్బంది, పలువురు రియల్టర్లు, నాగారం గ్రామానికి చెందిన కొంతమంది నుంచి ఆధికారులు సమాచారం సేకరించినట్లు తెలిసింది.
మరో రూ.1,000 కోట్ల కుంభకోణంపై ఫిర్యాదు
అమోయ్ కుమార్‌పై ఈడీకి మరో భూ కుంభకోణం ఫిర్యాదు అందింది. దాదాపు రూ.1,000 కోట్లు విలువ చేసే భూములను కబ్జాదారులకు ఆయన కట్టబెట్టారని రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం తట్టిఅన్నారం మధురానగర్ కాలనీ ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ శుక్రవారం ఫిర్యాదు చేసింది. అసోసియేషన్ అధ్యక్షుడు, ఎల్బీనగర్ కాంగ్రెస్ నాయకుడు రామ్మోహన్ గౌడ్, బీఆర్ఎస్ మల్కాజిగిరి నేత రాగిడి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో బాధితులు ఈడీ ఆఫీసుకెళ్లారు. ఈడీకి ఫిర్యాదు చేసిన అనంతరం వారు మీడియాతో మాట్లాడారు.
తట్టిఅన్నారం గ్రామంలోని సర్వే నంబర్లు 108, 109, 110, 111లోని 70 ఎకరాల 39 గుంటల భూమిని పట్టాదారు మద్ది సత్యనారాయణ రెడ్డి 1982లో దాదాపు 840 ప్లాట్లతో వెంచర్ చేసి ప్లాట్లను విక్రయించాడని వివరించారు. భూముల ధరలు పెరగడంతో కొంతమంది కబ్జాదారులు గతంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా పనిచేసిన అమోయ్ కుమార్‌తో కలిసి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు.