- సౌత్ గ్రూప్, రూ.100 కోట్ల ముడుపులపై ఆరా
- అరుణ్ పిళ్లైతో కలిపి విచారించిన అధికారులు?
- చాలా ప్రశ్నలకు దాటవేత సమాధానాలు
- విచారణ తర్వాత హైదరాబాద్‌కు కవిత.. ప్రగతిభవన్‌లో కేసీఆర్‌తో సమావేశం
న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాదాపు ఎనిమిది గంటలకు పైగా సుదీర్ఘంగా విచారించింది. శనివారం ఉదయం 11:30 నుంచి రాత్రి 7.30 దాకా ప్రశ్నించింది. సౌత్ గ్రూప్‌లో పాత్ర గురించి, రూ.100 కోట్ల ముడుపుల గురించి ఆరా తీసింది. అయితే చాలా ప్రశ్నలకు కవిత పొంతన లేని సమాధానాలు చెప్పారని, దాట వేసే ధోరణి అవలంబించారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. తాను చెప్పాలనుకున్న అంశాలకే కట్టుబడి సమాధానాలు ఇచ్చినట్లు సమాచారం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి తనకేం తెలియదని చెప్పినట్లుగా తెలిసింది. ఈ నేపథ్యంలో ఈ నెల 16న మరోసారి విచారణకు హాజరుకావాలని కవితను ఈడీ ఆదేశించింది.
ప్రశ్నించిన ఐదుగురు సభ్యుల బృందం
ఐదుగురు సభ్యులతో కూడిన ఇన్వెస్టిగేషన్ టీమ్ కవితను విచారించింది. ఇందులో ఒక జాయింట్ డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్ స్థాయి మహిళా అధికారి, లిక్కర్ స్కామ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ (ఐఓ) జోగిందర్, మరో ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్లు ఉన్నారు. అన్ని ఫార్మాలిటీలను పూర్తి చేసి 11:30 కు విచారణ ప్రారంభించినట్లు తెలిసింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ) సెక్షన్ – 50 కింద కవిత స్టేట్‌మెంట్‌ను రాతపూర్వకంగా రికార్డు చేశారు. తొలుత ఆమె వ్యక్తిగత వివరాలను గురించి అడిగిన అధికారులు.. తర్వాత విచారణ ప్రారంభించారు. లిక్కర్ స్కామ్‌లో ఇప్పటి వరకు సేకరించిన ఆధారాలపై వాకాబు చేసినట్లు తెలిసింది. ముఖ్యంగా ఆమె మాజీ ఆడిటర్, అనుచరుడు అరుణ్ పిళ్లై ఇచ్చిన స్టేట్‌మెంట్లపైనే ఎక్కువ ఫోకస్ పెట్టినట్లు సమాచారం.
పోలీస్ కాన్వాయ్ మధ్య ఈడీ ఆఫీసుకు
శనివారం ఉదయం తన సోదరుడు, మంత్రి కేటీఆర్, లీగల్ టీమ్‌తో కవిత కాసేపు చర్చించారు. తర్వాత 9 గంటలకు భారత జాగృతి కార్యకర్తలు, బీఆర్ఎస్ శ్రేణులకు తుగ్లక్ రోడ్డులోని సీఎం క్యాంప్ ఆఫీసులో బ్రేక్ ఫాస్ట్ ఏర్పాటు చేశారు. తర్వాత కార్యకర్తలతో కాసేపు ముచ్చటించారు. తర్వాత భర్త అనిల్, అడ్వకేట్ తో కలిసి పోలీస్ కాన్వాయ్ మధ్య అబ్దుల్ కలాం రోడ్డులోని ఈడీ హెడ్ ఆఫీసుకు కవిత బయల్దేరారు. ఆమె కాన్వాయ్ ఇంటి మెయిన్ గేట్ వద్దకు చేరుకోగానే.. కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ వెహికల్ వద్దకు వచ్చారు. అప్పటికే రోడ్డుపైకి భారీగా మోహరించిన పోలీసులు.. వీరిని పక్కకు నెట్టేయడంతో కాసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తర్వాత ఈడీ ఆఫీసుకు కవిత బయలుదేరారు. ఆమె వెంటే పలు వాహనాల్లో కార్యకర్తలు వెళ్లేందుకు యత్నించగా.. బారికేడ్లతో వాళ్లను నిలువరించారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాత్రం కవితకు మద్దతుగా ఈడీ కార్యాలయానికి వచ్చారు. ఈడీ కార్యాలయం వెళ్లే రూట్లలో మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. రెండు దారులు ఉండగా ఒక్క రూట్ ని మాత్రమే ఓపెన్‌లో ఉంచారు. కవిత ఒక్కరినే అధికారులు ఆఫీసులోకి అనుమతించారు. తన పిడికిలి బిగించి, కార్యకర్తలకు అభివాదం చేస్తూ ఆమె లోనికి వెళ్లారు. ఈడీ ఇచ్చిన నోటీసులను వెంట తీసుకెళ్లారు.
సౌత్ గ్రూప్‌లో మీ పాత్ర ఏంటి?
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఇప్పటి వరకు 36 మందిని ఈడీ విచారించింది. ఈ స్టేట్‌మెంట్ల ఆధారంగా పాలసీ రూపకల్పనలో సౌత్ గ్రూప్ కీలక పాత్ర పోషించినట్లు ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో అరుణ్ పిళ్లై, బుచ్చిబాబు, అభిషేక్, శరత్ చంద్రారెడ్డి, మాగుంట రాఘవ, సమీర్ మహేంద్రు, అమిత్ అరోరా ఇచ్చిన సమాచారంతో కవితను ఈడీ ప్రశ్నించింది. విచారణ సందర్భంగా ఆ ఎవిడెన్స్ లు, వాట్సాప్ చాట్ లు, డిజిటల్ ఆధారాలను కవిత ముందుంచినట్లు విశ్వసనీయ సమాచారం. వాటి ఆధారంగా సౌత్ గ్రూప్‌లో కవిత పాత్రపై ఈడీ ప్రశ్నలు వర్షం కురిపించినట్లు తెలిసింది. లిక్కర్ పాలసీ రూపొందిస్తున్న విషయం మీకు ఎలా తెలుసు? అందులో చేరాలని ఎవరు కోరారు? ఇందుకోసం మిమ్మల్ని ఎవరు సంప్రదించారు? అని ఆరా తీసింది. నిందితులతో ఉన్న సంబంధాలు, ఇండో స్పిరిట్స్ కంపెనీలో వాటాలు, రూ.100 కోట్ల ముడుపుల వ్యవహారం.. వంటి వాటిపైనా ప్రశ్నించింది. ఢిల్లీ, హైదరాబాద్ వేదికగా జరిగిన లిక్కర్ సమావేశాలను ప్రస్తావించింది. రూ.100 కోట్ల ముడుపులను హవాలా మార్గంలో తరలించిన తీరుపై ప్రశ్నించింది. ఒకటీ రెండు రోజుల వ్యవధిలోనే మొత్తం 10 విలువైన ఫోన్లను ధ్వంసం చేయడానికి గల కారణాలను అడిగినట్లు సమాచారం. అదే టైంలో మిగతా నిందితులూ ఫోన్లు ధ్వంసం చేయడం వెనక ఉన్న ఉద్దేశాన్ని ప్రశ్నించినట్లు తెలిసింది.
రెండు సార్లు బ్రేక్!
ఉదయం 11:05 గంటలకు ఈడీ ఆఫీసులోకి కవిత వెళ్లారు. రాత్రి 8 గంటలకు బయటకు వచ్చారు. మధ్యాహ్నం ఒక గంట పాటు అధికారులు లంచ్ బ్రేక్ ఇచ్చారు. అయితే ఆమె ఆహారం తీసుకునేందుకు నిరాకరించినట్లు తెలిసింది. మళ్లీ సాయంత్రం మరో గంట విచారణను నిలిపివేసినట్లు సమాచారం.
నాకేం తెలీదు
ఉదయం రెండు గంటల పాటు కవితను ఒంటరిగా ఈడీ ప్రశ్నించింది. తమ కస్టడీలో ఉన్న ఆమె అనుచరుడు, లిక్కర్ వ్యాపారి అరుణ్ పిళ్లైని కలిపి మధ్యాహ్నం తర్వాత విచారించినట్లు సమాచారం. సింగిల్‌గా కవిత ఇచ్చిన స్టేట్‌మెంట్‌లోని ప్రశ్నలను, పిళ్లై సమక్షంలో క్రాస్ ఎగ్జామిన్ చేసినట్లు తెలిసింది. తాను కవిత బినామీనంటూ పిళ్లై ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను ప్రస్తావించినట్లు సమాచారం. ‘‘ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి నాకేం తెలీదు. నేను కుట్రదారురాలిని కాదు. నేనే ఆధారాలు ధ్వంసం చెయ్యలేదు’’ అని బదులిచ్చినట్లు సమాచారం.
ఢిల్లీలోనే మంత్రుల మకాం
కవిత ఈడీ విచారణ నేపథ్యంలో రాష్ట్రానికి చెందిన ఏడుగురు మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, మహమూద్ అలీ, శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి, ప్రశాంత్ రెడ్డి.. ఢిల్లీలోనే మకాం వేశారు. కేటీఆర్, హరీశ్‌రావు శుక్రవారం రాత్రే హస్తిన చేరుకున్నారు. తర్వాత తుగ్లక్ రోడ్డులోని సీఎం క్యాంప్ ఆఫీసులో కేటీఆర్, హరీశ్, కవిత, లీగల్ టీంతో భేటీ అయ్యారు. ఒకవేళ కవితను అరెస్ట్ చేస్తే తీసుకోవాల్సిన న్యాయపరమైన అంశాలపై సలహాలు తీసుకున్నారు. శనివారం సీఎం క్యాంప్ ఆఫీసు నుంచి కవిత విచారణ వ్యవహారాలను మంత్రి కేటీఆర్ తెలుసుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఉదయం కవిత ఇంటి నుంచి బయటకు వెళ్లిన క్షణం నుంచి కేటీఆర్ అప్ డేట్స్ తెలుసుకున్నారు. ఢిల్లీలో అందుబాటులో ఉన్న ఇతర మంత్రులు, ఎంపీలు, లీగల్ టీమ్‌తో ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహించారు. పార్టీ చీఫ్, సీఎం కేసీఆర్ సలహాలు తీసుకుంటూ, పార్టీ శ్రేణులు చేపట్టాల్సిన ఆందోళనపై ఆయన దిశా నిర్దేశం చేసినట్లు తెలిసింది.
హైదరాబాద్‌కు కవిత.. కేసీఆర్‌తో భేటీ
దాదాపు 8 గంటల విచారణ తర్వాత తుగ్లక్ రోడ్డుకు చేరుకున్న కవితతో కేటీఆర్, హరీశ్ రావు సహా ఇతర మంత్రులు, లీగల్ బృందం కాసేపు ప్రత్యేకంగా భేటీ అయినట్లు తెలిసింది. ఈడీ అడిగిన ప్రశ్నలు, విచారణ జరిగిన తీరు ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. తర్వాత కేటీఆర్, హరీశ్ రావు, ఇతర మంత్రులు, ఎంపీలు, ముఖ్య నేతలు హైదరాబాద్ తిరుగుపయనమయ్యారు. రాత్రి 10 గంటలకు ఫ్యామిలీతో కలిసి కవిత ప్రత్యేక విమానంలో హైదరాబాద్ బయల్దేరి వచ్చారు. మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావుతో కలిసి నేరుగా ప్రగతి భవన్‌కు వెళ్లి.. సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. శనివారం ఉదయం నుంచి రాత్రి దాకా జరిగిన ఈడీ విచారణ గురించి కేసీఆర్‌కు వివరించారు. ఆదివారం కేసీఆర్‌తో కలిసి మరోసారి న్యాయ నిపుణులతో చర్చించనున్నారు.
రోజంతా కొనసాగిన ఉత్కంఠ
ఈడీ విచారణ సుదీర్ఘంగా కొనసాగడంతో రోజంతా ఉత్కంఠ కొనసాగింది. విచారణ తర్వాత కవితను అరెస్ట్ చేస్తారా? లేక మళ్లీ హాజరుకావాలని సమన్లు ఇస్తారా? ఒకవేళ అరెస్ట్ చేస్తే.. ఆదివారం ఆమెను ఎక్కడికి తరలిస్తారు? అలా కాదని ఆదివారం కూడా విచారణకు పిలిచి సాయంత్రం అరెస్ట్ చేస్తారా? ఇలా ఎన్నో ప్రశ్నలపై రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. కనీసం నాలుగు గంటలు ఈడీ విచారణ ఉంటుందని అందరూ భావించారు. అయితే సాయంత్రానికి కూడా విచారణ పూర్తికాకపోవడంతో నేతల్లో టెన్షన్ పెరిగింది. సాయంత్రం 6 గంటలు దాటగానే.. కవితను అరెస్టు చేస్తారేమోనని అనుమానాలు వ్యక్తమయ్యాయి. అదే సమయంలో పోలీసు బలగాలను పెంచడం, బారికేడ్లు ఏర్పాటు చేయడంతో అరెస్ట్ తప్పదన్న వార్తలు ప్రచారమయ్యాయి. దీంతో ఇటు ఈడీ ఆఫీసు ముందున్న మీడియా, బీఆర్ఎస్ కార్యకర్తలు.. అటు తుగ్లక్ రోడ్ ఉన్న మంత్రుల బృందానికి అసలు ఏం జరుగుతున్నదో అర్థంకాలేదు. రాష్ట్రంలోనూ కవితను ఈడీ విచారించడంపైనే ఎక్కువగా చర్చ జరిగింది. చాలా మంది టీవీలకు అతుక్కుపోయారు. కవిత న్యూస్ ను కవర్ చేస్తున్న మీడియా ప్రతినిధులకు పలువురు నేతలు ఫోన్లు చేసి ఆరా తీశారు. అయితే రాత్రి 7:30 తర్వాత కవిత బయటకు వస్తున్నారన్న సమాచారంతో రాజకీయ వాతావరణం చల్లబడింది.
టైమ్‌లైన్
- శుక్రవారం రాత్రి 11 గంటలు: మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, లీగల్ టీమ్‌తో కవిత భేటీ. ఈడీ విచారణపై చర్చ
- శనివారం ఉదయం 8:00: మరోసారి సమావేశం.
- 9:00: కార్యకర్తలకు తుగ్లక్ రోడ్ లో బ్రేక్ ఫాస్ట్ ఏర్పాటు చేసిన కవిత.
- 9:30: కార్యకర్తలతో చిట్ చాట్
- 10:00: పెద్ద ఎత్తున తుగ్లక్ రోడ్డుకు చేరుకున్న అభిమానులు
- 10:10: తుగ్లక్ రోడ్డు బయట భారీగా మోహరించిన పోలీసు బలగాలు, బారికేడ్ల ఏర్పాటు
- 10:20: తుగ్లక్ రోడ్డుకు చేరుకున్న ఎంపీలు కేకే, వెంకటేశ్ నేత
- 10:30: ఈడీ ఆఫీసుకు వెళ్లేందుకు ఢిల్లీ పోలీస్ కాన్వాయ్ ఏర్పాటు
- 10:55: సీఎం క్యాంప్ ఆఫ్ నుంచి బయల్దేరిన కాన్వాయ్
- 10: 58: ఇంటి మెయిన్ గేట్ వద్ద కార్యకర్తల రద్దీతో నిలిచిపోయిన కవిత కాన్వాయ్
- 11: 05: ఈడీ ఆఫీసులోకి వెళ్లిన కవిత
- మధ్యాహ్నం లంచ్ బ్రేక్. ఆహారాన్ని నిరాకరించిన కవిత
- సాయంత్రం మరోసారి గంట బ్రేక్.
- సాయంత్రం 7:50: ముగిసిన విచారణ
- 8:00: ఈడీ ఆఫీసు నుంచి బయటకు వచ్చిన కవిత వెహికల్
- 8:20కి తుగ్లక్ రోడ్డుకు చేరుకున్న కవిత
- రాత్రి 10:00 గంటలకు హైదరాబాద్‌కు పయనం