పొంగులేటి ఇండ్లు, ఆఫీసుల్లో ఈడీ సోదాలు

పొంగులేటి ఇండ్లు, ఆఫీసుల్లో ఈడీ సోదాలు
  • పొంగులేటి ఇండ్లు, ఆఫీసుల్లో ఈడీ సోదాలు
  • ఢిల్లీ నుంచి వచ్చి సెర్చ్ చేసిన 25 మంది అధికారులు
  • కుమారుడు హర్షకు చెందిన రాఘవ గ్రూప్‌‌ ఆర్థిక లావాదేవీలపై ఆరా
  • ఇవి బీజేపీ చేయిస్తున్న  దాడులు
  • పీసీసీ చీఫ్​ మహేశ్ కుమార్​ గౌడ్

హైదరాబాద్‌‌, వెలుగు:  రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల ఇండ్లు, ఆఫీసుల్లో ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్‌‌ డైరెక్టరేట్‌‌(ఈడీ) అధికారులు శుక్రవారం సోదాలు చేశారు. జూబ్లీహిల్స్‌‌లోని పొంగులేటి ఇంటితో పాటు ఆయన కుమారుడు హర్ష రెడ్డి, కూతురుకు చెందిన రాఘవ గ్రూప్‌‌ ఆఫ్‌‌ కంపెనీస్‌‌ ఆఫీసుల్లోనూ సెర్చెస్ నిర్వహించారు. కంపెనీల ఆడిటర్లు, చీఫ్ ఫైనాన్స్‌‌ ఆఫీసర్లను విచారించారు. ఢిల్లీ నుంచి వచ్చిన దాదాపు 25 మంది ఈడీ అధికారుల బృందం కేంద్ర బలగాల బందోబస్తు మధ్య సోదాలు చేపట్టింది.  రాఘవ గ్రూప్‌‌ ఆఫ్‌‌ కంపెనీస్‌‌ సహా పొంగులేటి కుటుంబ సభ్యులకు చెందిన సంస్థల ఆర్థిక లావాదేవీలపై ఈడీ అధికారులు ఆరా తీశారని, ఆడిటర్ల నుంచి వివరాలు సేకరించారని తెలిసింది. 

మనీలాండరింగ్ ఆరోపణలు.. 

హాంకాంగ్‌‌లో నివాసం ఉంటున్న మహ్మద్‌‌ ఫహెర్దీన్‌‌ ముబీన్‌‌ అనే వ్యక్తి ఈ ఏడాది ఫిబ్రవరి 5న సింగపూర్‌‌ నుంచి చెన్నైకి వచ్చాడు. అతని వద్ద పాటెక్‌‌ ఫిలిపె 5740, బ్రెగుయెట్‌‌ 2759 ఫారిన్ బ్రాండ్స్‌‌కు చెందిన రెండు లగ్జరీ వాచ్‌‌లను కస్టమ్స్‌‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వాచ్‌‌ల విలువ రూ.1.73 కోట్లుగా అంచనా వేశారు. ముబీన్‌‌ను అదుపులోకి తీసుకుని విచారించగా మధ్యవర్తి ఎ. నవీన్‌‌కుమార్‌‌ పేరును‌‌ వెల్లడించాడు. నవీన్‌‌కుమార్‌‌‌‌ ద్వారా హర్ష రెడ్డికి అందజేసేందుకు వాచ్‌‌లు తరలిస్తున్నట్లు గుర్తించారు. ఇలా స్మగ్లింగ్‌‌ రూపంలో దాదాపు రూ.7 కోట్లు విలువ చేసే ఏడు లగ్జరీ వాచ్‌‌లు హర్ష రెడ్డికి చేరినట్లు ఆరోపణలు ఉన్నాయి. అలాగే, క్రిప్టో కరెన్సీ, హవాలా రూపంలో రూ.100 కోట్ల మనీ లాండరింగ్‌‌ కూడా జరిగినట్లు కస్టమ్స్‌‌, డైరెక్టరేట్‌‌ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌‌ అధికారులు గుర్తించారు. ఈ ఏడాది మార్చి 28న చెన్నై కస్టమ్స్‌‌ అధికారులు హర్ష రెడ్డికి నోటీసులు జారీ చేశారు. మనీలాండరింగ్‌‌ వ్యవహారం కావడంతో డైరెక్టరేట్‌‌ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌‌(డీఆర్‌‌‌‌ఐ) అధికారులు ఈడీకి సమాచారం ఇచ్చారు. కస్టమ్స్‌‌, డీఆర్‌‌ఐ కేసుల ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసింది. దర్యాప్తులో భాగంగా శుక్రవారం తెల్లవారుజాము నుంచి ఏకకాలంలో పలు చోట్ల సోదాలు నిర్వహించింది.