
రాయ్‌పూర్: చత్తీస్‌గఢ్ మాజీ సీఎం, కాంగ్రెస్ నేత భూపేశ్ బాఘెల్ కుమారుడు చైతన్య బాఘెల్ఇంట్లో సోమవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సోదాలు నిర్వహించింది. మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్కేసు దర్యాప్తులో భాగంగా చైతన్య బాఘెల్ నివాసం సహా 15 ప్రదేశాలలో దాడులు నిర్వహించినట్టు అధికార వర్గాలు తెలిపాయి. భిలాయ్ (దుర్గ్ జిల్లా)లోని చైతన్య బాఘెల్ సన్నిహితుడు లక్ష్మీ నారాయణ్ బన్సాల్ అలియాస్ పప్పు బన్సాల్‌తో పాటు మరికొందరి ఇండ్లలో సోదాలు చేసినట్టు సమాచారం.
కాగా, పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన రోజే ఈ దాడులు నిర్వహించడం కుట్రలో భాగమని కాంగ్రెస్ఆరోపించింది. ప్రతిపక్షాల నుంచి ఎదురయ్యే ప్రశ్నల నుంచి తప్పించుకోవడానికి కేంద్రం ఈ సోదాలు చేపడుతోందని విమర్శించింది. సోదాల విషయం తెలుసుకున్న అనేక మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భిలాయ్‌లోని చైతన్య భాఘెల్ ఇంటి వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా వారు ఈడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
2019 నుంచి 2022 మధ్య చత్తీస్‌గఢ్‌లో భూపేశ్ భాఘెల్ సీఎంగా ఉన్న సమయంలో మద్యం కుంభకోణం జరిగిందని ఈడీ ఆరోపించింది. ఈ కుంభకోణం ద్వారా రాష్ట్ర ఖజానాకు భారీ నష్టం కలిగిందని, లిక్కర్ సిండికేట్‌కు రూ.2,100 కోట్లకు పైగా లబ్ది చేకూరిందని ఈడీ గతంలో పేర్కొంది. ఈ కేసులో జనవరిలో మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత కవాసి లఖ్మాతో పాటు రాయ్‌పూర్ మేయర్, అన్వర్ ధేబర్, మాజీ ఐఏఎస్అధికారి అనిల్ తుటేజా, ఇండియన్ టెలికాం సర్వీస్ (ఐటీఎస్) అధికారి అరుణ్‌పతి త్రిపాఠితో పాటు మరికొందరిని ఈడీ అరెస్టు చేసింది.