
- ఢిల్లీలో అదుపులోకి తీసుకున్న ఈడీ అధికారులు
న్యూఢిల్లీ: జెన్సోల్ ఇంజనీరింగ్ లిమిటెడ్ కో–-ప్రమోటర్ పునీత్ సింగ్ జగ్గీని ఈడీ ఢిల్లీలోని ఒక హోటల్‌లో గురువారం అదుపులోకి తీసుకుంది. ఢిల్లీ, గురుగ్రామ్, అహ్మదాబాద్‌లోని వీరి ఆస్తులపై దాడులు నిర్వహించింది. ఆర్థిక దుష్ప్రవర్తన, కార్పొరేట్ మిస్గవర్నెన్స్, నిధుల మళ్లింపు ఆరోపణలపై సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ (ఫెమా) కింద ఈ చర్యలు చేపట్టింది. పునీత్ జగ్గీ సోదరుడు, మరో కో–-ప్రమోటర్ అన్మోల్ సింగ్ జగ్గీ దుబాయ్‌లో ఉన్నట్లు సమాచారం.
జగ్గీ బ్రదర్స్ వ్యక్తిగత లాభాల కోసం జెన్సోల్ ఇంజనీరింగ్ నుంచి కార్పొరేట్ నిధులను దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ సెబీ మధ్యంతర ఉత్తర్వును అనుసరించి ఈడీ చర్య తీసుకుంది. ఈవీల కొనుగోలు కోసం తీసుకున్న నిధులను వీళ్లు దుర్వినియోగం చేశారు. ఈ డబ్బుతో విదేశీ ఆస్తులను కొన్నారు. వ్యక్తిగత ఖర్చులకు వాడుకున్నారు. షెల్ కంపెనీలకు డబ్బు మళ్లించారు. తదుపరి నోటీసు వచ్చేవరకు జగ్గీ సోదరులు సెక్యూరిటీస్ మార్కెట్‌లోకి ప్రవేశించకుండా సెబీ నిషేధించింది. జెన్సోల్ ఇంజనీరింగ్, సోలార్ కన్సల్టింగ్, ఈపీసీ సేవలు, ఎలక్ట్రిక్ వాహనాల లీజింగ్ వంటి వ్యాపారాల్లో ఉంది.