- భూదాన్ భూముల స్కామ్‌లో డీజీపీకి ఈడీ సిఫార్సు
- రెవెన్యూ ఆఫీసర్లకు కూడాబిగుస్తున్న ఉచ్చు
- తాజాగా ఎంట్రీ ఇచ్చినభూదాన్ యజ్ఞ బోర్డ్
- మహేశ్వరం తహసీల్దార్ సహాఐదుగురికి నోటీసులు
- డిసెంబర్ 6న బోర్డు ఎదుటహాజరుకావాలని ఆదేశాలు
హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా నాగారం భూదాన్ భూముల అన్యాక్రాంతం కేసులో రెవెన్యూ అధికారుల చుట్టూ ఉచ్చు బిగుస్తున్నది. ఈడీ సిఫార్స్ మేరకు ఐఏఎస్ అమోయ్‌కుమార్‌తో పాటు అప్పటి మహేశ్వరం ఆర్డీవో వెంకటాచారి, అప్పటి తహసీల్దార్ జ్యోతి సహా మరికొంత మందిపై క్రిమినల్ కేసుల నమోదుకు పోలీసులు రెడీ అవుతున్నారు. మరోవైపు ఈ అధికారులు సాగించిన భూదందాపై భూదాన్ యజ్ఞ బోర్డ్ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా నాగారం గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 181కు సంబంధించి రికార్డులను బోర్డు క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. ప్రస్తుత మహేశ్వరం తహసీల్దార్‌తో పాటు భూదాన్ భూములను రిజిస్ట్రేషన్ చేసుకున్న ఖాదిరున్నిస్సా, ఈఐపీఎల్ కన్ స్ట్రక్షన్స్, బొబ్బిలి విశ్వనాథ్‌రెడ్డి, ఎన్.సంతోష్‌కుమార్‌కు భూదాన్ యజ్ఞ బోర్డ్ సెక్రటరీ తాజాగా నోటీసులు జారీ చేశారు. డిసెంబర్ 6న నాంపల్లి సీసీఎల్‌ఏ ఆఫీసులోని బోర్డ్ ముందు హాజరుకావాలని ఆదేశించారు.
భూదాన్ యజ్ఞ భూములు అన్యాక్రాంతం
మహేశ్వరం మండలం నాగారంలోని గ్రామ పరిధిలో కోట్ల విలువజేసే 42 ఎకరాల 33 గుంటల భూదాన్ యజ్ఞ భూములు అన్యాక్రాంతమయ్యాయి. ఈ భూములకు 2005లో మహ్మద్ అక్బర్ అలీఖాన్, మహ్మద్ ఫరూక్ అలీఖాన్ అనే వ్యక్తులు వారసులుగా పట్టాలు తెచ్చుకున్నారు. ఆ తర్వాత షరీఫ్, ముజఫర్ హుస్సేన్ ఖాన్‌లు భూ యజమానులుగా రెవెన్యూ రికార్డుల్లోకి వచ్చారు. అనంతరం ఈ భూములకు వారసురాలు తానే అంటూ మహ్మద్ ఖాదిరున్నిస్సా సక్సేషన్ దరఖాస్తు చేసుకున్నారు. అమోయ్‌కుమార్ కలెక్టర్‌గా ఉన్నప్పుడు 2021లో ఈమె పేరుతో రిజిస్ట్రేషన్జరిగింది. అనంతరం ఈ భూమిని ఖాదిరున్నిస్సా బేగం ఈఐపీఎల్ కన్ స్ట్రక్షన్స్‌కు విక్రయించింది. దీనిపై దస్తగిరి అనే వ్యక్తి రంగారెడ్డి జిల్లా కోర్టును ఆశ్రయించాడు. కోర్టు ఆదేశాల మేరకు గతేడాది మహేశ్వరం పోలీసులు కేసు నమోదు చేశారు. మహేశ్వరం ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించడంతో రెవెన్యూ అధికారుల పాత్ర బయటకు వచ్చింది.
పక్కా ఆధారాలు సేరించిన ఈడీ
రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి కలెక్టర్‌గా పనిచేసిన ఐఏఎస్ అమోయ్ కుమార్‌ను గత నెల 23, 24, 25 తేదీల్లో ప్రశ్నించారు. భూదాన్ భూములు, నిషేధిత జాబితాలో ఉన్న భూముల రిజిస్ట్రేషన్స్‌కు చెందిన వివరాలను సేకరించారు. మహేశ్వరం మాజీ తహసీల్దార్, సబ్‌రిజస్ట్రార్ ఆర్‌పీ జ్యోతితో పాటు ఈఐపీఎల్ కన్ స్ట్రక్షన్ కొండపల్లి శ్రీధర్ రెడ్డి సహా దాదాపు 15 మంది స్టేట్‌మెంట్స్‌ను ఈడీ ఇప్పటికే రికార్డ్ చేసింది. ధరణిలో మార్పులు, ఫోర్జరీ డాక్యుమెంట్స్‌తో రూ.వందల కోట్ల విలువ చేసే భూములను రియల్టర్లకు అప్పగించినట్లు ఈడీ గుర్తించింది. ఈ మేరకు మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు చేస్తున్నది. ఇందులో భాగంగా ఐఏఎస్ అమోయ్‌కుమార్ సహా రెవెన్యూ అధికారులు, ప్రైవేట్ వ్యక్తులపై కేసులు నమోదు చేయాలని ఈ నెల 9న డీజీపీ జితేందర్‌కు నివేదిక ఇచ్చింది.
ఎఫ్‌ఐఆర్‌లకు రంగం సిద్ధం!
ఈడీ సిఫార్స్ మేరకు ఐఏఎస్ అమోయ్‌కుమార్‌తో పాటు రెవెన్యూ ఆఫీసర్లపై పోలీసులు క్రిమినల్ కేసులు రిజిస్టర్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపై ఈడీకి అందిన 12 ఫిర్యాదులతో పాటు నాగారంలోని 42 ఎకరాల 33 గుంటల భూదాన్ యజ్ఞ భూములకు సంబంధించిన డాక్యుమెంట్లను డీజీపీకి అందించారు. బాధ్యులైన వారిపై కేసులు నమోదు చేసి తమ దర్యాప్తుకు సహకరించాలని ఈడీ అధికారులు కోరారు. దీంతో డీజీపీ ఆఫీసు లీగల్ యాక్షన్ ప్రారంభించింది. ఈడీ అందించిన ల్యాండ్ డాక్యుమెంట్స్, సీసీఎల్‌ఏ రికార్డులను కూడా పరిశీలించినట్లు తెలిసింది. సీసీఎల్‌ఏ రికార్డులు, ప్రభుత్వ అధికారులు, బాధితుల స్టేట్‌మెంట్స్ ఆధారంగా రెవెన్యూ అధికారులపై కేసులు నమోదు చేయనున్నట్లు సమాచారం. అమోయ్‌కుమార్ సహా సంబంధిత అధికారులపై ఎఫ్‌ఐఆర్ రిజిస్టర్ చేయడంతో పాటు న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా డీజీపీ కార్యాలయం ఇప్పటికే లీగల్ అడ్వైజ్ తీసుకున్నట్లు తెలిసింది.