![ఆప్ ఎంపీ సన్నిహితుల ఇండ్లలో ఈడీ సోదాలు](https://static.v6velugu.com/uploads/2023/05/ED-searched-the-houses-of-Aam-Aadmi-Party-MP-Sanjay-Singh's-close-friends_mqzHYMWO3e.jpg)
ఆప్ ఎంపీ సన్నిహితుల ఇండ్లలో ఈడీ సోదాలు
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో భాగంగా తనిఖీలు
న్యూఢిల్లీ : ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఎంపీ సంజయ్ సింగ్ సన్నిహితుల ఇళ్లలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం సోదాలు చేసింది. ఎంపీ సన్నిహితులు అజిత్ త్యాగి, సర్వేశ్ మిశ్రా నివాసాల్లో ఈడీ అధికారులు తనిఖీలు చేశారు. మనీ లాండరింగ్ కేసులో దాదాపు 6 సంస్థల లావాదేవీల గురించి అధికారులు ఆరా తీశారని సమాచారం. ఈ కేసులో ఇప్పటికే నిందితులుగా ఉన్నవారు ఇచ్చిన సమాచారం ఆధారంగా అజిత్, సర్వేశ్ ఇళ్లలో సోదాలు చేశారు. వారిద్దరికీ ఎంపీ సంజయ్కు సంబంధాలు ఉన్నాయని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. కాగా, ఈ కేసులో తనపై నిరాధార ఆరోపణలు చేసినందుకు ఈడీ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్, దర్యాప్తు అధికారిని ప్రాసిక్యూట్ చేయాలని కోరుతూ ఎంపీ సంజయ్ గతంలో ఆర్థిక శాఖ సెక్రటరీకి లేఖ రాశారు. అయితే, చార్జిషీటులో సంజయ్ పేరును పొరపాటున చేర్చామని, దానిని సరిదిద్దడానికి కోర్టుకు విజ్ఙప్తి చేసిన విషయాన్ని ఈడీ అధికారులు గుర్తుచేశారు.
ఇది అధికార దుర్వినియోగమే : ఎంపీ సంజయ్
తన సన్నిహితుల ఇళ్లలో ఈడీ అధికారులు సోదాలు చేయడంపై ఎంపీ సంజయ్ సింగ్ మండిపడ్డారు. కేంద్రానిది అధికార దుర్వినియోగమని ఆయన ఆరోపించారు. బుధవారం ఢిల్లీలో మీడియాతో ఆయన మాట్లాడారు. అదానీ హిండెన్ బర్గ్ వివాదంపై ప్రధానిని ప్రశ్నిస్తూనే ఉంటానన్నారు.