
హైదరాబాద్: ఫాల్కన్ స్కామ్ కేసు దర్యాప్తులో ఈడీ దూకుడుగా ముందుకెళుతోంది. ఫాల్కన్ కేసులో ప్రధాన నిందితుడు అమర్ దీప్ కుమార్ చెందిన ప్రైవేట్ జెట్ విమానాన్ని ఈడీ అధికారులు సీజ్ చేశారు. ఫాల్కన్ సంస్థ రూ. 850 కోట్ల స్కాంకు పాల్పడిందని, అమర్ దీప్ కుమార్ ఇదే విమానంలో జనవరి 22న దుబాయ్ పారిపోయినట్టు ఈడీ గుర్తించింది. ఫాల్కన్ స్కామ్లో వచ్చిన డబ్బులతోనే రూ. 14 కోట్లు పెట్టి ఈ విమానాన్ని అమర్ దీప్ కొనుగోలు చేసినట్టు ఈడీ గుర్తించింది. ఈ కంపెనీ చైర్మన్ అమర్ దీప్ మరి కొంతమంది కీలక వ్యక్తులు పరారీలో ఉన్నారు. ఇదే కేసులో ఫిబ్రవరి 15న సైబరాబాద్ పోలీసులు ఫాల్కన్ డైరెక్టర్స్ పవన్ కుమార్, కావ్య నల్లూరిని అరెస్ట్ చేశారు.
అసలు ఈ ఫాల్కన్ స్కామ్ కేసు ఏంటి..?
హైదరాబాద్లోని హైటెక్ సిటీ హుడా ఎన్‌క్లేవ్ కేంద్రంగా ఫాల్కన్ క్యాపిటల్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆన్‌లైన్ మల్టీ లెవల్ మార్కెటింగ్ నిర్వహించేది. అమర్ దీప్ కుమార్ డైరెక్టర్‌గా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఆర్యన్ సింగ్, సీఈవో యోగేందర్ సింగ్ కలిసి పోన్జీ స్కీమ్ పేరుతో 2021 నుంచి డిపాజిట్లు సేకరించారు. ఆన్‌లైన్ మార్కెటింగ్ కోసం మొబైల్ అప్లికేషన్లు, వెబ్‌సైట్లను రూపొందించారు. ఫ్యాబ్రికేటెడ్ ప్రొఫైల్స్‌తో బ్రిటానియా, అమెజాన్, గోద్రేజ్ సహా పలు ప్రముఖ కంపెనీలకు సంబంధించిన వెండర్స్గా ప్రొఫైల్స్ తయారు చేశారు. వీటితో ఆన్‌లైన్‌లో ప్రకటనలు చేశారు.
తమ వద్ద ఆన్‌లైన్‌లో పెట్టుబడులు పెడితే తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు ఇస్తామంటూ డిపాజిట్లు సేకరించారు. పెట్టుబడి పెట్టిన మొత్తానికి ఏటా11 శాతం నుంచి 22 శాతం రిటర్న్స్ ఇస్తామని నమ్మించారు. ఇలా నాలుగేండ్ల పాటు 6,979 మంది నుంచి రూ.1,700 కోట్లు వసూలు చేశారు. ఇందులో రూ.850 కోట్లు డిపాజిటర్లకు తిరిగి చెల్లించారు. వారికి తిరిగి చెల్లించాల్సిన మరో రూ.850 కోట్లను 14 రకాల షెల్ కంపెనీల అకౌంట్లకు మళ్లించారు.